MLA Komatireddy: నాకు మంత్రి పదవి రాకుండా చూస్తోంది అతనే: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:45 PM
మంత్రి పదవి తనకు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో మాజీ హోంమంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.

యాదాద్రి: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి జానారెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి, మరికొంతమంది వ్యక్తులు తనకు మంత్రి పదవి రాకుండా ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదని.. కెపాసిటీని బట్టి వస్తుందన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పదవిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.."మంత్రి పదవి అనేది అలంకారం కాదు ఓ బాధ్యత. దాన్ని గుర్తించి ప్రజలకు మంచి చేయాలి. తెలంగాణను గతంలో పాలించింది కుటుంబ పార్టీ. వారికి వంగి వంగి దండాలు పెట్టిన వారికే మంత్రి పదవులు ఇచ్చారు. కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ.. బడుగు బలహీన వర్గాల పార్టీ. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటంలా కాదు.. బాధ్యతగా భావిస్తా. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తోంది.
ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా? అని ఓ వ్యక్తి అంటున్నారు. దేశం తరఫున క్రికెట్లో అన్నదమ్ములు యూసుఫ్ పటాన్, ఇర్ఫాన్ పటాన్ ప్రాతినిధ్యం వహిస్తే లేనిది మంత్రి పదవులు ఇద్దరికి ఇస్తే తప్పా. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు.. కెపాసిటిని బట్టి వస్తుంది. 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి నేడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వారికి మంత్రి పదవి ఇవ్వాలని గుర్తొచ్చింది.
హైదరాబాద్, మహబూబ్ నగర్ , మెదక్ లాంటి జిల్లాల్లో మంత్రులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినా ఎంపీలు గెలవలేదు. భువనగిరిలో ఒక ఎమ్మెల్యేగా నేను గెలిపించా. నా మంత్రి పదవి విషయంలో కొందరు దుర్మార్గులు, జానారెడ్డి లాంటి వ్యక్తులు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకొని ఉంటాడే తప్పా అడుక్కునే స్థితిలో ఉండడని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: యువకుడిని తరిమిన ట్రాఫిక్ పోలీసులు.. చివరికి ఏమైందంటే..
Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్ కారు