రేషన్ దుకాణం.. బహుదూరం
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:56 AM
రేషన్ దుకాణాలు బహుదూరం ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో నూతన గ్రామపంచాయతీలు ఏర్పడిన నాటి నుంచి పరిస్థితులు మరింత జటిలంగా మారాయి.

మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల ప్రయాణం
వ్యయ ప్రయాసలతో వృద్ధుల ఇబ్బందులు
కొత్త పంచాయతీల ఏర్పాటుతో సమస్య తీవ్రం
(ఆంధ్రజ్యోతి-భువనగిరి రూరల్): రేషన్ దుకాణాలు బహుదూరం ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో నూతన గ్రామపంచాయతీలు ఏర్పడిన నాటి నుంచి పరిస్థితులు మరింత జటిలంగా మారాయి. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం కోసం అరకొరగా వెళ్లిన లబ్ధిదారులు, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో తెచ్చుకునేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఇలా రేషన్ దుకాణాలకు వెళ్లాలంటే కొన్ని పంచాయతీల్లో మహిళలు, వృద్ధులు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.
జిల్లాలో మొత్తం 421 గ్రామ పంచాయతీ ల్లో కొత్తగా 69 గ్రామపంచాయతీలు ఏర్పడ్డా యి. చాలాచోట్ల పూర్వ పంచాయతీల్లోనే రేషన్ దుకాణాలు మూడు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొత్త గ్రామ పంచాయతీలతోపాటు అవసరమున్న చోట రేషన్ దుకాణాల ఏర్పాటుకు పౌరసరఫరాలు, రెవె న్యూ శాఖల నుంచి వివరాలు సేకరించింది. ఐదేళ్లు దాటినా ఎలాంటి ఫలితంలేదు. ప్రత్యామ్నాయంగా దుకాణాలు లేని గ్రామాల్లోకి డీలర్లు సరుకులు తీసుకుని పంపిణీ చేయాలని ప్రాథమికంగా ఆదేశించినా అమలు కావడంలేదు. రవాణా ఖర్చు భారమవుతుందని డీలర్లు తమ దుకాణాల్లోనే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. భువనగిరి మం డలంలోని పెంచికల్‌పహాడ్, అదే గ్రామపరిధిలోని రామకిష్టాపురం గ్రామాలకు సంబంధించి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో మరో గ్రామమైన మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి వెళ్లి లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకెళ్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకా రం చుట్టడంతో లబ్ధిదారులు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో దొడ్డుబియ్యం పంపిణీ చేపట్టడంతో కొంతమేర లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. అయితే భువనగిరి మండలంలో ని పూర్వపు బొల్లేపల్లిలోగల సిరివేణికుంట గత ప్రభుత్వ హయాంలో నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింది. అయితే సిరివేణికుంట నుంచి బొల్లేపల్లికి సుమారు 3కి.మీ. దూరం ఉంటుంది. కొత్త గ్రామపంచాయతీ సిరివేణికుంటలో రేషన్ షాపు లేకపోవడంతో గత్యంతరం లేక బొల్లేపల్లికి వచ్చి లబ్ధిదారులు రేషన్ సరుకులను తీసుకెళ్తున్నారు. జిల్లాలో దాదాపు 65 పైచిలుకు నూతన గ్రామపంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. స్థోమత ఉన్న లబ్ధిదారులు వాహనాలపై, లేని వారు కాలినడకన వెళ్లి సరుకులు తీసుకెళ్తున్నారు. వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక రేషన్ షాపును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో లబ్ధిదారుల వివరాలు ..
మండలాలు 17
గ్రామ పంచాయతీలు 421
రేషన్ దుకాణాలు 515
ఆహార భద్రత కార్డులు 2,16,841
యూనిట్లు 6,60,055
ప్రతి నెల కోటా (మెట్రిక్ టన్నుల్లో) 4,216.326
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి : ఎం కృష్ణారెడ్డి, ఆర్డీవో భువనగిరి
నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు చౌకధరల దుకాణాలు కొత్తగా ఏర్పాటు చేయడమనేది ప్రభుత్వ విధానం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్తగా రేషన్ షాపులకు కూడా నోటిఫికేషన్ జారీ చేసేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్తాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం.
మూడు కిలోమీటర్లు నడవాల్సిందే : సిల్వేరు ఎల్లమ్మ, పెంచికల్ పహాడ్
భువనగిరి మండలంలోని పెంచికల్‌పహాడ్ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామపంచాయతీకి రామచంద్రాపురం రేషన్ షాపు నుంచి తాము బియ్యం తెచ్చుకుంటున్నాం. గత పదేళ్లనుంచి మా గ్రామంలో రేషన్ దుకాణం ఏర్పాటు కాలేదు. రేషన్ షాపు ఏర్పాటు చేయాలని గతంలో ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులకు విన్నవించాం. ఇప్పటివరకు మా సమస్య పరిష్కారం కాలేదు.