Share News

సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:55 AM

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి.. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు..

సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు

విఽధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

ప్రభుత్వ పథకాల అమలుకు క్షేత్రస్థాయిలో పరిశీలన

విద్య, వైద్యంపై స్పెషల్‌ ఫోకస్‌

నిత్యం ఆస్పత్రులు, పాఠశాలలు, హాస్టళ్లలో తనిఖీలు, రాత్రి బస

స్థానిక సంస్థల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేకాధికారులపై పర్యవేక్షణ

‘ఆంధ్రజ్యోతి’తో కలెక్టర్‌ ఎం.హనుమంతరావు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి.. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదు.. జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ, ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేస్తున్నాం.. ఉద్యోగులంతా సమయపాలన పాటించాలి.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా చేపట్టిన సమగ్ర ఆర్థిక, సామాజిక, కుల గణన ఇం టిం టి సర్వేను విజయవంతంగా చేపట్టాం.. జిల్లాలోని రుణమాఫీ, రైతు బీమా, పీఎం కిసాన్‌, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు సకాలంలో అందించేలా పర్యవేక్షిస్తున్నాం.. అని కలెక్టర్‌ ఎం.హనుమంత్‌రావు పేర్కొన్నారు. ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ విశేషాలు ఇలా..

జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటు న్నాం. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో పాటు రైతుల రుణమా ఫీ, తదితర పథకాలను అమలు చేస్తోంది. వాటిని అర్హులైన లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందించేలా కృషి చేస్తు న్నాం. జిల్లాలో ధరిణి సమస్యలు చాలా వరకు అపరిష్కృతం గా ఉ న్నాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్యంతో పాటు అభివృద్ధి కార్యక్రమా ల పురోగతిపై నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తనిఖీచేస్తు న్నాం. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తు న్నాం. ప్రజల నుంచి వచ్చే అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేస్తున్నాం.

నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు

ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. విధుల్లో నిర్లక్ష్యం చూపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల్లోని పలు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలు, వైద్యశాలలను తనిఖీచేసి ప్రజలకు, విద్యార్థులకు అందుతున్న సేవలను పరిశీలిస్తున్నాం. ఆస్పత్రులకు వైద్యం కోసం ప్రజలు ఎంతో నమ్మకంతో వస్తారు. వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, పీహెచ్‌సీలను, ఏరియా ఆస్పత్రులను నిత్యం అధికారులతో తనిఖీలు చేయిస్తున్నాం. అయా ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీసి, రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురికి షోకా జ్‌ జారీ చేశాం. వైద్యులు సకాలంలో ఆస్పత్రులకు వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం. వైద్యులతో నిత్యం గూగుల్‌ మీట్‌ నిర్వహిస్తున్నాం. రోగులతో నేరుగా మాట్లాడించేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతగా ఉండాలని ఆదేశాలు జారీచేశాం. పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మెనూ అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యమైన భోజనం అందించని వారికి షోకాజ్‌తో పాటు సస్పెన్షన్‌ ఆదేశాలు జారీచేస్తున్నాం.

హాస్టళ్లలో రాత్రి బస

సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. కలెక్టర్‌తో పాటు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు హాస్టళ్లల్లోనే రాత్రి బసచేయాలని నిర్ణయించాం. నారాయణపూర్‌లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్‌లో నేను రాత్రిబస చేశా. విద్యార్థులతో కలిసి రాత్రి నిద్ర చేయడంతో పాటు వారికి అందిస్తున్న భోజనం, దినచర్య గురించి అడిగి తెలుసుకున్నా. స్టాక్‌ రిజిస్టర్‌, స్టోర్‌రూం, నిత్యావసర వస్తువులు, గుడ్లు, కూరగాయలు, ఇతర సరుకులను స్వయంగా పరిశీలించా. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.

ప్రత్యేకాధికారులపై పర్యవేక్షణ

జిల్లాలో మొత్తం 17 మండలాలు, 421 గ్రామపంచాయతీ లు, ఆరు మునిసిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుతం జడ్పీ, మండల పరిషత్‌ల పాలకవర్గం గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. జిల్లా పరిషత్‌ ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యతలు తీసుకున్నా. మండల పరిషత్‌, గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాం. గ్రామాల్లో పరిపాలనాపరంగా ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశాం. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ, స్థానిక సంస్థల పాలనను పర్యవేక్షిస్తున్నాం. అధికారు ల పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కారించాల్సిన అంశాలపై నిర్లక్ష్యం చేయవద్దని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించాం. ప్రత్యేకాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌, వీడియోకాల్‌, గూగుల్‌ మీట్‌లు నిర్వహిస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నాం.

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దని ఆదేశాలు

కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై అర్జీలు అందజేస్తున్నారు. అందులో అధిక మొత్తంలో రెవెన్యూపరమైన అర్జీలే ఉంటున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశాలు జారీచేస్తున్నాం. రైతుల భూములు వేరే వారి ఖాతాల్లో వెళ్లడం, పేరు తప్పుగా పడటం, సర్వే నెంబర్లు మార్పు కావడంతో పాటు, భూమి ఉండి కూడా లేని వారిగా మారిపోయినవారు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ ఫిర్యాదులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కోర్టు కేసులు ఉన్న భూములు కాకుండా, జిల్లా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో పరిష్కారించాల్సిన దరఖాస్తులన్నింటినీ పూర్తిచేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి తహసీల్దార్‌ కార్యాలయాలను తనిఖీ చేస్తున్నాం. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీచేశాం. ఆయా శాఖల అధికారులు వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తున్నారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న పనులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.

Updated Date - Jan 01 , 2025 | 12:55 AM