సిబ్బంది కొరతతో ఇబ్బంది
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:25 AM
యాసంగి సీజన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కో కేంద్రానికి కమ్యూనిటీ కోఆర్డినేటర్ల(సీసీ)లను ఇనచార్జిగా నియమించారు.

ఒక్కో సీసీకి 8 కేంద్రాల కేటాయింపు
దూర ప్రాంతాల్లో ఉండటంతో కొరవడిన పర్యవేక్షణ
ఏఈవోలకూ తప్పని పనిఒత్తిడి
తరుగు పేరుతో దోపిడీ
యాసంగి సీజన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కో కేంద్రానికి కమ్యూనిటీ కోఆర్డినేటర్ల(సీసీ)లను ఇనచార్జిగా నియమించారు. వసతుల ఏర్పాటుతో పాటు కొనుగోళ్లలో ఏ తప్పు జరిగినా వీరిపైనే వేటుపడుతుంది.అయితే ఒక్కో సీసీకి ఎనిమిది కేంద్రాల వరకు ఇనచార్జిలుగా నియమిస్తున్నారు. ఆయా కేంద్రాలు దూరంగా ఉండటం, ఒత్తిడి పెరగడంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఇబ్బందిగా మారుతోంది. దీంతో మౌలిక వసతుల లేమితో పాటు ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎవరు తప్పు చేసినా వేటు మాత్రం సీసీపైనే పడుతుంది.
- (ఆంధ్రజ్యోతి-భానుపురి)
యాసంగి సీజనలో కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలను విక్రయించడానికి రైతులు నానాతంటాలు పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా సరైన సిబ్బంది లేక ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. జిల్లాలో సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లకు సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 286 సెంటర్లను ఏర్పాటు చేస్తుండగా అందులో 74 సన్నరకం ధాన్యం కొనగోలుకు, 212 దొడ్డు రకం ధాన్యం కొనుగోలు నిర్ణయించారు. జిల్లాలో 4.85 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 12 లక్షల మెట్రిక్‌టన్నులు ధాన్యం రావచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు దొడ్డు ధాన్యం, సన్నాలు మరో 2లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రాలకు రావచ్చని అధికారులు చెబుతున్నారు. మిగతా 6 లక్షల ధాన్యం మిల్లులకు నేరుగా వెళ్లే అవకాశం ఉంటుందంటున్నారు.
286 సెంటర్లకు 41 మందే
జిల్లాలో సన్న,దొడ్డు రకాల కొనుగోలకు ససంబంధించి మొత్తం 41 మంది మాత్రమే కమ్యూనిటీ కోఆర్డినేటర్లు ఉన్నారు. వీరికి తోడు 82 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు. సీసీలు ఒక్కొక్కరికి 6 నుంచి 8 సెంటర్లు కేటాయించాల్సి వస్తోంది. ఏఈవోలకు 3 నుంచి 4 కేంద్రాలు కేటాయించడంతో కొనుగోళ్లలో సంఘబంధం నిర్వాహకులే కీలకమవుతున్నారు.
దోపిడీకి గురవుతున్న రైతులు
జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు దోపీడీకి గురవుతున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందని మిల్లర్లు సాకులు చెబుతూ క్వింటాళ్ల కొద్దీ ధాన్యం తరుగు చూపిస్తూ రైతులను నష్టపరుస్తున్నారు. కేంద్రాల నుంచి ధాన్యం లారీల్లో ఎగుమతి చేసుకున్న తర్వాత కూడా తరుగు సాకు చూపిస్తున్నారు. కొన్ని మండలాల్లో మండల స్థాయి అధికారి నుంచి సంఘబంధం నిర్వాహకుల వరకు మిల్లర్లతో కుమ్మక్కై తరుగు తీస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సెంటర్లలో మౌలిక వసతులు సైతం సక్రమంగా ఏర్పాటుచేయడం మరిచిపోతున్నారు. రైతులు చేసేదేమీ లేక కాంటాలు అయితే చాలుఅన్నట్లుగా ఉంటున్నారు. రైతుల వద్ద నుంచి పురుకోసలు, బస్తాల ఖర్చులు తీసుకుంటున్నా అడిగేవారులేరు.
ఇవీ బాధ్యతలు
కొనుగోలు సెంటర్‌లో సీసీలు కాంటాలు, బస్తాల బాధ్యత, మిల్లులకు లారీల ఎగుమతులు, దిగుమతులు, ఆనలైనలో రిపోర్టు చేయడం లాంటి బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటోంది. ట్రక్‌సీట్స్ సైతం సంఘబంధం నిర్వాహకులను వెంట తీసుకుని తేవాల్సిన వస్తోంది. సెంటర్‌లో ఏ తప్పు జరిగినా సెంటర్ ఇనచార్జిదే బాధ్యత ఉంటోందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గత వానాకాలం సీజనలో ఓ కేంద్రంలో సీసీకి తెలియకుండా సంఘబంధం నిర్వాహకులు ఓ రైతుకు ధాన్యం తేకపోయినా బస్తాలను ఇచ్చారు, దీంతో సీసీపై వేటుపడింది. ఏఈవోలు తేమశాతం, రైతులా, వ్యాపారులా అని చూడడం, పట్టాదారు పాస్‌పుస్తకాలు చూడడం చేస్తున్నారు. గ్రామసంఘబంధం సంఘాల కమిటీ సభ్యులు మాత్రం కాంటాలు వేయడం ట్యాబ్‌లో ఎంట్రీ, బస్తాలు తీసుకురావడం, మిల్లులకు వెళ్లి దిగుమతి చేయించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా సెంటర్‌లో ఇబ్బంది తలెత్తితే రెవెన్యూ, ఎంపీడీవో, వ్యవసాయాధికారులు పరిశీలించడం వారివంతుగా వస్తోంది. సీసీలు, ఏఈవోలు, సంఘబంధం కమిటీ సభ్యులే కొనుగోలు కేంద్రాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారు.
హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో వరి పంటలను ఎక్కువ శాతం మిల్లులకు తరలిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఏఈవోలు, సీసీలు సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలో ఆనడ్యూటీలో విధులు నిర్వహించడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. వీరికి గతంలో అలవెన్సలు సైతం ఇవ్వకపోవడంతో ఇక్కడికి రావడానికి ఇబ్బందిపడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు.
తుంగతుర్తిలో 16 కేంద్రాలకు ఒక్కడే
జిల్లాలో కొన్ని మండలాల్లో సీసీలపై తీవ్ర పనిఒత్తిడి ఉంది. తుంగతుర్తి మండలంలో 16 కేంద్రాలకు ఒక్కడే సీసీ కాగా, అర్వపల్లిలో 13 కేంద్రాలకే ఒక్కడు బాధ్యతలు చూస్తున్నారు. చివ్వెంల మండలంలో 18 కేంద్రాలకు ఇద్దరు, నాగారం 9 కేంద్రాలకు ఒక్కడు చూస్తున్నారు. సిబ్బంది సరిపడా లేకపోవడంతో ఎక్కువ సెంటర్లను కేటాయిస్తున్నారు. దీంతో మానిటరింగ్‌కు ఇబ్బంది కలుగుతున్నట్లు సీసీలు చెబుతున్నారు. కొన్నిచోట్ల కేంద్రాలు దూరందూరంగా ఉండటంతో ఒక రోజులో రెండు, మూడు కేంద్రాలకు మించి చూడలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతో ఏ అక్రమాల చోటు చేసుకున్నా సీసీలు బాధ్యులు కావాల్సి రావడంతో పాటు రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
సిబ్బంది కొరత లేకుండా చూస్తాం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తాం. మౌలిక వసతులు ఏర్పాటుచేసేలా నిర్వాహకులకు ఆదేశాలిచ్చాం. అవకతవకలకు పాల్పడితే సెంటర్ ఇనచార్జిలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఫ అప్పారావు, డీఆర్‌డీఏ పీడీ, సూర్యాపేట