గుర్రపుడెక్కను తొలగించరేమీ?
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:13 AM
అసలే వేసవి..చుక్క నీటిని ఒడిసి పట్టాల్సిన సమయం. అలాంటిది కాల్వ గేట్లకు గుర్రపు డెక్క ఆకు అడ్డంకిగా మారి..నీటి ప్రవాహాన్ని మందగింప చేస్తోంది.

పిలాయిపల్లి కాలువ గేట్లకు అడ్డంకి..
గేట్ల నుంచి వెళ్లలేక పోతున్న జలాలు
ఆకు నిరోధంతో పెరుగుతున్న బ్యాక్ వాటర్
చౌటుప్పల్ టౌన, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): అసలే వేసవి..చుక్క నీటిని ఒడిసి పట్టాల్సిన సమయం. అలాంటిది కాల్వ గేట్లకు గుర్రపు డెక్క ఆకు అడ్డంకిగా మారి..నీటి ప్రవాహాన్ని మందగింప చేస్తోంది. ఇదంతా రైతుల దృష్టిలో ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. అలాగని అధికారులు కూడా చొరవచూపి సమస్యను పరిష్కరించడంలేదు. చౌటుప్పల్ మండలం తూప్రాన పేట సమీపంలోని పిలాయిపల్లి కాల్వలోని గేట్ల వద్ద పెరిగిన గుర్రం డెక్క ఆకు మూసీ జలాల ప్రవాహానికి అడ్డంకిగా మారింది. మూసీ జలాలు సజావుగా ముందుకు వెళ్లకుండా ఈ ఆకు నిరోధిస్తోంది. దీంతో మైసమ్మ కత్వ వద్ద చిన మూసీ నదిలో బ్యాక్ వాటర్ పెరిగిపోతుంది. రంగారెడ్డి జిల్లా బాచారం సమీపంలోని మూసీ నదిలో ఏర్పాటు చేసిన పిలాయిపల్లి కత్వ నుంచి భూదాన పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల మండలాలకు ప్రత్యేక కాల్వ ద్వారా మూసీ జలాలు ప్రవహిస్తున్నాయి. ఈ కాల్వ ద్వారా ప్రవహిస్తున్న మూసీ జలాలు మూడు మండలాల్లోని అనేక గ్రామాల రైతుల పొలాలకు సాగు నీటిని అందిస్తున్నాయి. కాల్వ ద్వారా వెళుతున్న మూసీ జలాల నియంత్రణ కోసం మండల పరిధిలోని తూప్రానపేట సమీపంలోని చిన్న మూసీ నదిలో మైసమ్మ కత్వకు దిగువ( తూర్పు) భాగంలో నాలుగు తలుపులతో ఒక ప్రత్యేక గేట్‌ను ఏర్పాటు చేశారు. మైసమ్మ కత్వ నుంచే పిలాయిపల్లి కాలువ జలాలు క్రాస్ జరిగి చౌటుప్పల్, చిట్యాల మండలాలకు వెళతాయి. గేట్ పెభాగంలోని మైసమ్మ కత్వలో పెరిగిన గుర్రపు డెక్క ఆకు పిలాయిపల్లి కాల్వ జలాల ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయి. దీంతో మూసీ జలాలు పై (పశ్చిమ) భాగంలోని చిన్న మూసీ నదిలో సుమారు 600 మీటర్ల వరకు నిలుస్తున్నాయి. దీనికి తోడుగా మైసమ్మ కత్వలో పూడిక కూడ పెత్త ఎత్తున పేరుకుపోవడంతో మూసీ జలాల ప్రవాహానికి కొంత అడ్డంకిగా మారింది. ఒక పక్క గుర్రపు డెక్క ఆకు, మరో పక్క పూడిక వంటి సమస్యలతో మూసీ జలాల ప్రవహానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
గుర్రపు డెక్క ఆకు తొలగించాలి
పిలాయిపల్లి కాలువలోని గేట్ల వద్ద పెరిగిన గుర్రం డెక్క ఆకు ను తొలగించి మూసీ జలాలు సజావుగా దిగువకు వ్రవహించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని జలసాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు ముత్యాల భూపాల్‌రె డ్డి, కంది లక్ష్మారెడ్డి, కొంతం అనంతరెడ్డి, మెట్టు సుదర్శనరెడ్డి, గోపి, సుధాకర్ డిమాండ్ చేస్తున్నారు. గుర్రపు డెక్క ఆకు గేట్లలో తట్టుకోవడంతో జలాల వేగాన్ని నిరోధిస్తున్నాయని వారు తెలిపారు. గుర్రపు డెక్క ఆకుతో పాటు పూడికను తొలగించాలని, లేని పక్షంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. సాగు నీరు లేక మండలంలోని పశ్చిమ ప్రాంత గ్రామాల కు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మైసమ్మ కత్వ వద్ద లిఫ్ట్ ను ఏర్పాటు చేసి, ఈ గ్రామాలకు మూసీ జలాలను మళ్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.