Gachibowli land sale: కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:56 AM
కంచ గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం విక్రయించదలచిన 400 ఎకరాల భూమి పై చెట్ల నరికివేత, భూమి చదును చేసే పనులను ఆపాలని విశ్రాంత శాస్త్రవేత్త కలపల బాబూరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ జీవో 54 ద్వారా భూమి అప్పగించడం చట్టవిరుద్ధమని, ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

చెట్ల నరికివేత, భూమి చదును ఆపించండి.. నిపుణుల కమిటీ ద్వారా సర్వే చేయించలేదు
హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం
నేడు వాదనలు వింటామన్న డివిజన్ బెంచ్
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం విక్రయించతలపెట్టిన 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేత, భూమి చదును చేసే పనులు ఆపాలని కోరుతూ హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విశ్రాంత శాస్త్రవేత్త కలపల బాబూరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆ భూముల్లో ఇంటర్నేషనల్ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ చేసి దశలవారీగా ప్లాట్లు విక్రయించాలని ప్రభుత్వం చూస్తోందని.. రూ.75 కోట్లకు ఎకరం చొప్పున దాదాపు రూ.30 వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని భావిస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అటవీ సంరక్షణ నిబంధనలు-2023లోని 16(1) ప్రకారం నిపుణుల కమిటీ వేయకుండానే భూములను జీవో 54 ద్వారా టీజీఐఐసీకి అప్పగించడం చట్టవిరుద్ధమని.. కనుక ఆ జీవోను కొట్టివేయాలని అభ్యర్థించారు. నిపుణుల కమిటీ ద్వారా సర్వే చేయించకుండా, అటవీ భూముల రికార్డు సిద్ధంచేయకుండా జీవో ఇవ్వడం ఇటీవల సుప్రీంకోర్టు ‘అశోక్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అటవీ భూములను ఇతర అవసరాలకు కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. దీనిపై అత్యవసరంగా వాదనలు వినాలని పిటిషనర్ తరఫు న్యాయవాది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం ఎదుట ప్రస్తావించగా.. బుధవారం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. ఇదే అంశంపై లాభాపేక్ష రహిత పర్యావరణ సంస్థ ‘వట ఫౌండేషన్’ దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ఈనెల 7న విచారణకు రానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News