Ponnam Prabhakar: బీఆర్‌ఎస్‌తో ఒప్పందం మేరకే ఎమ్మెల్సీ బరిలో బీజేపీ: పొన్నం
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:18 AM
బీఆర్‌ఎస్‌తో ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లేదంటే బలమే లేని చోట బీజేపీ ఎలా బరిలో నిలుస్తుందని ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌తో ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లేదంటే బలమే లేని చోట బీజేపీ ఎలా బరిలో నిలుస్తుందని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘హైదరాబాద్ స్థానిక సంస్థలకు ఉన్న మొత్తం 112 ఓట్లలో బీజేపీకి 27 ఓట్లే ఉన్నాయి. ఎంఐఎంకు 49, బీఆర్‌ఎ్‌సకు 23, కాంగ్రె్‌సకి 13 ఓట్లున్నాయి. గెలిచే బలం లేదని కాంగ్రెస్ పోటీ చేయకుండా తటస్థంగా ఉంది.
బీఆర్‌ఎస్ కూడా పోటీలో లేదు. అలాంటప్పుడు 27 ఓట్లతో బీజేపీ గెలుపెలా సాధ్యం? బీజేపీ అభ్యర్థికి బీఆర్‌ఎస్ ఓట్లు వేస్తుందా? ఈ మేరకు రాజకీయ అవగాహన చేసుకున్నారా?’ అని నిలదీశారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్.. బీజేపీకి లోపాయికారిగా సహకరించిందని ఆయన అన్నారు.