Share News

High Court: ఫోన్‌ట్యాపింగ్‌ కేసు దర్యాప్తునకు అనుమతివ్వండి

ABN , Publish Date - Feb 28 , 2025 | 03:32 AM

చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై విధించిన స్టేను ఎత్తివేసి, దర్యాప్తునకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని..

High Court: ఫోన్‌ట్యాపింగ్‌ కేసు దర్యాప్తునకు అనుమతివ్వండి

  • హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి

  • తప్పుదోవ పట్టించి, స్టే పొందారని వెల్లడి

  • చక్రధర్‌గౌడ్‌ కంటే ప్రభుత్వమే ఎక్కువగా బాధపడుతోంది

  • హరీశ్‌రావు తరఫు న్యాయవాది

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై విధించిన స్టేను ఎత్తివేసి, దర్యాప్తునకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని.. మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవస్థలను సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని పేర్కొంది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి, కాంగ్రెస్‌ నేత చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు తనపై పెట్టిన ఫోన్‌ట్యాపింగ్‌(రెండో ఎఫ్‌ఐఆర్‌) కేసు కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే..! ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు, సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలను వినిపించారు. ఇదే కేసులో అరెస్టయిన మరో ముగ్గురు నిందితుల గురించి వాస్తవాలను చెప్పకుండా, దర్యాప్తుపై స్టే పొందారని వారు కోర్టుకు వివరించారు. కస్టడీ పిటిషన్లను తేల్చకుండా దిగువకోర్టు ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరు చేసిందని తెలిపారు. తన ఇంట్లో మెడికల్‌ ఎమర్జెన్సీ ఉందని చెప్పినా.. విచారణకు పట్టుబట్టి దర్యాప్తుపై స్టే పొందారని హరీశ్‌రావు తరఫు న్యాయవాదుల తీరును సిద్దార్థ లూథ్రా తప్పుబట్టారు. ‘‘ఫోన్‌ట్యాపింగ్‌ కేసు డైరీ ధర్మాసనానికి అందుబాటులో ఉంది. దాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. షాకింగ్‌ విషయాలు తెలుస్తాయి.


ఒక వ్యక్తి గోప్యత విషయంలో మితిమీరి జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వ అధికారులకు ఎక్కడిది? భార్యాబిడ్డలతో మాట్లాడుకునే వ్యక్తిగత విషయాలను సైతం వింటున్నారు. చక్రధర్‌ గౌడ్‌, అతడి కుటుంబ సభ్యుల సీడీఆర్‌ ఫైల్స్‌ ట్యాపింగ్‌ను నిరూపిస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. హరీశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలను వినిపించారు. ‘‘ఈ కేసు విషయంలో.. చక్రధర్‌గౌడ్‌ కంటే ఎక్కువ ప్రభుత్వం బాధపడుతోంది. ప్రభుత్వానికి ఇంత ఆసక్తి ఎందుకు? దీన్నిబట్టే ప్రభుత్వ కుట్రపూరిత ఉద్దేశం బయటపడుతోంది. 11 క్రిమినల్‌ కేసులు ఉన్న వ్యక్తికి ప్రభుత్వం వత్తాసు పలకడం ఏమిటి? సీడీఆర్‌ ఉన్నంత మాత్రాన ఫోన్‌ట్యాపింగ్‌ జరిగినట్లు కాదు. ఎఫ్‌ఐఆర్‌ అంతా డొల్ల అని ప్రభుత్వానికి ముందే తెలుసు. అందుకే, వాయిదాలు తీసుకుని హరీశ్‌రావును ఇరికించేందుకు మరో ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి నేరాంగీకార వాంగ్మూలాలను తీసుకున్నారు’’ అని ధర్మాసనానికి వివరించారు. చక్రధర్‌గౌడ్‌ తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పని.. కేసులో దర్యాప్తు కొనసాగాలని స్పష్టం చేశారు. సిద్ధార్థ లూథ్రా ఇంట్లో మెడికల్‌ ఎమర్జెన్సీ ఉండగా.. దర్యాప్తుపై స్టే పొందారు అన్న అంశంపై సీనియర్‌ న్యాయవాదుల మధ్య వాగ్వాదం నెలకొంది. ధర్మాసనం కల్పించుకుంటూ.. కేవలం కేసులో మెరిట్స్‌పై వాదనలను వినిపించాలని సీనియర్‌ న్యాయవాదులను కోరుతూ.. క్వాష్‌ పిటిషన్‌లో తీర్పును రిజర్వ్‌ చేసింది.

Updated Date - Feb 28 , 2025 | 03:32 AM