గ్రామీణ రోడ్లకు రూ.2,773 కోట్లు: సీతక్క
ABN , Publish Date - Jan 24 , 2025 | 03:11 AM
పల్లెల పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కోసం గ్రామీణప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి తాజాగా రూ.2,773 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు.

హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): పల్లెల పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కోసం గ్రామీణప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి తాజాగా రూ.2,773 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి, సహచర మంత్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ప్రగతిభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి మంత్రి సీతక్క సత్కరించారు. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే రూ.2682.95కోట్లు మంజూరు చేశామని, ప్రస్తుతం మంజూరైన నిధులతో గ్రామాలు, తండాలు, గూడేల్లో బీటీ రోడ్లు, ఎస్సీ కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపడతామని మంత్రి పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్ల కోసం రూ.1,419 కోట్లు, పీఎం జన్‌మన్ నిధులతోపాటు రాష్ట్ర వాటాకింద విడుదల చేసిన రూ.66కోట్లతో 25 ఆదివాసీ గుడాలకు బీటీ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణ దృష్ట్యా పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ అధికారులకు వాహన సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పనుల పర్యవేక్షణలో కీలకంగా పనిచేసే 237 మంది ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఎస్‌ఈలకు ప్రతినెల రూ.33వేల చొప్పున అద్దె చెల్లించేలా రూ.5కోట్లు మంజూరు చేసినట్లు సీతక్క తెలిపారు. ఇదిలా ఉండగా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థిశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ఆన్‌లైన్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు సంబంధిత విభాగాలు తెలిపాయి.