Share News

Anganwadi: అంగన్‌వాడీ చిన్నారులకు పాలు, మిల్లెట్స్‌!

ABN , Publish Date - Feb 03 , 2025 | 03:48 AM

రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీల్లోని చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న బాలామృతంతోపాటు అదనంగా పాలు, మిల్లెట్స్‌ అల్పాహారం (స్నాక్స్‌)ను కూడా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.

Anganwadi: అంగన్‌వాడీ చిన్నారులకు పాలు, మిల్లెట్స్‌!

  • అల్పాహారం అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయం

  • నేడు కేంద్ర మంత్రితో భేటీ కానున్న సీతక్క.. అంగన్‌వాడీలకు మరిన్ని నిధుల కోసం విజ్ఞప్తి!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీల్లోని చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న బాలామృతంతోపాటు అదనంగా పాలు, మిల్లెట్స్‌ అల్పాహారం (స్నాక్స్‌)ను కూడా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. మిల్లెట్‌ స్నాక్స్‌ తయారీ బాధ్యతను మహిళా సంఘాలకు కేటాయించాలని భావిస్తోంది. అంగన్‌వాడీ పిల్లలకు అదనంగా పాలు, మిల్లెట్‌ స్నాక్స్‌ ఇవ్వటానికి వీలుగా రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయింపులు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలకు ఒక పూట భోజనం, రోజుకొక కోడిగుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలను అందిస్తున్నారు. 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు (టేక్‌ హోం రేషన్‌ కింద) వారానికి 4 గుడ్ల చొప్పున నెలకు 16 గుడ్లను, నెలకు రెండున్నర కిలోల బాలామృతాన్ని అందిస్తున్నారు.


బరువు తక్కువున్న పిల్లలకు బాలామృతం ఫ్లస్‌ పేరుతో రోజుకొకటి చొప్పున నెలకు 30 గుడ్లు ఇస్తున్నారు. 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు ఒక పూట భోజనం, ఉదయం ఒక గుడ్డు, సాయంత్రం స్నాక్స్‌ (కుర్‌కురే వంటి వాటిని) ఇస్తున్నారు. సాయంత్రం పూట అందించే కుర్‌కురే వంటి వాటి బదులుగా మిల్లెట్స్‌తో చేసిన స్నాక్స్‌, పాలు పిల్లలకు ఇవ్వాలని అఽధికారులు ప్రస్తుతం నిర్ణయించారు. దీనివల్ల చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందుతుందని భావిస్తున్నారు. మిల్లెట్‌ స్నాక్స్‌లోనూ చిన్నారులకు ఇబ్బంది లేకుండా వారి జీర్ణశక్తి మేరకు తయారు చేయాలని నిర్ణయించారు. పిల్లలకు ఏయే రకాల మిల్లెట్స్‌ మంచివి? వాటిలో ఉండే పోషక విలువలు ఏమిటి? అన్నదానిపై శాస్త్రవేత్తలు, వైద్యుల సలహాలను తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు.


నేడు కేంద్ర మంత్రితో సీతక్క భేటీ

కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవితో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న స్త్రీ, శిశు సంక్షేమ పథకాలను కేంద్రమంత్రికి సీతక్క వివరించనున్నారు. అంగన్‌వాడీ చిన్నారులకు బలవర్ధక ఆహారాన్ని అందించేందుకు కేంద్రం నుంచి మరింత సహకారం కావాలని, మరిన్ని నిధులు ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం.

Updated Date - Feb 03 , 2025 | 03:48 AM