Share News

ఏడాది పాలనపై సమీక్ష!

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:09 AM

ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా పాలనా తీరుపై సమీక్షించేందుకు ఈ నెల 8న గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) భేటీ కానుంది.

ఏడాది పాలనపై సమీక్ష!

  • సీఎం, మంత్రుల పనితీరు, స్థానిక ఎన్నికలపై చర్చ

  • 8న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ

  • పాల్గొననున్న రేవంత్‌, మహేశ్‌, కేసీ వేణుగోపాల్‌

హైదరాబాద్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా పాలనా తీరుపై సమీక్షించేందుకు ఈ నెల 8న గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) భేటీ కానుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ తరఫున సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హాజరుకానున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌, పీఏసీ సభ్యులూ పాల్గొననున్నారు. వాస్తవానికి ఈ నెల 9న హైదరాబాద్‌లో పార్లమెంటు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఆ కమిటీకి చైర్మన్‌గా ఉన్న కేసీ వేణుగోపాల్‌.. సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 8నే హైదరాబాద్‌ వస్తున్నారు. అయితే, ఏడాది పాలన, ఇతర అంశాలపైన సమీక్ష కోసం పీఏసీ సమావేశం నిర్వహించాలని భావిస్తున్న టీపీసీసీ.. కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో 8వ తేదీనే నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది.


సాయంత్రం 6 గంటలకు గాంధీభవన్‌లో ప్రారంభం కానున్న సమావేశంలో ఏడాది పాలన-పనితీరు, స్థానిక సంస్థల ఎన్నికలు, కుల గణన, బాపూ.. అంబేడ్కర్‌ సంవిధాన్‌ యాత్ర నిర్వహణపై చర్చించనున్నారు. ఏడాది పాలనపై సమీక్షలో భాగంగా ఆరు గ్యారెంటీల అమలుపైనా చర్చించే అవకాశం ఉంది. తనతోసహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల పనితీరుపై రిపోర్టు కార్డులు ఉన్నాయంటూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పీఏసీ సమావేశంలో ఈ రిపోర్టు కార్డులు, ఏఐసీసీ నివేదికలను క్రోడీకరించి నాయకుల పని తీరుపై సమీక్షించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ, టీపీసీసీ సంస్థాగత నిర్మాణంపైనా పీఏసీ సభ్యుల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే, ఏడాది పాలన తర్వాత జరగనున్న స్థానిక ఎన్నికలను క్లీన్‌ స్వీప్‌ చేయడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఏయే బాధ్యతలు అప్పగించాలన్న దానిపైనా సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Updated Date - Jan 06 , 2025 | 03:34 AM