Share News

LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై అనిశ్చితి?

ABN , Publish Date - Jan 02 , 2025 | 03:53 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ క్రమబద్దీకరణ పథకం) దరఖాస్తుల పరిష్కారంపై దరఖాస్తుదారుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు సమస్యల వల్ల దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు.

LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై అనిశ్చితి?

  • దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం

  • పెండింగ్‌లో 25 లక్షలపైనే దరఖాస్తులు

హైదరాబాద్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ క్రమబద్దీకరణ పథకం) దరఖాస్తుల పరిష్కారంపై దరఖాస్తుదారుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు సమస్యల వల్ల దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ అంశంపై కొందరు కలెక్టర్లు దృష్టి పెట్టడం లేదు.. చాలా జిల్లాల్లో పురోగతి కనిపించడం లేదని కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద 2020లో వచ్చిన దర ఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరులో మార్గదర్శకాలు విడుదల చేసినా ఈ ప్రక్రియలో పురోగతి లేదు. కులగణన పేరుతో దాదాపు నెల రోజుల పాటు అధికార యంత్రాంగం ఎల్‌ఆర్‌ఎ్‌సను పక్కన పెట్టేసింది. మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన మొదలైనా ఆ ప్రక్రియ నత్తనడకనే సాగుతోంది.


ఇప్పటి వరకు లక్ష లోపే

గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 మధ్య ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 25.70 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిల్లో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు దరఖాస్తులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, కార్పొరేషన్లు, మునిసిపాలిటీల నుంచి 13.75 లక్షలు ఉన్నాయి. 25.70 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే లక్ష లోపు దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. దరఖాస్తుల పరిశీలన మొదలైన కొత్తల్లో లాగిన్స్‌ తక్కువగా ఉండేవి. నాలుగు దశల్లో జరిగే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ దీని వల్ల జాప్యం అవుతుందని గుర్తించిన అధికారులు లాగిన్స్‌ సంఖ్యను వెయ్యికి పైగా పెంచారు. కానీ, క్షేతస్థాయిల్లో ఎదురవుతున్న సమన్వయ లోపాల వల్ల ఆశించిన పురోగతి కనిపించడం లేదు. పట్టణ ప్రాంతాల్లో 13,75,666 పెండింగ్‌ దరఖాస్తులు ఉండగా వాటిల్లో 70 వేల దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి కాలేదని సమాచారం.


రూ.8 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ద్వారా ఖజానాకు సుమారు రూ.8 వేల కోట్లు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటిదాకా 99,450 దరఖాస్తులు ఆమోదం పొందాయి. ఆరు నెలల్లో ప్రభుత్వానికి రూ.86 కోట్లు మాత్రమే సమకూరాయి. అయితే దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం, గతంలో దరఖాస్తు పెట్టుకున్న వారు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు 548 గ్రామ పంచాయతీ లేఅవుట్లను ఇటీవల నిషేధిత జాబితాలో పెట్టారు. ఇది కూడా ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రభావం చూపిందనే చర్చ జరుగుతోంది.

Updated Date - Jan 02 , 2025 | 03:53 AM