Share News

Congress: సన్నబియ్యం సంబరాల్లో పాల్గొనండి

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:12 AM

సన్నబియ్యం సంబరాల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విప్లవాత్మక పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు.

Congress: సన్నబియ్యం సంబరాల్లో  పాల్గొనండి

  • ఈ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి

  • కాంగ్రెస్‌ నేతలకు మంత్రి ఉత్తమ్‌, టీపీసీసీ చీఫ్‌ పిలుపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): సన్నబియ్యం సంబరాల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విప్లవాత్మక పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. సన్నబియ్యం పంపిణీ, రైతుల నుంచి సన్న వడ్ల కొనుగోళ్లపై కాంగ్రెస్‌ నేతలు, బ్లాక్‌, మండల అధ్యక్షులతో మంత్రి ఉత్తమ్‌ జూమ్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇందులో టీపీసీసీ చీఫ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఽధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు క్షేత్రస్థాయి కాంగ్రెస్‌ నేతలు సహకరించాలని కోరారు.


గతంలో 2.80 కోట్ల మందికి దొడ్డు బియ్యం ఇచ్చేవారని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇవ్వబోతోందన్నారు. సన్నబియ్యం పథకానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని.. పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడైనా అమలు చేశాయా అని నిలదీశారు. మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా చౌక ధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. సన్న వడ్లకు బోనస్‌ చెల్లింపుతో రాష్ట్రంలో సన్నవరి సాగు 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు.

Updated Date - Apr 12 , 2025 | 04:12 AM