Share News

High Court: విద్యా హక్కు చట్టం ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా?

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:39 AM

రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 రిజర్వేషన్ల అమలు కోసం జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తామని హామీ (అండర్‌ టేకింగ్‌) ఇవ్వాలని ఆదేశించింది.

High Court: విద్యా హక్కు చట్టం ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా?

  • పేదలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% రిజర్వేషన్లు కల్పించడంపై హామీ ఇవ్వండి

  • ఇప్పటికే జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తారా చెప్పండి

  • చట్టం అమలు కోసం తీసుకున్న చర్యలేమిటో వివరించండి: హైకోర్టు

  • యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 రిజర్వేషన్ల అమలు కోసం జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తామని హామీ (అండర్‌ టేకింగ్‌) ఇవ్వాలని ఆదేశించింది. ఈ అంశంపై మెమో ఇచ్చిన తర్వాత అమలు కోసం ఏమేం చర్యలు చేపట్టారో వివరించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై 2020 నాటి పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయకుండా ఇప్పటికీ జాప్యం చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది. తాము కోరిన వివరాలతో ఈనెల 21 నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి/ డైరెక్టర్‌ను ఆదేశించింది.


సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నా..

రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడం లేదంటూ 2020లో హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది. ఈ పిటిషన్లలో అమికస్‌ క్యూరీ సీనియర్‌ న్యాయవాది సునీల్‌ బీ వాదిస్తూ.. ‘‘విద్యాహక్కు చట్టంలోని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో బలహీనవర్గాలకు 25శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న నిబంధనపై సుప్రీంకోర్టు రెండుసార్లు విచారణ చేపట్టింది. ‘సొసైటీ ఫర్‌ అన్‌ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సదరు తీర్పును ‘ప్రమతి ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ అండ్‌ అదర్స్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమీక్షించింది. విద్యాహక్కు చట్టం అమలు కోసం అడ్వైజరీ కౌన్సిల్‌ ఏర్పాటు సహా పలు మార్గదర్శకాలు నిర్దేశించింది. జాతీయ బాలల హక్కుల కమిషన్‌ కూడా గతేడాది జూన్‌ 7న స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ)ను జారీ చేసింది. 25శాతం రిజర్వేషన్‌ అమలుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రీకృత ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్దేశించింది’’ అని చెప్పారు. మరోవైపు విద్యాహక్కు చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌ 19న మెమో జారీ చేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని కోర్టుకు నివేదించారు.


ఆ ఉద్దేశం లేనదడం సరికాదు..

అమికస్‌ క్యూరీ వాదనలపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రాహుల్‌రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాహక్కు చట్టం అమలు చేయాలన్న ఉద్దేశం లేదని చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మెమోను అమలు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ వివరాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. 25శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను పరిశీలించింది. ‘‘విద్యా హక్కు చట్టంలోని సెక్షన్‌ 12 (1)(సీ) ప్రకారం సమాజంలోని వెనుకబడిన, బలహీనవర్గాల వారికి రాష్ట్రంలోని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలంటూ 2024 అక్టోబర్‌ 10న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ మెమో జారీ చేశారు. దానిని బట్టి రిజర్వేషన్‌ అమలు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశంపై ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈ మెమో ఎప్పటినుంచి అమలులోకి వస్తుంది? 2025-26 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలవుతుందా? అనే అంశంపై అమికస్‌ క్యూరీ (కోర్టు సహాయకుడు) సందేహం వ్యక్తం చేస్తున్నారు..’’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ మెమో ఇచ్చిన తర్వాత ఏమేం చర్యలు చేపట్టారో తెలపాలని.. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిజమైన స్ఫూర్తితో సదరు మెమోను అమలు చేస్తామని హామీ (అండర్‌ టేకింగ్‌) ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి:

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..

దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు

Read Latest and Viral News

Updated Date - Apr 12 , 2025 | 04:39 AM