ఏ జబ్బు లేదు.. కానీ పదేళ్ల నుంచి సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే ఉంటున్న ఇతడి కథేంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2021-06-28T19:05:53+05:30 IST
సోషల్ డిస్టాన్స్, సెల్ఫ్ ఐసోలేషన్.. కరోనా వల్ల ఈ పదాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్క పౌరుడి నోట నానుతోంది. ప్రతి ఒక్క పౌరుడు భౌతిక దూరం పాటిస్తున్నారు.

సోషల్ డిస్టాన్స్, సెల్ఫ్ ఐసోలేషన్.. కరోనా వల్ల ఈ పదాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్క పౌరుడి నోట నానుతోంది. ప్రతి ఒక్క పౌరుడు భౌతిక దూరం పాటిస్తున్నారు. మెజార్టీ మంది పౌరులు ఇళ్లకే పరిమితమవుతూ అప్పుడప్పుడు అవసరం పడినప్పుడు మాత్రమే బయటకు వస్తున్నారు. చాలా మంది ప్రజలు కూరగాయలు నుంచి ఆహార పదార్థాల వరకు అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు ఇస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకే పరిమితమయ్యారు. అయితే ప్రపంచం అంతా గత రెండేళ్ల నుంచే ఈ భౌతిక దూరం అనే పదాన్ని వింటోంది. పాటిస్తోంది. కానీ జపాన్‌లోని నీటో సౌజీ అనే వ్యక్తి మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల నుంచే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. అలా అని అతడికి ఏదైనా అరుదైన వ్యాధి వచ్చిందనుకుంటే పొరపాటే.
జపాన్‌లో హికికోమోరి అనే ఒక విధానం ఉంది. సమాజానికి దూరంగా ఇంట్లోనే గడపడం అనేది ఆ విధానం ముఖ్య ఉద్దేశం. జపాన్‌లో దాదాపు ఐదు లక్షల మందికి పైగా యువత, మరో ఐదు లక్షల మంది మధ్య వయస్కులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని అక్కడి లెక్కలు చెబుతున్నాయి. ఈ సౌజీ అనే వ్యక్తి కూడా ఇదే విధానాన్ని పదేళ్లుగా అనుసరిస్తున్నాడు. పదేళ్ల క్రితమే టోక్యోకు వచ్చిన సౌజీ అప్పటి నుంచి తన గదికే పరిమితం అయ్యాడు. కేవలం మూడు నెలలకు ఓసారి మాత్రం బార్బర్ షాపునకు వెళ్లేందుకు బయటకు వచ్చేవాడు. మళ్లీ వీలయినంత వేగంగా తన గదికి వెళ్లేవాడు. తనకు కావాల్సిన అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ ఇచ్చుకునేవాడు. ప్రస్తుతం ఇండీ గేమ్ డెవలపర్‌గా సౌజీ పనిచేస్తున్నాడు. అతడికి యూట్యూబ్ చానెల్ కూడా ఉందండోయ్. నీటో సౌజీ పేరుతో ఉన్న ఈ యూట్యూబ్ చానెల్‌లో తన రెగ్యులర్ జీవితాన్ని గురించి ఫాలోవర్లకు అప్‌డేట్స్ ఇస్తుంటాడు. ‘బయటకు వెళ్లడాన్ని నేను అవమానంగా భావిస్తుంటా. బయటకు వెళ్లడమంటేనే నాకు భయం. పదేళ్లుగా ఇలాగే బతుకుతున్నా. ఇకపై కూడా ఇలాగే ఉంటా’ అని నీటో సౌజీ చెప్పుకొస్తున్నారు.