Share News

sand: ఎన్ని లోడ్లు కావాలి?

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:02 AM

Sand excavation కొత్తూరు మండలం ఆకులతంపర వద్ద వంశధార నదీ గర్భంలో రాత్రివేళ ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇసుకను లారీల్లో లోడింగ్‌ చేసి అక్రమ రవాణా చేస్తున్నారు. అధికారపార్టీ నేతల అనుచరులుగా చెప్పుకుంటూ ఇసుక అక్రమాలు కొనసాగిస్తున్నారు.

sand: ఎన్ని లోడ్లు కావాలి?
ఆకులతంపర వద్ద వంశధార నధిలో రాత్రివేళ ఇసుక అక్రమ తవ్వకాలు

  • పగలంతా సమాచారం సేకరణ

  • రాత్రివేళ యంత్రాలతో తవ్వకాలు..

  • ఆపై గుట్టుచప్పుడు కాకుండా రవాణా

  • ఇదీ ఆకులతంపర ఇసుక రీచ్‌ వద్ద బాగోతం

  • అధికారపార్టీ నేతల అనుచరుల హల్‌చల్‌

  • కొత్తూరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం ఆకులతంపర వద్ద వంశధార నదీ గర్భంలో రాత్రివేళ ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇసుకను లారీల్లో లోడింగ్‌ చేసి అక్రమ రవాణా చేస్తున్నారు. అధికారపార్టీ నేతల అనుచరులుగా చెప్పుకుంటూ ఇసుక అక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆకులతంపర రీచ్‌ వద్ద బడా నాయకుడి అనుచరునిగా పేరు చెప్పుకుని ప్రతిరోజూ ఎవరికి ఎన్ని లోడ్లు ఇసుక కావాలో పగలంతా సమాచారం సేకరిస్తున్నారు. ఆయా వ్యక్తులు రీచ్‌ల వద్ద ఉన్న వ్యక్తులకు ఫోన్‌ చేసి.. రాత్రివేళ తమ లారీలు వస్తాయని లోడింగ్‌ చేసేందుకు బేరసారాలు మాట్లాడతారు. లారీ లోడ్‌కు రూ.10వేల నుంచి రూ.16వేల వరకూ చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. పగలంతా సమీప తోటల్లో ఉంచిన పొక్లయినర్లను రాత్రివేళ వంశధార నదీ గర్భంలో దించి.. ఇసుక తవ్వకాలు చేపట్టి.. రవాణా చేస్తున్నారు. పగలు మళ్లీ ఆ యంత్రాలను ఎవరికీ కనిపించకుండా తోటల్లో ఉంచుతున్నారు. రాత్రివేళ గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం సచివాలయ, రెవెన్యూ సిబ్బందికి తెలిసినా చూసీచూడనట్టు ఉండడం విమర్శలకు తావిస్తోంది.

  • ప్రభుత్వం మారినా.. అంతే!

    వైసీపీ హయాంలో ఇసుకను అధిక ధరలకు విక్రయించి అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. అప్పట్లో సామాన్యులు ఇళ్ల నిర్మాణానికి ఇసుక దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రీచ్‌ల నుంచి దూరాన్ని బట్టి రవాణా చార్జీల నిమిత్తం నిర్ణీత రుసుం వసూలు చేస్తోంది. కాగా, ప్రభుత్వం మారినా ఇసుక రీచ్‌ల వద్ద అక్రమాలు మాత్రం ఆగడం లేదు. కొంతమంది అక్రమార్కులు కొత్తూరు మండలం మారుమూల ప్రాంతంలోని ఆకులతంపర రీచ్‌లో రాత్రివేళ్లలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. రోజూ సుమారు 30 నుంచి 40 లారీల్లో ఇసుక లోడింగ్‌ చేస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు రాత్రివేళ రవాణా చేస్తున్నారు. ఒక్కో లారీ లోడు ఇసుకను రూ.30వేల నుంచి రూ.40వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది నాయకులు వాటాలు వేసుకుని మరీ రోజూ రీచ్‌ల వద్దకు లారీలు పంపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ రీచ్‌ నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేయడంతో అధికారులు రూ.లక్ష వరకూ అపరాధ రుసుం విధించారు. కానీ, ఆ మరుసటి రోజు నుంచి యథావిధిగా ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇసుక విధానంలో అధికారపార్టీ నేతలెవరూ కలుగజేసుకోవద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినా.. ఆయా నేతల అనుచరులు మాత్రం వెనక్కి తగ్గకపోవడం చర్చనీయాంశమవుతోంది.

  • ఈ విషయమై కొత్తూరు తహసీల్దార్‌ రవిచంద్ర వద్ద ప్రస్తావించగా.. ఆకులతంపర వద్ద నదిలో రాత్రివేళ ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల అక్రమాలకు పాల్పడిన వారి నుంచి రూ.లక్ష అపరాధ రుసుం వసూలు చేశామన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:02 AM