How to Study for a Degree? డిగ్రీ చదివేదెలా?
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:03 AM
How to Study for a Degree? జిల్లాలోని ప్రతి మండలంలో జూనియర్ కళాశాలకు అనుబంధంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. కానీ మాట తప్పింది. ఇచ్చిన హామీని గాలికొదిలేసింది.

ఇబ్బందుల్లో జిల్లా విద్యార్థులు
కొందరు పొరుగు జిల్లాలకు పయనం
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
పార్వతీపురం, మార్చి18(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి మండలంలో జూనియర్ కళాశాలకు అనుబంధంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. కానీ మాట తప్పింది. ఇచ్చిన హామీని గాలికొదిలేసింది. నూతన జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు ఎంతో అవసరమైనా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో పేద విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ విద్య కోసం పొరుగు జిల్లాకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం వారంతా రాష్ట్ర సర్కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
జిల్లాలో ఇలా..
- పార్వతీపురం నియోజకవర్గ పరిధి బలిజిపేట మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగా మారింది. దీనిపై ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు నెరవేరడం లేదు. దీంతో ఈ మండలానికి చెందిన విద్యార్థులు డిగ్రీ విద్య కోసం విజయనగరం జిల్లా బొబ్బిలికి వెళ్లాల్సి వస్తోంది. దశాబ్దాలు గడుస్తున్నా పరిస్థితి మారకపోవడంతో స్థానికులు పెదవి విరుస్తున్నారు.
- సాలూరు కేంద్రంగా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని గత వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రకటించారు. దీనిపై ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా అప్పట్లో హడావుడి చేశారు. కానీ ఏర్పాటుకు అడుగులు పడలేదు. ఇక్కడ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తే సాలూరు పట్టణ, మండలంలో పాటు పాచిపెంట, మక్కువ, విజయనగరం జిల్లా రామభద్రపురం మండలాల విద్యార్థినులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
- కురుపాం నియోజకవర్గంలో కురుపాం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండల కేంద్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేవు. దీంతో ఆయా మండలాల విద్యార్థులు గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం వెళ్లి డిగ్రీ చదువుకోవాల్సి వస్తోంది.
- జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఉన్న డిగ్రీ కళాశాలే కురుపాం, గరుగుబిల్లి, పార్వతీపురం పట్టణం తదితరు ప్రాంతాల విద్యార్థులకు పెద్ద దిక్కుగా ఉంది.
- పార్వతీపురంతో పాటు సాలూరు తదితర ప్రాంతాల్లో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమత అనుకూలించక ఎంతోమంది పేద విద్యార్థులు వాటిల్లో చేరలేకపోతున్నారు. దీంతో డిగ్రీ విద్యకు దూరమవుతున్నారు.