జేఎన్టీయూ కళాశాలను సందర్శించిన రిజిస్ట్రార్
ABN , First Publish Date - 2021-07-05T04:56:21+05:30 IST
చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్ద గల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ మంజూర్‌హుస్సేన్ ఆదివారం సందర్శించారు.

ఫార్మసీ విభాగానికి సౌకర్యాల పరిశీలన
సెలవు రోజున పర్యటనపై ఉద్యోగుల అసంతృప్తి
పుల్‌కల్, జూలై 4 : చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్ద గల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ మంజూర్‌హుస్సేన్ ఆదివారం సందర్శించారు. సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో కొత్తగా ఫార్మసీ విభాగం త్వరలో ఏర్పాటు కానుండటంతో, అందుకవసరమైన వసతులను ఆయన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. సువిశాల కళాశాల ప్రాంగణంలో అనేక భవనాలు ఖాళీగా ఉన్న దృష్ట్యా అందులో ఏదో ఒక భవనాన్ని ఫార్మసీ విభాగానికి కేటాయించాలని ప్రిన్సిపాల్ జీఎన్ శ్రీనివా్‌సకు సూచించారు. ఫార్మసీ విభాగానికి సంబంధించి కొత్తగా త్వరలో కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయించి, ఇక్కడ బోధనా తరగతులు నిర్వహించనున్నారు.
హడావిడిగా పర్యటన
ఇదిలావుండగా, జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారులు ఆదివారం కళాశాల సందర్శనకు రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పని దినాలలో కళాశాలకు సక్రమంగా హాజరుకాని అధికారులు, సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా సెలవురోజున సందర్శనకు రావడమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సెలవు రోజున కాకుండా పని దినాల్లో సందర్శనకు వస్తే కళాశాలలో తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేదని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో అడ్మిన్‌తో పాటు ఇతరత్రా విభాగాల్లో ఆరంభం నుంచి పదుల సంఖ్యలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. చాలామంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నా సెక్యూరిటీకి చెల్లించే వేతనాలు చెల్లిస్తున్నారంటూ పలువురు సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.