హరితహారంతో కేరళ మాదిరిగా పచ్చదనం
ABN , First Publish Date - 2021-10-31T04:51:57+05:30 IST
హరితహారంతో కేరళ మాదిరిగా పచ్చదనం

- జడ్పీ స్థాయి సంఘాల సమావేశాల్లో జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి
- జడ్పీటీసీలకు రూ.3.47 కోట్ల ఆర్థిక సంఘం నిధుల మంజూరు ఉత్తర్వులు అందజేత
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్ జిల్లా ప్రతినిధి): ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంతో కేరళ మాదిరిగా పచ్చదనం పెరగాలని అధికారులకు జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి సూచించారు. శనివారం జడ్పీలో జరిగిన స్థాయి సంఘాల సమావేశాల్లో ఆమె వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఇంకుడు గుంత తవ్వితేనే ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వాలని పంచాయతీ అధికారులకు స్పష్టం చేశారు. మొక్కలు నాటడం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, నాటిన ప్రతి మొక్కను పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి పంచాయతీలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులు పూర్తి చేయాలని, అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ సమగ్రాభివృద్ధికి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, పనుల్లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్బిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని, ఈసారి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనందున 10వ తరగతిలో మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి పోత్సహించాలన్నారు. పీహెచ్‌సీల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరచాలని, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ పథకాలు అర్హులైన వారికి అందేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని గ్రామాల్లో ఇంకా స్తంభాలకు 3వ వైర్ వేయలేదని, వెంటనే వేయాలని, డీడీలు కట్టిన రైతుల పొలాల వద్ద వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆమె సంబంధిత అధికారులకు సూచించారు. జడ్పీసాధారణ నిఽధుల్లో లోటు ఏర్పడిందని సీఈవో చెప్పగా, సాఽధారణనిధులు తప్ప మిగతా గ్రాంట్ల కింద కొత్తపనులు మంజూరు చేస్తామని ఆమె చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 1766 పనులు మంజూరు కాగా, 1157 పనులు పూర్తయ్యాయని, మిగతావి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అంతకు ముందు జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ అధ్యక్షతన వ్యవసాయ స్థాయి సంఘసమీక్ష జరిగింది. సమీకృత వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున కూరగాయల సాగు, చేపల పెంపకం, పాల ఉత్పత్తి పెంచే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. డ్రాగన్‌ఫ్రూట్ తోటల పెంపకంపై జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారని, ఆదిశగా రైతులకు ప్రోత్సహించాలని చెప్పారు. మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల సమావేశాలు చైర్‌పర్సన్లు సుజాత, చౌహాన్ అరుణదేశు అధ్యక్షతన జరిగాయి. ఇదిలా ఉంటే, రూ.3.47 కోట్ల నిధులకు సంబంధించిన ఉత్తర్వులను జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి జడ్పీటీసీలకు అందజేశారు. మండలాల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించినట్లు ఆమె చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, స్థాయి సంఘాల చైర్‌పర్సన్లు సుజాత, అరుణ దేశు, జడ్పీటీసీలు నాగారెడ్డి, హరిప్రియ, సంఽధ్యారాణి, సంతోష, మహిపాల్, మధుకర్, శ్రీనివా్‌సరెడ్డి, రాందా్‌సనాయక్, మేఘమాల, జయమ్మ, మంజుల పాల్గొన్నారు.