మట్టి.. దోపిడీ
ABN , First Publish Date - 2022-11-01T00:56:12+05:30 IST
అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో విలువైన ప్రభుత్వ భూముల్లో మట్టి యథేచ్ఛగా హద్దులు దాటుంతోంది.

సంగంగోపాలపురం(యడ్లపాడు), అక్టోబరు 31: అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో విలువైన ప్రభుత్వ భూముల్లో మట్టి యథేచ్ఛగా హద్దులు దాటుంతోంది. మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తోంది. యడ్లపాడు మండలం సంగంగోపాలపురం గ్రామ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. నాణ్యమైన ఎర్ర గరప నేలలు కావడంతో ఆ భూములను అక్రమార్కులు లాభసాటి ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండానే అక్రమంగా మట్టి తవ్వుతున్నారు. వందల సంఖ్యలో టిప్పర్లతో గ్రావెల్‌ను బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి రావలసిన రూ.కోట్ల ఆదాయానికి గండికొడుతున్నారు. తవ్వకాలపై మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందినా అధికార పార్టీ నేతల సిఫార్సులతో వాటిని బుట్టదాఖలు చేయిస్తున్నారు.
దందా అంతా వారి కనుసన్నల్లోనే..
గత కొన్ని నెలలుగా సంగంగోపాలపురం పరిధిలో జరుగుతున్న గ్రావెల్‌దందా అధికార పార్టీకి చెందిన ఇద్దరి నాయకుల కనుసన్నల్లోనే జరుగుతోంది. గురుకుల పాఠశాల సమీపంలో సైతం వీరు భారీగా తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ తవ్విన మట్టిని వంకాయలపాడు పరిధిలో జాతీయరహదారి పక్కన ప్రైవేటు వ్యక్తులకు చెందిన సుమారు 20ఎకరాల భూమికి మెరకగా వేశారు. అంటే కనీసం 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వి ఇక్కడ మెరక వేసి ఉంటారు. ఈ విషయమై అధికార పార్టీకి చెందిన వారే ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనితో వారి పలుకుబడి ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా బోయపాలేనికి చెందిన ఓ మహిళకు చెందిన భూమిలో తవ్వకాలు ప్రారంభించారు.
50 ఎకరాల్లో తవ్వకాలు..
గత మూడున్నరేళ్లలో సుమారు 40 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో మట్టి తవ్వకాలు నిర్వహించారు. సుమారు 30 అడుగుల లోతున నీరు ఉబికి వచ్చేలా తవ్వకాలు జరిపారు. ఇక్కడి గ్రావెల్‌కు బాగా డిమాండ్ ఉండడంతో జిల్లాలోని నలుమూలలకు మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు దూరాన్ని బట్టి రూ.6వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను వేల రూపాయలు చెల్లించి పర్యవేక్షణ కోసం నియమించుకున్నారు.
ప్రభుత్వాదాయానికి గండి..
మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని మట్టి తవ్వకాలు నిర్వహిస్తే క్యూబిక్ మీటరుకు రూ.60 రాయల్లీ చెల్లించాల్సి ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో సుమారు 5లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలిపోయి ఉంటుందని అంచనా. తరలించిన మట్టికి రూ.2కోట్లు మైనింగ్ శాఖకు జమ కావలసి ఉంది. అనుమతులు తీసుకోకపోవడంతో ఒక్క రూపాయి కూడా ఆ శాఖకు జమకాలేదు. విలువైన ప్రభుత్వ భూములు చెరువులుగా మారుతున్నా, ప్రభుత్వాదాయానికి గండిపడుతున్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నేతల వత్తిడి కారణంగా తవ్వకాలను అడ్డుకోలేని పరిస్థితి నెలకొంది.