Peddireddy Ramachandra Reddy: అసమ్మతి లేని నియోజకవర్గమే లేదు
ABN , First Publish Date - 2022-12-13T03:31:20+05:30 IST
రాష్ట్రంలో అధికార పార్టీలో అసమ్మతి లేని నియోజకవర్గమే లేదని అనంతపురం జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

పులివెందులలోనూ అసమ్మతి ఉంది
సామరస్యంగా పరిష్కరించుకోవాలి: పెద్దిరెడ్డి
అనంతపురం క్రైం/రాప్తాడు, డిసెంబరు 12: రాష్ట్రంలో అధికార పార్టీలో అసమ్మతి లేని నియోజకవర్గమే లేదని అనంతపురం జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులలో, తన నియోజకవర్గం పుంగనూరులోనూ ఉందని చెప్పారు. సోమవారం అనంతపురంలో వైసీపీ రాప్తాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, శంకర్‌నారాయణ ఎంపీ గోరంట్ల మాధవ్, జడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఏ నియోజకవర్గంలో అయినా అసమ్మతి ఉంటుందని.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. 2019 ఎన్నికల్లో మద్దతు పలికిన అందరినీ కలుపుకుని సమష్టిగా పనిచేయాలని సూచించారు. ‘మా నియోజకవర్గంలో మరో 10 వేల మందికి ఇళ్లపట్టాలు ఇప్పించు అన్నా.. నీ కాళ్లు మొక్కుతా పెద్దిరెడ్డన్నా..’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి వేడుకోవడం గమనార్హం.
దళిత నాయకురాలికి అవమానం
అనంతపురం నియోజకవర్గ సమావేశం వేదికపైకి దళిత సామాజిక వర్గానికి చెందిన ఆర్టీసీ రీజినల్ చైర్‌పర్సన్ మంజులను పిలువలేదు. దీంతో ఆమె కిందే కూర్చుని కన్నీటిపర్యంతం అయ్యారు. మీడియా అటువైపు దృష్టి సారించడంతో నాయకులు గమనించి.. ఆమెను వేదికపైకి పిలిచి కూర్చోబెట్టారు.