కేజీహెచ్‌ కార్డియాలజీపై ప్రైవేటు పెత్తనం

ABN , First Publish Date - 2022-12-09T01:18:49+05:30 IST

కేజీహెచ్‌లోని కీలక విభాగాల్లో ఒకటైన కార్డియాలజీలో ప్రైవేట్‌ సంస్థ పెత్తనం పెరిగి పోయింది.

కేజీహెచ్‌ కార్డియాలజీపై  ప్రైవేటు పెత్తనం

పీపీపీ విధానంలో క్యాథలాబ్‌ ఏర్పాటు

ఆ సంస్థకే ఆరోగ్యశ్రీ నిధులు, వైద్యులు, సిబ్బంది విధులు

ఒప్పందంలో 24 గంటల పని... కానీ మధ్యాహ్నం వరకే సేవలు

సంస్థ అజమాయిషీపై వైద్యుల అసహనం

కొన్ని కేసులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు పంపుతున్న వైనం

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

కేజీహెచ్‌లోని కీలక విభాగాల్లో ఒకటైన కార్డియాలజీలో ప్రైవేట్‌ సంస్థ పెత్తనం పెరిగి పోయింది. పీపీపీ విధానంలో క్యాథలాబ్‌ సేవలు అందించాల్సిన ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా వైద్యులు, సిబ్బంది సేవలను వినియోగించుకుని, అత్యవసర కేసులను ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తోందనే ఆరోపణలున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటలు క్యాథలాబ్‌ సేవలు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు విశాఖ, గుంటూరు, కర్నూలులో క్యాథల్యాబ్‌ సేవలను అందించేందుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించారు. ఇందుకోసం విజయవాడకు చెందిన హెల్ప్‌ ఆస్పత్రి ముందుకువచ్చింది. ఒప్పందం మేరకు మూడుచోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ గుంటూరు, కర్నూలులో క్యాథలాబ్‌ను ఏర్పాటు చేయలేదు. దీనికి అక్కడి వైద్యులు తీవ్రంగా వ్యతిరేకించడమే కారణమని సమాచారం. కేజీహెచ్‌ వైద్యులు వ్యతిరేకించినప్పటికీ అప్పటి ఉన్నతాధికారుల సహకారంతో లాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కొత్తగా యంత్రం కొనుగోలు చేయడంతోపాటు రెండు గదులను ఆధునికీకరించి, సేవలందిస్తున్నారు.

నిబంధనలకు నీళ్లు..

కేజీహెచ్‌ కార్డియాలజీ విభాగంలో ఉన్న క్యాథలాబ్‌ యంత్రం ఎప్పటికప్పుడు మరమ్మతలకు గురవడంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. అంతేకాకుండా క్యాథలాబ్‌ సేవలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే అందిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఉద్దేశంతో ఓ ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యతను అప్పగించారు. 24 గంటలు సేవలు అందించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ఆ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే సేవలందిస్తోంది. కేజీహెచ్‌లోని కార్డియాలజీ వైద్య నిపుణులను, క్యాథలాబ్‌ టెక్నీషియన్లు, స్టాఫ్‌ నర్సులతోనే పనులు చేయించుకుంటోంది. ఆస్పత్రి సిబ్బంది లేని సమయంలో ఆ సంస్థకు చెందిన సిబ్బంది సేవలను అందించాల్సి ఉన్నప్పటికీ.. ఎవరినీ నియమించకోలేదు.

కేజీహెచ్‌ నిధులకు గండి..

ప్రైవేట్‌ సంస్థ ఆధ్వర్యంలో క్యాథలాబ్‌ సేవలు అందించడంతో కేజీహెచ్‌కు రావాల్సిన నిధులకు గండి పడుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడ అందించే కొన్ని రకాల సేవల వల్ల ఏడాదికి కేజీహెచ్‌కు సుమారు రూ.50 లక్షలు వరకు ఆదాయం సమకూరేది. ప్రైవేట్‌ సంస్థకు బాధ్యతలను అప్పగించినప్పటి ఆదాయం అటు వెళ్లిపోతోంది. ఈ విభాగంలో రోజూ యాంజియో, స్టెంట్‌, ఫేస్‌ మేకర్స్‌ చేస్తుంటారు. నెలకు 150 నుంచి 200 వరకు కేసులకు ఈ పరీక్షల ద్వారా రూ.20 లక్షలు ఆరోగ్యశ్రీ నుంచి సదరు సంస్థ బిల్లులు పొందుతోంది. ఈ నేపథ్యంలో ఏడాదికి కేజీహెచ్‌ సుమారు రూ.2 కోట్ల ఆదాయం నష్టపోతోందని వైద్యులు చెబుతున్నారు. ప్రైవేట్‌ సంస్థకు సేవలు అందించాల్సి వస్తుండడంతో పలువురు టెక్నీషియన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

యాంజియో, స్టెంట్‌, ఫేస్‌మేకర్‌ చేయించుకున్న రోగుల్లో కొందరికి బైపాస్‌, వాల్వ్‌మార్పిడి, కవాటాల మార్పిడి చేయాల్సి వస్తుంది. సాధారణంగా కేజీహెచ్‌లో గతంలో ఉన్న క్యాథలాబ్‌లో ఈ సేవలు అందించినప్పుడు ఇవి అవసరమైన వారిని కార్డియోథొరాసిక్‌ డిపార్ట్‌మెంట్‌కు రిఫర్‌ చేసేవారు. కానీ, ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థ ప్రైవేటు ఆస్పత్రులకు పంపిస్తుండడంతో కేజీహెచ్‌లోని కార్డియోథొరాసిక్‌కు వచ్చే రోగులసంఖ్య తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు. గతంలో రోజూ మూడు నుంచి 5 వరకు ఈ తరహా కేసులు వస్తుండగా, ప్రస్తుతం వారానికి ఒకటి, రెండు రావడం గగనమవుతోందంటున్నారు. స్టెంట్‌, యాంజియో, ఫేస్‌మేకర్స్‌ చేసినప్పుడు పీజీ వైద్యులు నేర్చుకునేందుకు అవకాశముంటుంది. అవసరమైన కొన్ని పరికరాలు, వైర్లు ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. అయితే ప్రైవేట్‌ సంస్థ దానికి అంగీకరించడకపోవడంతో పీజీ వైద్యులకు నేర్చుకునే అవకాశం లేకుండా పోతోంది. వేగంగా ప్రక్రియను పూర్తిచేసేలా ఒత్తిడి తెస్తుండడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.

Updated Date - 2022-12-09T01:18:51+05:30 IST

News Hub