Canara Bank: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. డెబిట్ కార్డు లావాదేవీల పెంపు
ABN , First Publish Date - 2022-12-06T21:19:34+05:30 IST
తమ ఖాతాదారులకు కెనరా బ్యాంకు (Canara Bank) సూపర్ డూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏటీఎం (ATM) నుంచి నగదు డ్రా చేసుకునే విషయంలో రోజు వారీ పరిమితిని భారీగా పెంచింది
న్యూఢిల్లీ: తమ ఖాతాదారులకు కెనరా బ్యాంకు (Canara Bank) సూపర్ డూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏటీఎం (ATM) నుంచి నగదు డ్రా చేసుకునే విషయంలో రోజు వారీ పరిమితిని భారీగా పెంచింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తున్నట్టు చెప్పింది. ఏటీఎంలలో నగదు ఉపసంహరణతోపాటు పీవోఎస్ చెల్లింపుల పరిమితిని పెంచింది.
ప్రస్తుతం కెనరా బ్యాంకు ఖాతాదారులు రోజుకు రూ. 40 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై రూ. 75 వేల వరకు డ్రా చేసుకోవచ్చు. అలాగే, పీవోఎస్ మెషీన్లు, ఈ-కామర్స్ పోర్టల్స్‌లో రోజుకు లక్ష రూపాయల వరకు చెల్లింపు చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు దానిని ఏకంగా రూ. 2 లక్షలకు పెంచింది.
ఎన్ఎఫ్సీ (కాంటాక్ట్ లెస్) ట్రాన్సాక్షన్స్‌ను ఒకసారికి రూ. 5 వేల చొప్పున ఐదుసార్లు రూ. 25 వేల వరకు చేసుకునేందుకు అనుమతి ఉండగా ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ డెబిట్ కార్డులతో ఇప్పటి వరకు ఏటీఎంల నుంచి రూ. 50 వేల వరకు ఉపసంహరించుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు దానిని రూ. లక్షకు పెంచింది. పీవోఎస్, ఈ-కామర్స్ చెల్లింపుల పరిమితిని రూ. 2 లక్షల నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచింది. కాంటాక్ట్ లెస్ లావాదేవీల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.