Tirumala Temple Incident: తిరుమలలో అపచారం.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Apr 12 , 2025 | 09:52 AM
Tirumala Temple Incident: తిరుమలలో అపచారం జరిగింది. వెంకన్న దర్శనం కోసం వచ్చిన కొందరు భక్తులు చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది.

తిరుమల, ఏప్రిల్ 12: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు (Tirumala Temple) తరలివస్తుంటారు. ఎంతో నిష్టతో, భక్తి భావంతో గోవిందుడిని దర్శనం చేసుకుని పునీతులవుతారు. శ్రీనివాసుడి దర్శనం సమయంలో ఎలాంటి అపచారం జరుగకుండా చూసుకుంటారు. ఆ దేవదేవుని దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తారు. అలాంటి తిరుమల వెంకటేశుడి సన్నిధి వద్ద అపచారం జరిగింది. కొందరు భక్తులు చేసిన నిర్వాకం ఇప్పుడు సంచలనంగా మారింది. తిరుమలలో ఏం జరిగింది.. సదరు భక్తులు ఎలాంటి చర్యలకు పాల్పడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమలలో అపచారం జరిగింది. పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. భక్తులు చెప్పులతో వెళ్తుండడాన్ని ఆలయ మహాద్వారం వద్ద గుర్తించిన భద్రతా సిబ్బంది.. వారిని అక్కడే అడ్డుకున్నారు. దీంతో పాదరక్షలను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లారు భక్తులు. భక్తులు ఎలా వస్తున్నారు అనే విషయాన్ని వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులు పట్టించుకోక పోవడంతో చెప్పులతోనే ఆలయ మహాద్వారం వరకు భక్తులు వచ్చేశారు.
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ప్రవేశించాల్సి ఉంటుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు. వారి వద్ద సెల్ ఫోన్స్, నిషేధిత వస్తువులు, పాదరక్షలు ఉంటే అక్కడే అడ్డుకుని వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత భక్తులను స్వామి వారి దర్శనం కోసం పంపిస్తుంటారు. కానీ ఈరోజు మాత్రం కొందరు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు వచ్చేయడం కలకలం రేపింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రాతా సిబ్బంది వీరిని గుర్తించకపోవడం వల్లే వారు పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే మహాద్వారం వద్ద ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని గమనించి భక్తులను అడ్డుకోవడంతో.. వారి అక్కడే పాదరక్షలు వదిలి ఆలయంలోకి ప్రవేశించారు. అయితే ఇలాంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న భద్రతా సిబ్బందిపై శ్రీవారి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఇలా జరుగకుండా చూసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి
AP free gas cylinders: సిలిండర్ బుక్ చేసినా సబ్సిడీ జమ కాలేదా
Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం
Read Latest AP News And Telugu News