Hyderabad: ఆస్తి కోసం కుమార్తెను చంపిన సవతి తల్లి
ABN , Publish Date - Apr 12 , 2025 | 10:33 AM
ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు. తాను చేసేది తప్పని, అది బయటకు వస్తే జైల్లో చిప్పకూడు తానాల్సి వస్తుందని తెలిసి కూడా.. తప్పులు చేయడం మానడం లేదు. అలాగే ఆస్తుల కోసం సొంత అయిన వారిని కూడా కడతేరుస్తున్పారు. అటువంటి సంఘటనే ఇది. ఇక వివరాల్లోకి వెళితే..

- మరో ఇద్దరి సహకారంతో గొయ్యితీసి పూడ్చివేత
- 2నెలల తర్వాత వెలుగులోకి ఘోరం
- మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఘటన
హైదరాబాద్: తనకున్న రెండు ఇళ్లలో ఓ ఇంటిని కుమార్తె పేరిట రాసివ్వాలని ఆ తండ్రి నిర్ణయించగా, ఇది ఇష్టం లేని ఆమె సవతి తల్లి ఘోరానికి పాల్పడింది. ఆ ఇంటిని కూడా తన సొంతం చేసుకునేందుకు సవతి కుమార్తెను హత్యచేసి.. గుట్టు చప్పుడు కాకుండా పాతిపెట్టింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి(Medchal Malkajgiri) జిల్లా బోడుప్పల్‌లో ఈ ఘటన జరిగింది. నాలుగు నెలల తర్వాత ఈ ఘోరం వెలుగుచూడటం విశేషం. పోలీసుల వివరాల ప్రకారం బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీకి నివాసం ఉండే జాటోత్ పీనా నాయక్ ఓయూలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బంగారానికి ఫేక్ కరెన్సీ..
అతడికి కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె మహేశ్వరి ఉన్నారు. మహేశ్వరి(26) బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. భార్య అనారోగ్యంతో మృతి చెందటంతో పీనా నాయక్ లలిత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె ఉంది. మహేశ్వరికి పెళ్లవగా, భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయి పుట్టింట్లోనే ఉంటోంది. మహేశ్వరికి మళ్లీ పెళ్లి చేయాలని, ఉన్న రెండు ఇళ్లలో ఓ ఇంటిని ఆమెకు ఇవ్వాలని తండ్రి నిర్ణయించాడు. అయితే ఉన్న రెండు ఇళ్లూ తనకు పుట్టిన బిడ్డకే దక్కాలనే పథకంతో మహేశ్వరి హత్యకు లలిత పథకం వేసింది.
ఇందుకు తన మేనబావ, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవిని, అతడి స్నేహితుడు యాదాద్రి జిల్లా బీబీనగర్‌కు చెందిన బానోతు వీరన్న సాయం కోరగా అంగీకరించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రవి, వీరన్నతో కలిసి మహేశ్వరిని.. లలిత హత్యచేసింది. మృతదేహాన్ని వీరన్న కారులో వేసుకొని, రవి స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామానికి దగ్గర్లోని నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం పొలిమేరకు వెళ్లాడు.
అక్కడ రాత్రి 11 గంటలకు మూసి బ్రిడ్జి కింద పిల్లర్ నంబర్ వన్ దగ్గర మహేశ్వరి మృతదేహాన్ని పూడ్చిపెట్టి వెళ్లిపోయాడు. మహేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు, లలితను తమదైన శైలిలో విచారించగా అంతా బయటపెట్టింది. ఆమె ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు. లలిత, రవి, వీరన్నను అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!
రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్
Read Latest Telangana News and National News