నేడే పోలింగ్‌

ABN , First Publish Date - 2022-11-03T03:50:03+05:30 IST

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ గురువారం జరగనుంది.

నేడే పోలింగ్‌

ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు

298 పోలింగ్‌ కేంద్రాలు, 2,41,855 మంది ఓటర్లు

పోలింగ్‌ కేంద్రంలో తొలిసారి కేంద్ర, రాష్ట్ర పోలీసులు

మునుగోడులో పోలింగ్‌ రికార్డు సృష్టించేనా?

ముంబై, ఢిల్లీ నుంచి తరలివస్తున్న ఓటర్లు

93% పైగా ఓటింగ్‌ జరుగుతుందని అంచనా!

నల్లగొండ/హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ గురువారం జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లగొండ జిల్లా చండూరులోని జూనియర్‌ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌ సిబ్బందికి మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఆర్టీసీ బస్సుల ద్వారా వారు పోలింగ్‌ కేంద్రాలకు పోలీస్‌ భద్రత నడుమ బుధవారం సాయంత్రమే చేరుకున్నారు. ఉప ఎన్నిక సాధారణ పరిశీలకులు పంకజ్‌కుమార్‌, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షించారు. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 45 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో 2,41,855 మంది ఓటర్లుండగా.. 298 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 2,500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

వీరిలో 1,000 మంది పోలీసులు ఉన్నారు. అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌ (ఓపీవో)తోపాటు నియోజకవర్గంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్ల చేతులపై రాజకీయ పార్టీల గుర్తులు ఉండకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్‌ రాజ్‌ స్పష్టం చేశారు. పోలింగ్‌ సజావుగా సాగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర బలగాలతో సంయుక్తంగా పోలింగ్‌ బూత్‌లో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. నిఘా కెమెరాలన్నింటినీ నల్లగొండ కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. పోలింగ్‌ రోజు బ్యాలెట్‌ యూనిట్లు మొరాయిస్తే వెంటనే మరమ్మతులు చేసేందుకు పెద్ద సంఖ్యలో బెల్‌ కంపెనీకి చెందిన ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు.

చండూరులో మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌..

చండూరు మండలంలోని పడమటితాళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కోటయ్యగూడెంలో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. చక్కటి పందిరి వేసి పూలమొక్కలు, తొట్ల ఏర్పాటుతో దీనిని అలంకరించారు. కోటయ్యగూడెంలోని 212 పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో మొత్తం 638 మంది ఓటర్లు ఉన్నారు.

Updated Date - 2022-11-03T03:50:04+05:30 IST