Bhavana students: ‘జాబు’తో పెరగనున్న అనుబంధాలు..
ABN , First Publish Date - 2022-11-11T10:27:00+05:30 IST
‘జాబు’ ద్వారా సమాచారం తెలియజేస్తే కుటుంబాల మధ్య అనుబంధాలు పెరుగుతాయని భావన విద్యార్థులు(Bhavana students) కొత్త

పెరంబూర్(చెన్నై), నవంబరు 10: ‘జాబు’ ద్వారా సమాచారం తెలియజేస్తే కుటుంబాల మధ్య అనుబంధాలు పెరుగుతాయని భావన విద్యార్థులు(Bhavana students) కొత్త కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఇంటి విషయాలు, బంధువుల యోగక్షేమాలు తెలుసుకొనేందుకు ఉత్తరాలు రాసి పోస్టు ద్వారా పంపించే వారు. దానికి పోస్టు కార్డు, ఇన్‌ల్యాండ్ లెటర్, ఎన్వలప్ కవర్ తదితరాలు వినియోగించేవారు. కాలక్రమేణా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం సెల్‌ఫోన్ ద్వారా వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం సహా పలు రకాల సామాజిక మాధ్యమాల ద్వారా విషయాలు పంచుకుంటున్నారు. ఇలాంటి వాటితో కుటుంబాల మధ్య అనుబంధం పెరగదని, లేఖల ద్వారా మాత్రమే అది సాధ్యమని విద్యార్థులు, ఉపాధ్యాయులు భావించారు. అందులో భాగంగా తిరుచ్చి మనప్పారైలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 278 మంది విద్యార్థులు తల్లిదండ్రులు, బంధువులకు లేఖలు రాసి తపాలా ద్వారా పంపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖరన్ పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమంలో, బంధువులకు లేఖలు రాయడం సరికొత్త అనుభూతినిచ్చిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.