America : బైడెన్‌కు ఊరట!
ABN , First Publish Date - 2022-11-10T05:25:30+05:30 IST
అధ్యక్షుడు బైడెన్ పట్ల వ్యతిరేకత ఉన్నా మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ఓటర్లు డెమోక్రాటిక్ పార్టీ పట్ల సానుకూలత ప్రకటించారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పట్ల సానుకూలత
రిపబ్లికన్లకు పట్టున్న స్థానాల్లోనూ డెమోక్రాట్ల గెలుపు
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
ప్రతినిధుల సభలో మెజారిటీపై రిపబ్లికన్ల ఆశ
సత్తా చాటిన భారత సంతతి అమెరికన్లు
ప్రతినిధుల సభకు ఐదుగురు ఇండో-అమెరికన్లు
వారిలో ముగ్గురికి వరుసగా నాల్గోసారి విజయం
మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ అరుణ
వాషింగ్టన్, నవంబరు 9: అధ్యక్షుడు బైడెన్ పట్ల వ్యతిరేకత ఉన్నా మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ఓటర్లు డెమోక్రాటిక్ పార్టీ పట్ల సానుకూలత ప్రకటించారు. రిపబ్లికన్లకు పట్టున్న కీలక స్థానాల్లోనూ డెమోక్రాటిక్ అభ్యర్థులను గెలిపించారు. బైడెన్ పట్ల వ్యతిరేకత, ద్రవ్యోల్బణం, అబార్షన్‌పై సుప్రీం కోర్టు తీర్పు తమకు మేలు చేస్తాయని భావించిన రిపబ్లికన్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయితే, ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతినిఽధుల సభలో తమకు మెజారిటీ లభిస్తుందని ఆ పార్టీ ఆశగా ఉంది. ప్రతినిధుల సభలో మొత్తం సీట్లు (435), సెనెట్‌లో 35 స్థానాలతోపాటు 36 గవర్నర్ స్థానాలకు మంగళవారం పోలింగ్ ముగిసింది. పాలనాపరంగా అమెరికాలో ఈ మధ్యంతర ఎన్నికలు చాలా కీలకం. అధ్యక్షుడి పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి.
మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్
మధ్యంతర ఎన్నికల్లో తెలుగు మహిళ అరుణా మిల్లర్ (58) చరిత్ర సృష్టించారు. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి. అరుణకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను బట్టి ఐదుగురు భారత సంతతి వ్యక్తులు రాజా కృష్ణమూర్తి (ఇల్లినాయీ), రో ఖన్నా(కాలిఫోర్నియా), ప్రమీలా జయపాల్(వాషింగ్టన్), థానేదర్ (మిషిగన్), అమీ బెరా (కాలిఫోర్నియా)లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఐదుగురిలో మొదటి ముగ్గురు వరుసగా నాల్గోసారి, అమీ బెరా వరుసగా ఆరో సారి ప్రతినిధుల సభకు ఎన్నిక కావడం గమనార్హం. అరుణ విజయంతో ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో ఆమెబంధువులు సంబరాలు చేసుకున్నారు.