Second Home: మీ వద్ద రూ.కోటి ఉందా అయితే..ఈ దేశాన్ని మీ రెండో ఇంటిగా మార్చుకోవచ్చు

ABN , First Publish Date - 2022-10-28T23:32:32+05:30 IST

ధనవంతులైన విదేశీ పర్యాటకులను ఇండోనేషియా వైపు ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం మరో వీసా పథకాన్ని ప్రవేశపెట్టింది

Second Home: మీ వద్ద రూ.కోటి ఉందా అయితే..ఈ దేశాన్ని మీ రెండో ఇంటిగా మార్చుకోవచ్చు

ఎన్నారై డెస్క్: ధనవంతులైన విదేశీ పర్యాటకులను ఇండోనేషియా(Indonesia) వైపు ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం మరో వీసా పథకాన్ని ప్రవేశపెట్టింది. సెకెండ్ హోమ్(రెండో ఇల్లు) పేరిట ప్రవేశపెట్టిన ఈ వీసా విదేశీయులు పొందాలంటే వారి బ్యాంక్ అకౌంట్లలో కనీసం 2 బిలియన్ రుపయ్యాలు ఉండాలి. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే రూ. కోటి. ఇక వీసా పొందిన వారు ఇండోనేషియాలో ఐదు లేదా పది సంవత్సరాలు పాటు నివసించవచ్చు. అంతేకాకుండా.. వ్యాపారాలు, ఇతర వ్యాపకాలు కూడా చేపట్టవచ్చు.

ఇండోనేషియా ప్రభుత్వం మంగళవారం ఈ కొత్త వీసా(Second Home Visa) విధానాన్ని ప్రకటించింది. క్రిస్మస్ తరువాత ఈ పథకం అమల్లోకి వస్తుందని పేర్కొంది. బాలీతో(Bali) పాటూ ఇండోనేషియాలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు విదేశీయులను రప్పించేందుకు ఈ కొత్త వీసా పథకాన్ని ప్రవేశపెట్టినట్టు వలస విధానాల శాఖ మంత్రి తెలిపారు. ఇండోనేషియాకు విదేశీ పర్యాటకుల రాక పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ వీసాతో వచ్చే విదేశీయులు(Foreign tourists) ఇండోనేషియా ఆర్థికాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడతారని తాము ఆశిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ వీసా కావాలనుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Updated Date - 2022-10-28T23:32:34+05:30 IST