NRI: బ్రిటన్ ప్రధానిపై విమర్శలు.. ఇదేంటి.. రిషి.. ఓ అభాగ్యుడితో అలా మాట్లాడొచ్చా..
ABN , First Publish Date - 2022-12-27T19:03:36+05:30 IST
వీధుల్లో నివసించే ఓ అభాగ్యుడితో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నారై డెస్క్: వీధుల్లో నివసించే ఓ అభాగ్యుడితో(Homeless Man) బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకంటూ ఓ గూడు కూడా లేని వ్యక్తి పట్ల రిషికి జాలి కూడా లేదంటూ ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. బీదలకు ఉచితంగా ఆహారాన్ని అందించే ఓ కేంద్రంలో రిషి సునాక్ జరిపిన సంభాషణ(Conversation) ప్రస్తుతం వైరల్(Viral) అవుతోంది. సామాజిక సేవలో భాగంగా రిషి ఇటీవల ఆ కేంద్రంలో ఆహారాన్ని వడ్డిస్తుండగా ఓ వ్యక్తి ఆహారం కౌంటర్ వద్దకు వచ్చాడు. దీంతో.. రిషి అతడిని పలకరించి మీకే ఫుడ్ ఇష్టం ప్రశ్నించారు. ఈ క్రమంలోనే.. మీరు దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెడతారా అంటూ రిషిని అతడు అడగడంతో ఆయన అవునని సమాధానం ఇచ్చారు.
అయితే బీదరికంతో ఇబ్బంది పడుతున్న అతడిని రిషి... మీరు ఉద్యోగం చేస్తున్నారా..? అని అడగడంతో ఆ వ్యక్తి ఒక్కక్షణం ఇబ్బంది పడ్డాడు. ఆ తరువాత తేరుకుని..తనకు తలదాచుకునేందుకు ఇల్లు లేదని, ప్రస్తుతం వీధుల్లోనే కాలం వెళ్లదీస్తున్నానని చెప్పాడు. రిషి ఏ ఉద్దేశ్యంతో ఈ ప్రశ్న అడిగారో స్పష్టత లేకపోయినప్పటికీ.. ప్రతిపక్షాలకు మాత్రం ఆయనను టార్గెట్ చేసేందుకు అవకాశం చిక్కింది. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను ప్రతిపక్ష నేత ఆంజెలా రెయినార్ ట్విటర్‌లో షేర్ చేస్తూ రిషి తీరుపై విమర్శలు గుప్పించారు. ఓ అభాగ్యుడిని ఇలా అడగడం చూస్తుంటే గుండె మెలిపెట్టినట్టు ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు.. నెటిజన్లు కూడా రిషిపై మండిపడ్డారు. కేవలం ఫొటోలకు ఫోజులివ్వడానికే అతడితో మాట కలిపినట్టు ఉందని, అతడి పట్ల రిషికి సానుభూతి లేనట్లుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రిషికి సామాన్య ప్రజల బాధలు తెలియవంటూ ప్రతిపక్షాలు నిత్యం ఆయన్ను టార్గెట్ చేస్తుంటాయి.