ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి తెరపైకి ఎమ్మెల్సీ కవిత
ABN , First Publish Date - 2022-12-20T22:57:22+05:30 IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi liquor scam case)లో మరోసారి ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేరు తెరపైకి వచ్చింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi liquor scam case)లో మరోసారి ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేరు తెరపైకి వచ్చింది. సమీర్ మహేంద్రు కేసులో ఈడీ (ED) చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు పేర్కొంది. కవిత తన 10 సెల్‌ఫోన్లను ధ్వంసం చేసుకున్నట్లు ఈడీ నిర్ధారించింది. కవితతో పాటు మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తాగౌతమ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, అభిషేక్ రావు పేర్లను ఈడీ ప్రస్తావించింది.
ఒబేరాయ్ హోటల్‌లో సమావేశం జరిగినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది. అనంతరం శరత్ చంద్రారెడ్డి సొంత ఫ్లైట్‌లో హైదరాబాద్ వెళ్లినట్లు ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్‌లో ఎల్-1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని, ఒబేరాయ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌లో కవిత, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, విజయ్‌నాయర్ పాల్గొన్నట్లు చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్‌ను కవిత వెనకుండి నడిపించారని చార్జ్‌షీట్‌లో ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్స్‌లో నిజమైన భాగస్వాములు కవిత, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి అని చార్జ్‌షీట్‌లో ఈడీ వెల్లడించింది.
సౌత్ గ్రూప్ పేరిట రూ.192 కోట్ల లిక్కర్ దందా జరిగిందని, 2022 జనవరిలో హైదరాబాద్‌లో ఆమె నివాసంలో కవితను సమీర్ మహేంద్రు కలిశారని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్స్ కంపెనీ నిర్వహణపై కవితతో సమీర్ మహేంద్రు చర్చించారని, సమీర్ మహేంద్రుకు అరుణ్ పిళ్ళై తన ప్రతినిధి అని కవిత చెప్పినట్టు చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది.
ఇండో స్పిరిట్స్‌కి రూ.192.8 కోట్లు లాభం వచ్చినట్టు చార్జ్‌షీట్‌లో ఈడీ వెల్లడించింది. రూ.192 కోట్లు అక్రమంగా వచ్చినట్టు పేర్కొన్న ఈడీ ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఆప్ నేతలతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడిందని తెలిపింది. ఆ తర్వాతే ఇండో స్పిరిట్స్లో కవిత వాటాలు తీసుకుందని, ఇండో స్పిరిట్స్లో వాటా తీసుకునేందుకు కవిత తరపు వ్యక్తి వి.శ్రీనివాస్రావు ముందుకు వచ్చారని ఈడీ స్పష్టం చేసింది. రూ.కోటి పెట్టినట్లు అరుణ్ పిళ్ళై నవంబర్ 11న ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్‌లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇండో స్పిరిట్స్లో సమీర్ మహేంద్రు వాటా 35 శాతం, బుచ్చిబాబు 16.25 శాతం, అరుణ్ పిళ్లైకి 16.25 శాతం, ప్రేమ్ రాహుల్ మందురీ (మాగుంట రాఘవరెడ్డి) 32.5 శాతం వాటా ఉందని ఈడీ స్పష్టం చేసింది.