పత్తి ఇంట సిరుల పంట

ABN , First Publish Date - 2022-11-06T00:19:40+05:30 IST

ఈ సారి పత్తిపంట రైతులకు సిరులు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన ధర రైతుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. వానకాలం పత్తికొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

పత్తి ఇంట సిరుల పంట
చేవెళ్ల మండలం ఆలూర్‌ గ్రామంలో సాగు చేసిన పత్తి పంట

రికార్డు ధర పలుకుతున్న తెల్ల బంగారం

ఆశాజనకంగా దిగుబడులు

ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు

క్వింటాల్‌కు రూ.8,700ల వరకు పలుకుతున్న ధర

పోటీపడి కొంటున్న వ్యాపారులు

ఇంకా తెరుచుకోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు

ఈ సారి పత్తిపంట రైతులకు సిరులు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన ధర రైతుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. వానకాలం పత్తికొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో త్వరలో మొదలుకానున్నాయి. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌, యాలాల్‌, తాండూరు, పరిగి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతాల్లో పత్తి ఎక్కువ సాగుచేశారు. గత శుక్రవారం గరిష్టంగా క్వింటాలుకు రూ.8,700 ధర వచ్చింది. ప్రైవేట్‌ వ్యాపారులు పోటీపడి పత్తి కొంటున్నారు. గతేడాది క్వింటాలుకు రూ.7వేలకు మించి లేదు. పెరిగిన రేటు రైతులకు ఊరటనిచ్చే అంశం.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): ఈ ఏడాది పత్తి వేసిన రైతుల ముఖంలో సంతోషం వెల్లివిరుస్తోంది. పంట కోత ఆరంభంలోనే పత్తికి రికార్డుస్థాయి ధర లభించడమే ఇందుకు కారణం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో మరో వారం, పది రోజుల్లో కోతలు మొదలుకానున్నాయి. అయితే కోత ఆరంభ దశలోనే రికార్డు స్థాయిలో పత్తి ధర ఉండడంతో రైతులు ఆనందపడుతున్నారు. దీనికితోడు ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. పల్లపు ప్రాంతాల్లో మాత్రం 20 నుంచి 25శాతం పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌, యాలాల్‌, తాండూరు తదితర ప్రాంతాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ మద్దతు ధరకు మించి ఽప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి వచ్చిన వ్యాపారులు పోటీపడి పత్తి కొనుగోలు చేస్తున్నారు. శుక్రవారం గరిష్ఠంగా క్వింటాల్‌కు రూ.8700 ధర వరకు చెల్లించి కొనుగోలు చేశారు. మరికొన్ని చోట్ల క్వింటాల్‌కు రూ.8550 నుంచి రూ.8600 వరకు ధర లభించింది. కొడంగల్‌ మండలంలో ఇప్పటికే 4వేల క్వింటాళ్లు కొనుగోళ్లు జరిగాయి. వాస్తవానికి గత ఏడాది పత్తి క్వింటాల్‌కు రూ.7వేలకు మించి ధర లభించలేదు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం మద్దతు ధర రూ.6,380గా నిర్ణయించింది. దీంతో రైతులు పంట చేతికి వచ్చే సమయానికి ధర ఎలా ఉంటుందోనని ఆందోళన చెందారు. కానీ ఆరంభం నుంచే రికార్డుస్థాయిలో పత్తి ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పత్తిలో 7శాతం తేమ తక్కువగా ఉండి నాణ్యతగా ఉండడంతో వ్యాపారులు కూడా మంచి ధర ఇచ్చేందుకు ఆసక్తిచూపుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మించి వ్యాపారులు మార్కెట్‌లో తెల్ల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది పత్తిసాగు గతంలో కంటే కూడా గణనీయంగా పెరిగింది. వికారాబాద్‌ జిల్లాల్లో సగటు కంటే దాదాపు 60వేల ఎకరాలకు పైగా రైతులు పత్తిసాగు చేయడం గమనార్హం. గత ఏడాది కంటే కూడా 50వేల ఎకరాలు అధికంగా పత్తిపంట వేశారు. రంగారెడ్డి జిల్లాలో సగటు కంటే పత్తిసాగు తగ్గినప్పటికీ.. గత ఏడాది కంటే 27వేల ఎకరాలకుపైగా అధికంగా రైతులు పత్తిని సాగు చేశారు. అలాగే ఈ ఏడాది వర్షాలు దండిగా పడడంతో నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు మినహా మిగతాచోట్ల పత్తి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ కారణంగా ఈసారి పత్తి పంట వేసిన రైతులు ఆనందపడుతున్నారు. ఆరంభంలోనే మంచి ధర రావడంతో ఈ నెలాఖరు నాటికి రేటు మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపారులే పోటీపడి పత్తి కొంటుండడంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు.

పత్తి పంట ధర మరింత పెంచితే బాగుంటుంది : హన్మంతరెడ్డి, రైతు, తాండూరు మండలం

తాండూరు: ఈ ఏడాది రైతులు పత్తి పంటను అధికంగా సాగు చేశారు. అయితే అధిక వర్షాల కారణంగా పంట బాగా దెబ్బతిన్నది. కనీసం ఎకరాకు నాలుగు క్వింటాళ్ల పత్తి కూడా వచ్చే పరిస్థితి లేదు. తగ్గిన ఉత్పత్తితతో ధరలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో మేము చాలా నష్టపోతున్నాం. ఽధరలు బాగున్న సమయంలో పంట దిగుబడులు బాగా తగ్గిపోయి మాకు నష్టం కలుగుతోంది. దిగుబడి ఎక్కువ ఉంటే ధరలు ఉండవు. ప్రతి ఏడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా మేం నష్టపోతున్నాం. ప్రస్తుతం పంట నష్టపోయినం దున పత్తి ధరలు మరింత పెంచితే బాగుంటుంది. గతంలో కూడా పంటలు సరిగ్గా చేతికి రాక ఆర్థికంగా నష్టపోయాం. పత్తికి పెట్టుబడి ఖర్చులూ ఎక్కువే. ఈసారి ధరలు బాగున్నా.. దిగుబడి లేదు. రేటు మరింత పెంచితే గిట్టుబాటు అవుతుంది.

పత్తి సాగు లాభదాయకం : నర్సింలు, రైతు , కొడంగల్‌

కొడంగల్‌: ఈ సారి వర్షాలు పుష్కలంగా కురవడంతో నాకు పత్తి దిగుబడి బాగానే వచ్చింది. దీంతోపాటు క్వింటాలుకు రూ.8,600 ధర పలకడం లాభదాయకంగా ఉంది. గతేడాది కంటే దిగుబడితోపాటు గిట్టుబాటు ధర పలకడం సంతోషదాయకం. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో పత్తి సాగుచేసిన రైతులకు మాత్రం దిగుబడిలో నష్టం వాటిల్లింది.

Updated Date - 2022-11-06T00:24:21+05:30 IST