హరితహారం.. అపహాస్యం
ABN , First Publish Date - 2022-02-01T05:09:46+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం

- మొక్కలు ఎండుతున్నా పట్టని అధికారులు
- విద్యుత్ తీగల కింద పెరిగిన చెట్లను అడ్డంగా నరికేస్తున్న ట్రాన్స్‌కో
యాచారం, జనవరి 31 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం అభాసుపాలవుతోంది. గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించే నాథుడే కనిపించడం లేదు. యాచారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో హరితహారం కింద నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. అయినా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. 24 గ్రామ పంచాయతీలతోపాటు మరో 20 అనుబంధ గ్రామాల్లో హరితహారం కింద మొక్కలు నాటారు. వాటికి నీరు పోసి రక్షించేవారు లేక ఎండిపోతున్నాయి. ఎండిన మొక్కల స్థానంలో కొత్తవాటిని కూడా నాటడం లేదని ఇటీవల సామాజిక తనిఖీ బృందం తేల్చింది. పంచాయతీలకు ప్రత్యేక ట్రాక్టర్లు ఉన్నా మొక్కలకు నీరు పోసి సంరక్షించడంలో పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారు. ఆరునెలల క్రితం తక్కళ్లపల్లి గ్రామపరిధిలో హరితహారం మొక్కలను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ తనిఖీ చేశారు. చాలావరకు మొక్కలు ఎండిపోవడం చూసి గ్రామపంచాయతీ కార్యదర్శిని వెంటనే బదిలీ చేశారు. అయినా పంచాయతీ అధికారుల్లో చలనం రాకపోవడం దారుణమని పలువురు గ్రామీణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణతోపాటు చెత్త తరలింపునకు పంచాయతీలకు ట్రాక్టర్లు అందించింది. వాటిని ఉపయోగించి మొక్కలను సంరక్షించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రహదారుల వెంట చిన్న మొక్కలను నాటడంతో అవి కొంతకాలానికే ఎండిపోయాయి. గున్‌గల్ మొదలుకొని మాల్ వరకు సాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై నాటిన మొక్కలు మాత్రమే కాస్త పెరిగాయి. పలు గ్రామాల్లో 11కేవీ విద్యుత్ వైర్ల కింద పెరిగిన చెట్లను ట్రాన్స్‌కో అధికారులు అడ్డదిడ్డంగా నరికివేస్తున్నారు. విద్యుత్ వైర్ల కింద మొక్కలు నాటరాదని ట్రాన్స్‌కో అధికారులు ముందే సూచించినా పట్టించుకోకుండా చెట్లను నాటుతున్నారు. దీంతో ఏపుగా పెరిగిన తరువాత వాటిని నరికివేస్తుండటంతో వేలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. వచ్చే వానాకాలంలో విద్యుత్ లైన్ల కింద మొక్కలు నాటకుండా ట్రాన్స్‌కో అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటిస్తాం
మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో తిరిగి కొత్తగా మొక్కలు నాటాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశిస్తాం. బాగా ఏపుగా పెరిగిన తరువాత చెట్లను నరికి వేయడం మంచిదికాదు. వైర్ల కింద ఉన్న చెట్ల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని నరికి వేసి ఉండవచ్చు. ఇక నుంచి విద్యుత్ వైర్ల కింద మొక్కలు నాటకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచిస్తాం. నర్సరీలలో డబ్బు వెచ్చించి పెంచిన మొక్కలు ఎండిపోకుండా చొరవ తీసుకుంటాను.
- విజయలక్ష్మి, యాచారం ఎంపీడీవో