పచ్చదనం వెల్లివిరియాలి
ABN , First Publish Date - 2022-04-18T05:30:00+05:30 IST
పచ్చదనం వెల్లివిరియాలి

- బాగా పని చేసిన కార్యదర్శులకు ప్రత్యేక అవార్డులు
- హరితహారం సమీక్షలో సీఎం ఓఎ్‌సడీ ప్రియాంక వర్గీస్
మేడ్చల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హరితహారంలో భాగంగా గ్రామాలు, మునిసిపాలిటీల్లో పచ్చదనం వెల్లివిరియాలని సీఎం ఓఎ్‌సడీ ప్రియాంకవర్గీస్ అన్నారు. సోమవారం మేడ్చల్ కలెక్టరేట్‌లో హరితహారంపై కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, హరితహారం కోసం రూపొందించిన ప్రణాళికను ప్రజాప్రతినిధులతో అమోదింప చేసుకోవాలన్నారు. కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు. మనఊరు-మనపట్టణం-మనహరితహారం అనేకోణంలో అందరు ముందుకు సాగాలన్నారు. అందరు కలిసి మొక్కలు నాటాలని, వాటిని రక్షించాలని సూచించారు. ఎక్కడ చూసినా పచ్చదనం కనిపించాలన్నారు. అటవీ అధికారులు కూడా ప్రణాళికలు తయారు చేసుకొని ఈసారి పెద్ద మొత్తంలో మొక్కలు నాటాలన్నారు. రోడ్ల వెంట మొక్కలను నాటటడంతో పాటు వాటికి టీగార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మునిసిపాలిటీల్లో వివిధ రకాల మొక్కలతో పాటు అందాన్ని పచ్చదనాన్ని ఇచ్చే మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే పల్లె, పట్ణణ ప్రగతిలో ముందస్తుగా గుంతలు తవ్వుకొని మొక్కలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. మేడ్చల్ జిల్లాలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పెద్దవై పచ్చదనాన్ని పంచుతున్నాయని ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం, డీపీవో రమణమూర్తి, జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పద్మాజారాణి, అబ్కారీశాఖ అధికారులు, మునిసిపాలిటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.