చరిత్ర కూడా సంపదే!
ABN , First Publish Date - 2023-04-18T01:19:11+05:30 IST
నేడు వరల్డ్ హెరిటేజ్ డే

గొప్ప చారిత్రక సంపదకు ఖజానా చిత్తూరు జిల్లా. ఆలయాలు, కోటలు, దారి మండపాలు, పుష్కరిణిలు.. వందల ఏళ్ల నాటి నిర్మాణ నైపుణ్యాలకు సాక్ష్యాలు. శిల్ప సౌందర్యం గల ఎన్నో ఆలయాల్లో శాసనాలున్నాయి. చరిత్ర విలువ తెలియని పాలకుల పాపాలకు నిదర్శనంగా వీటిలో అనేకం శిథిల స్థితిలో ఉన్నాయి. గర్వించదగిన ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా భద్రంగా అందించాల్సిన పాలకులు వీటిని గాలికొదిలేశారు. చరిత్రను పర్యాటకంగా మలచుకునే అవకాశాలున్నా పట్టించుకోవడం లేదు. సున్నాలు పూసి, సిమెంటు పోసి అనేక శాసనాధారాలను అభివృద్ధి పేరుతో చెరిపేశారు. ఊరూరా ఉండే వీరశిలలు దాదాపు కనుమరుగైపోయాయి. అనేక నిర్మాణాలు దురాక్రమణ పాలయ్యాయి. వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా జిల్లాలో మిగిలిన కొన్ని చారిత్రక నిర్మాణాలను అందిస్తున్నాం...
నిమ్నవర్గాల చరిత్ర కంగుంది కోట
కుప్పం, ఏప్రిల్ 17: చరిత్రలో నిమ్న వర్గాలు ఎదుర్కొన్న అనేక అవమానాలు కనిపిస్తాయి. కానీ కంగుంది సంస్థాన చరిత్రలో ఆ నిమ్న వర్గాలు, బలహీన వర్గాలే ఏలికలైన నిమ్నవర్గాల ఆత్మగౌరవ చిహ్నాలు ఈ కంగుంది నిర్మాణాలు. యానాదులు, అనంతరం బోయలు పాలకులుగా ఉన్న ప్రాంతం ఇది. వెయ్యేళ్ల చరిత్రకు మిగిలిన సాక్ష్యాలు. కుప్పం మండలంలో కంగుంది కోట ఉంది. ఒకప్పుడు కంగుంది సంస్థానం వైశాల్యం 346.49 చదరపు మైళ్లు. అప్పట్లో ఉత్తరార్కాటు జిల్లాలో 41.43 చదరపు మైళ్లు, చిత్తూరు జిల్లాలో 304.96 మైళ్లు విస్తీర్ణం కలిగి ఉండేది. కంగుంది గుట్ట చుట్టూ కోట నిర్మించారు. దుర్గం పాద పీఠాన కృష్ణస్వామి ఆలయం, శిఖరంపైన మల్లీశ్వరస్వామి ఆలయాలు ఉంటాయి.
ఇదీ చరిత్ర
కంగి, కంగడు అనే యానాది దంపతులు తొలుత కంగుంది దుర్గం చుట్టూ మట్టికోటను నిర్మించారు. చిన్న సంస్థానాన్ని ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను ఏలసాగారు. గుత్తి అనే ప్రాంతంలో ప్యాపిలి సంస్థానాన్ని ఏలిన బోయ వంశస్తుడు మల్లినాయుడి కుమారుడైన మూడో కంబినాయుడు క్రీస్తు శకం 1066లో జైత్రయాత్ర చేస్తూ కంగుంది దుర్గం సమీపంలోని ఒక గుట్టను చేరుకుని, దానిచుట్టూ గోనుగూరు అనే గ్రామం నిర్మించాడు. గుట్టపైన బేటరాయస్వామి ఆలయం నిర్మించాడు. కంగుంది పాళెగాడు కంగడు, కంబినాయునిపై యుద్ధం ప్రకటించాడు. అయితే కంబినాయుడు అతడితో స్నేహ సంధిని కోరాడు. తన స్థావరానికి ఆహ్వానించిన కంగడు, కంగిలను కుట్రపూరితంగా సంహరించి కంబినాయుడు కంగుంది సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్నాడని స్థానికంగా జనం చెప్పుకుంటున్న చరిత్ర. ఆ తర్వాత 1066 సంవత్సరములోనే కంగుంది దుర్గం చుట్టూ అప్పటికే యానాది పాలెగాళ్లు నిర్మించిన కోటను మరింత పటిష్ఠం చేసిన కంబినాయుడు ఇక్కడినుంచే పాలన సాగించాడు. అప్పటినుంచి స్వాతంత్ర్యానంతరం 1950వ సంవత్సరం దాకా కంగుంది సంస్థానం రాజా కంబినాయుడు వారసుల ఏలుబడిలోనే ఉంది. చిట్టచివరి పాలకుడిగా రాజా వెంకటపతినాయుడు (1918-1950) కొనసాగారు.
ఏకిల దొరల నిర్మాణ నైపుణ్యం
శిల్పనైపుణ్యాలు, వివిధ అద్భుత కట్టడాలు, 108 ఆలయాలతో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా పుంగనూరు చారిత్రక చిహ్నంగా పేరుగాంచింది. క్రీ.శ.600 సంవత్సరాల నుంచే బలీయమైన పాళెంగా వెలుగొందినట్లు నాటి చరిత్రకారుల రచనలు, పాలకుల శాసనాల వల్ల తెలుస్తోంది. ఆంధ్రదేశ చరిత్రలో విజయనగర రాజుల పాలనకాలం నుంచి సంస్థానాధీశుల వరకు ప్రత్యేకత చాటుకుంటూ వచ్చింది. పుంగనూరు నాడు విదేశీ వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉంటూ క్రీ.శ.991లో సముద్రయానంతో 46 దేశాలతో వ్యాపారాలు నిర్వహించేవారు. చోళరాజుల పాలెగాళ్లు అయిన ఏకిల దొరలు పుంగనూరు ప్రాంతాన్ని పాలించేవారు. ఇక్కడ శిలాశాసనాలు, శిల్పాలు, అరుదైన ఆలయాలు, కోనేర్లు, కోటలు అనేకం ఉన్నాయి. క్రీ.శ.7వ శతాబ్దం ప్రఽథమార్థభాగంలో పులినాడు (పుంగనూరు) రేనాటి చోళుల ఆధీనంలోకి రాగా తర్వాత బాణరాజులు పాలనలో పుంగనూరులో గొప్ప కోటను నిర్మించారు. క్రీ.శ.1308లో పుంగనూరు గంగవంశీయుల ఆధీనంలోకి వెళ్లింది. సుగుటూరు వంశీయులే నేటి పుంగనూరు జమిందారులు. క్రీ.శ. 1479 నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు పుంగనూరును జమిందారులే పాలించారు. 116 ద్వారాలతో గొప్ప రాజబంగళా (జమిందారి నగరి) నిర్మాణం, ప్యాలెస్ చుట్టూ బాణరాజులు నిర్మించిన బలీయమైన కోట. కోటకు నాలుగువైపులా 18 అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పుగల సింహద్వారాలు, కోట చుట్టూ 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతుగా కందకాలు ఉండేవి. బ్రిటీషువారు అధికారంలోకి రాగా కోట మరమ్మతులు నిలిపేశారు. దాదాపు వెయ్యి ఏళ్లనాటి కోట, కందకాలు ప్రస్తుతం మచ్చుకుకూడా కనిపించలేదు. జాతర రోజుల్లో ప్యాలెస్ గత వైభవాన్ని సంతరించుకుని కళకళలాడుతుంది. జమిందారీ ప్యాలెస్, ముఖద్వారం లాంటి చారిత్రక ప్రదేశాలను కాపాడి భావితరాలకు నాటి కళను చూపించాల్సి ఉంది.
- పుంగనూరు