‘మూగ’బోయిన గోదారి!

ABN , First Publish Date - 2023-01-28T00:50:08+05:30 IST

గోదారి గట్టుంది.. గట్టుమీద సెట్టుంది.. సెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది.. అంటూ మూగమనసులు సినిమాలో ప్రశ్నించిన జమున ఇకలేరు

‘మూగ’బోయిన గోదారి!

జమున మృతితో ఉమ్మడి జిల్లాలో విషాదఛాయలు

సినీ, రాజకీయ రంగ ప్రవేశం రాజమహేంద్రవరం నుంచే,,

మూగమనసులు చిత్రంతో ఖ్యాతి

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 27: గోదారి గట్టుంది.. గట్టుమీద సెట్టుంది.. సెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది.. అంటూ మూగమనసులు సినిమాలో ప్రశ్నించిన జమున ఇకలేరు.. పుట్టింది హంపీలో అయినా గోదావరి తీర ప్రాంతంతో జమునకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడే నటనలో ఓనమాలు దిద్దారు.. రాజకీయంగానూ ఇక్కడి నుంచే ఎంపీగా సేవలందించారు. మూ గమనసులు సినిమాతో స్టార్‌డమ్‌ సంపాదించారు.. ఇలా గోదావరి తీర ప్రాంతంతో సీనియర్‌ నటి జమున (86)కి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ మృతితో రాజమహేంద్రవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నటనలోనూ ఓనమాలు ఇక్కడే..

1953లో పుట్టినిల్లు సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన జమున తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగా రు. పుట్టినిల్లు సినిమాకు జమునను ఎంపిక చేసిన తరువాత ఆమెను నెలరోజుల పాటు రాజమహేంద్రవరం తీసుకువచ్చి గరికపాటి రాజారావువద్ద యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పించారట. దీంతో తన సినీరంగ ప్రవేశం ఒక రకంగా రాజమహేంద్రవరం నుంచే ప్రారంభమైనట్టు. అటుపై మూగమనసులు హిందీ వెర్షన్‌ షూటింగ్‌ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో జరిగింది. 18 రోజుల పాటు రాజమహేంద్రవరంలో ఉండి షూటింగ్‌ను పూర్తిచేశారు. అలాగే తాతా రావు గారి అమ్మాయి సినిమా కూడా ఇక్కడే చిత్రీకరించారు.

1989లో రాజమహేంద్రవరం ఎంపీగా...

చిత్రపరిశ్రమలో తనదైన శైలిలో అన్నిపాత్రలను నటించి ప్రేక్షకాదరణ పొందిన జమున కాంగ్రెస్‌ పార్టీ అభిమాని. 1980లో జమున కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్నారు. రాజమహేంద్రవరం ఎంపీగా 1989లో పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఆమెకు రాజమహేంద్రవరం అంటే అమితమైన ఇష్టం. ఆమె పదవిలో ఉండగా పేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, ఆర్థిక సహాయాలు చేశారు. రెండేళ్లపాటు రాజమహేంద్రవరం ఎంపీగా పనిచేసి మంచి పేరుతెచ్చుకున్నారు.

రాజమహేంద్రవరంలో జమున స్కూల్‌..

ఎంపీగా పనిచేసిన సమయంలో ఆనంద్‌నగర్‌లో ఒక స్కూల్‌ను జమున కట్టించారు. 1990లో స్కూల్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. అప్పటినుంచి ఆ స్కూల్‌కు జమున స్కూల్‌ అని పేరువచ్చింది. ఆనంద్‌నగర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ అనే పేరు ఉన్నా ప్రజలు మాత్రం ఆ స్కూల్‌ను జమున స్కూల్‌ అనే పిలుస్తారు.

12 ఏళ్ల కిందట రామవరం వచ్చారు...

అనపర్తి: అంతరించిపోతున్న నాటక రంగాన్ని బతికిం చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సినీనటి జమున అనేమారు. అనపర్తి మండలం రామవరం లోని నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్‌ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలను 2010 లో ఆమె, మరోనటి రమాప్రభ, శాసనసభ మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతితో కలిసి ప్రారంభించారు. ఆమె మాటలు ఈ ప్రాంత ప్రజల్లో నేటికీ చెరగని ముద్రను వేశాయి.

నటనలో మేటి జమున

జిత్‌మోహన్‌ మిత్రా, సినీ నటుడు

జమున నటన అద్భుతం.. హీరోతో పోటాపోటీగా నటన ఉండేది. రాజమహేంద్రవరంలోనే గరికపాటి వద్ద శిక్షణ పొందారు. ఎంపీగా కూడా సేవలు అందించారు. చాలా మందిని ఆదుకున్నారు. ఎటువంటి పాత్ర అయిన జమున చాలా అవలీలగా చేసేవారు. ఆమె మరణం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.

ద్రాక్షారామతో అనుబంధం

రంగస్థల వృత్తికళాకారుల సమాఖ్య తరపున నాజర్‌కు సత్కారం

ద్రాక్షారామ నాటక కళాపరిషత్‌ గౌరవాధ్యక్షురాలిగా జమున

ద్రాక్షారామ, జనవరి 27: సినీనటి, మాజీ ఎంపీ జమునకు ద్రాక్షారామతో ఎంతో అనుబంధం ఉంది. రంగస్థలంపై ఉన్న అభిమానంతో జమున ఏపీ రాష్ట్రరంగస్థల వృత్తికళాకారుల సమాఖ్య ఏర్పాటుచేశారు. రంగస్థల వృత్తికళాకారుల సమాఖ్య ద్రాక్షారామ శాఖను నాగిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా ఎస్‌వీ అప్పలాచార్యర్‌లతో 1979లో ఏర్పాటుచేశారు. అప్పట్లో తొలిసారిగా ద్రాక్షారామ పర్యటనకు జమున వచ్చారు. అనంతరం 1984లో ద్రాక్షారామలో రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య తరపున జమునను ఘనంగా సత్కరించారు. ద్రాక్షారామ పైండా అన్నసత్రం నుంచి పీవీఆర్‌ ఉన్నత పాఠశాల వరకు భారీ ఊరేగింపుగా నటి జమునను తీసుకెళ్లారు. అదే వేదికపై బుర్రకథ పితామహుడు సీనియర్‌ నాజర్‌ను జమున చేతుల మీదుగా సత్కరించారు. ఇక అప్పట్లో రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్యకు ద్రాక్షారామలో వీరవల్లి వెంకటరత్నం వెయ్యి గజాల స్థలాన్ని వితరణగా ఇచ్చారు. రంగస్థల వృత్తికళాకారులకు ఉపయోగపడేలా ఆ స్థలంలో ఆడిటోరియం నిర్మాణానికి జమున ప్రయత్నించారు. ప్రస్తుతం ఆస్థలం జమున చారిటబుల్‌ ట్రస్టు పేరుతో ఉన్నట్టు సమాచారం. జమున ద్రాక్షారామ నాటక కళాపరిషత్‌ గౌరవ అధ్యక్షురాలుగా పరిషత్‌ నాటకపోటీలకు సహకరించారు. 2010 ఏప్రిల్‌ 24న ద్రాక్షారామ నాటక కళాపరిషత్‌ పోటీలకు జమున ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నాటక పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. రాజమండ్రి ఎంపీ గా పోటీచేసిన సమయంలో పలుమార్లు ద్రాక్షారామలో పర్యటించారు.

కళారంగానికి తీరనిలోటు

నటి జమున మృతి కళారంగానికి తీరనిలోటని మయూర కళాపరిషత్‌ అధ్యక్షుడు ఎస్‌వీ అప్పలాచార్యర్‌, ద్రాక్షారామ నాటకకళాపరిషత్‌ అధ్య క్షుడు నాగిరెడ్డి సతీష్‌రావు, కార్యదర్శి సినీనటి సరోజ, ఉపాధ్యక్షుడు కొండ, కోశాధికారి వేమవరపు రాంబాబు అన్నారు. జమున మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మయూర నాటక పరిషత్‌ అధ్యక్షుడు, విశ్రాంత పాత్రికేయుడు శృంగారం అప్పలాచార్యర్‌ మాట్లాడుతూ తాను నటి జమున వ్యక్తిగత సహాయకునిగా వెన్నంటి ఆరేళ్లపాటు ఉన్నానని. కాంగ్రెస్‌ పార్టీలో చేరి జమున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం నిమిత్తం ఆమె వెంట వెళ్లేవాడినన్నారు. జమున మృతికి సంతాపం తెలుపుతూ మాతృవియోగంతో బాధపడుతున్న వంశీ, స్రవంతిలకు ప్రగాడసానుభూతి తెలిపారు.

సినీనటి జమునకు కోనసీమతో అనుబంధం

అల్లవరం, జనవరి 27: కోనసీమతో జమునకు ప్రత్యేక అనుబంధంఉంది. అల్లవరం మండలం వైనతేయ గోదావరి తీరాన ఏటిగట్టు పక్కన అక్కినేని నాగేశ్వరరావు హీరోగా మూగమనసులు చిత్రంలో జమున నటించారు. బెండమూ ర్లంక గోదావరిలో మూగమనసులు సినిమా సాంగ్‌ చిత్రీక రణ జరిగింది. కొమరగిరిపట్నంలో ఆలయం వద్ద రామా లయం సినిమాలో హీరోగా జగ్గయ్యతో జమున జంటగా నటించారు. అందాల నటుడు హరనాథ్‌తో జ మున ఓ చిత్రంలో నటించారని సినీవిశ్లేషకులు తెలిపారు. జమునతో అనుబంధం మరువరానిదని ప్రొడ్యూసర్‌, మా అసోసియే షన్‌ సభ్యుడు, సినీ నటుడు గుర్రం రామకృష్ణ తెలిపారు. జమున మృతికి ఆయనతోపాటు కోనసీమ ఫిల్మ్‌ అసోసియే షన్‌ అధ్యక్షుడు గనిశెట్టి రమణలాల్‌ సంతాపం తెలిపారు.

శ్రీకృష్ణ తులాభారంలో నటించిన జమున

పోర్టుసిటీ (కాకినాడ), జనవరి 27: సినీ నటిగా జమునారాణి కాకినాడ వాసులకు పరిచయం. రాష్ట్ర కళాకారుల సంఘ అధ్యక్షురాలిగా పనిచేసే సమయంలో కాకినాడ పట్టణ రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షురాలిగా వై.అమ్మాణిభాయి వ్యవహరించే సమయంలో ఆమెతో అనుబంధం ఉండేది. అమ్మాణీభాయికి అక్కినేని నాగేశ్వరరావు గురువు కావడంతో ఆమెతో సత్సంబంధాలు కొనసాగించేది. సినీ నటిగా బిజీగా ఉన్నప్పటికీ రంగస్థలం అంటే మక్కువ కావడంతో నాటక కళాకారులను ఆదుకునేవారు. ఈ క్రమంలోనే కాకినాడ పీజీ సెంటర్‌ అభివృద్ధి కోసం 1977లో సూర్యకళామందిర్‌లో శ్రీకృష్ణ తులాభారం నృత్య నాటికను ప్రదర్శించగా జుమున నటించారు. ఈ ప్రదర్శన కోసం సుమారు రూ.లక్ష వసూలుకాగా వాటిని పీజీ సెంటర్‌ అభివృద్ధి కోసం ఇచ్చినట్లు పీజీ సెంటర్‌ పూర్వ విద్యార్థుల సంఘం తెలిపింది. కాకినాడలో వార్ఫురోడ్డును ఆనుకుని జమున దగ్గరి బంధువులు ఉండటంతో వారి ఇంటికి తరచూ వచ్చేవారు. సినీ, రంగస్థల నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న జమున మృతికి నగరంలోని కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.

తోలుబొమ్మలాట కళాకారుల కోసం కాలనీ

సామర్లకోట, జనవరి 27: ప్రముఖ సినీనటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు జమునా రమణారావు రంగస్థల కళాకారులు, తోలుబొమ్మలాట కళాకా రుల కోసం సామర్లకోట మండలం మాధవ ప ట్నం గ్రామ శివారున 176 మంది కళాకారు లను ఒకేతాటిపైకి తెచ్చి ప్రభుత్వంతో ఒప్పించి వారికి ఇళ్ల స్థలాలు మం జూరు చేయించడమేకాకుండా ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని అమలుచేశారు. అదే ఇప్పుడు మాధవపట్నం శివారున జమునా నగర్‌గా ఏర్పడింది. సంచారజాతులుగా జీవనో పాధిని వెతుక్కుంటూ బతుకుతున్న తోలుబొమ్మ లాట కళాకారులైన బొందిలీ సామాజికవర్గానికి చెందిన వీరికి అప్పటి రాజమహేంద్రవరం ఎంపీగా ఉండగా జమున వీరికి శాశ్వత నీడ కల్పించారు. దీంతో జము నానగర్‌ కేంద్రంగా వీరు అటు వృత్తికళపై జీవనాధారం పొందుతుండడమేగాక మిగిలిన రోజుల్లో పాతదుస్తుల విక్రయాలతో జీవనం సాగిస్తున్నారు. తర్వాత కాలంలో తోలుబొమ్మలాట కళాకారులంతా ఒకచోటకు చేరి వృత్తి పరికరాలైన తోలు బొమ్మల తయారీ, ఆటలో శిక్షణ తదితర అంశాలు నేర్చు కునేందుకు కళామందిరాన్ని నిర్మించి డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వారికి రుణసదుపాయాలు కల్పిస్తున్నారు. శుక్రవారం తమ అభిమాన నటి జమున మరణించిందన్న వార్త తెలిసి జమున నగర కాలనీ వాసులు విషాధంలో మునిగారు.

తోలుబొమ్మలాట నిలిచిందంటే జమున చలువే -తోట బాలకృష్ణ

రాష్ట్రంలో పురాతన ప్రసిద్ధిచెందిన తోలుబొమ్మలాట నేటికీ జనప్రపంచంలో నిలిచి ఉందంటే అది ముమ్మాటికీ నటి, మాజీ ఎంపీ జమున చలువే. మాధవపట్నం జమునానగర్‌ కాలనీ తోలుబొమ్మలాటలో ప్రపంచ ఖ్యాతి గాంచింది. జమున మృతి సమాచారం తెలిసిన వెంటనే తమ కళాకారులు కాలనీలోని కళాకారులందరూ చేరి సంతాపసభ నిర్వహించాం. ఆమె ఆత్మకు శాంతి కలగాల ని అందరూ కలిసి భగవంతుడిని ప్రార్థించాం.

బొందిలీ సామాజిక వర్గానికి గుర్తింపు జమునే

-అనపర్తి ఏడుకొండలు

సంచార జాతులుగా ఊళ్లు పట్టుకుని జీవనం సాగిస్తున్న బొందిలీ సామాజికవర్గాన్ని ఒకచోటకు చేర్చి ప్రభుత్వం తరపున తమకు స్థలాలు, గృహనిర్మాణాలు మంజూరు చేయించి మా హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తోలుబొమ్మలాటకు ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం కలిగించిన జమునను ఎలా మరువగలం.

Updated Date - 2023-01-28T00:50:09+05:30 IST