జెట్టీ.. మూలన పెట్టి..

ABN , First Publish Date - 2023-03-06T00:35:40+05:30 IST

కృష్ణానదిలో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ (ఫ్లోటెల్‌) ఏర్పాటును ఏపీటీడీసీ ఉన్నతాధికారులు పక్కన పెట్టేశారు.

జెట్టీ.. మూలన పెట్టి..

ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు బేఖాతరు

ఏపీటీడీసీ ఎండీ, ఈడీ ఇష్టారాజ్యం

రెండేళ్లుగా ఎందుకు పనికిరాకుండా..

శిథిలావస్థకు చేరుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కృష్ణానదిలో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ (ఫ్లోటెల్‌) ఏర్పాటును ఏపీటీడీసీ ఉన్నతాధికారులు పక్కన పెట్టేశారు. ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ నుంచి వచ్చిన భారీ వాటర్‌ జెట్టీలను కృష్ణానదిలో ఫ్లోటెల్‌గా మార్చటం ద్వారా పర్యాటకాభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌ భార్గవ్‌ ఏడాదిన్నర కిందట ఏపీటీడీసీ ఉన్నతాధికారులకు సూచించారు. అనేక మార్లు ఈ ప్రాజెక్టు గురించి ఆరా తీసినా ఉన్నతాఽధికారులు మాత్రం అడుగు ముందుకు వేయట్లేదు. రజిత్‌ భార్గవ్‌ అడిగినప్పుడల్లా టెండర్లకు వెళ్తున్నామని చెబుతున్నారే తప్ప పట్టించుకోవట్లేదు. ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు, ఐఏఎస్‌ క్యాడర్‌లో పనిచేయాల్సిన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) పోస్టులన్నింటిలో ఒక్కడిగా చెలామణీ అవుతున్న మల్రెడ్డి ఈ ప్రాజెక్టును ముట్టుకోవటానికి ఆసక్తి చూపించటం లేదని తెలుస్తోంది.

రూ.4 కోట్ల విలువైన జెట్టీలు

కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ వాటర్‌ జెట్టీలు ఏపీటీడీసీకి వచ్చాయి. రూ.4 కోట్ల విలువైన ఇవి ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ (జల రవాణా) నుంచి వచ్చి రెండేళ్లు దాటుతోంది. అప్పటి నుంచి నిరుపయోగంగానే పడి ఉంటున్నాయి. వీటిని చూసిన రజిత్‌ భార్గవ్‌కు కృష్ణానది మధ్యన ఫ్లోటెల్‌ ఏర్పాటు చేయటం ద్వారా పర్యాటకాభివృద్ధి సాధించవచ్చనుకున్నారు. వీటిని కృష్ణానది మధ్యలో ఏర్పాటు చేసి, సీఎంతో ప్రారంభింపజేయాలనుకున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నిర్దేశించారు.

ఉన్నతాధికారుల నిర్లక్ష్యం

కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రె స్క్యూ ఆపరేషన్‌ నిర్వహించటానికి వీలుగా గత ప్రభుత్వం వాటర్‌ జెట్టీల అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈలోపు ప్రభుత్వం మారింది. రెండేళ్ల కిందట ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ నుంచి వాటర్‌ జెట్టీలు వచ్చాయి. వీటిని నది మధ్యలో ఎక్కడైనా లంగర్‌ వేసి నీటిపై తేలియాడేలా చేయవచ్చు. కృష్ణానదిలో ఏదైనా బోటు ప్రమాదం జరిగితే సహాయక చర్యల కోసం వీటిని తీసుకెళ్లవచ్చు. నదిలో మునిగిన వారిని తేలిగ్గా కాపాడవచ్చు. అవసరమైన మెటీరియల్‌ కూడా వాటిపై తరలించవచ్చు. అంతేకాదు.. అనేక రకాల ఈవెంట్స్‌తో పాటు పర్యాటకాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను నిర్వహించవచ్చు. వీటన్నింటినీ జాయింట్‌ చేయటం ద్వారా నదిపై తేలియాడే అతిపెద్ద ప్లాట్‌ఫాంను నిర్మించవచ్చు. దీనిపై రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయటం ద్వారా పర్యాటకులకు కృష్ణానది మధ్యలో తేలియాడే హోటల్‌లో భోజనం చేశామన్న ఫీల్‌ను తీసుకురావచ్చని రజిత్‌ భార్గవ్‌ భావించారు. వెంటనే ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్దేశించారు. కానీ, ఇప్పటి వరకు ఆ దిశగానే ఏ ఆలోచన చేయలేదు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ఆదేశాలను కూడా వీరు ఖాతరు చేయలేదు.

Updated Date - 2023-03-06T00:35:40+05:30 IST