నడిరోడ్డుపై విగ్రహమా..?
ABN , Publish Date - Dec 19 , 2023 | 12:59 AM
చిట్టినగర్ కూడలి.. అటు వన్‌టౌన్‌ను, ఇటు టూటౌన్‌ను, రెండు ప్రాంతాలనూ కలిపే కీలకమైన సెంటర్. ఉదయం 9 గంటల తర్వాత, సాయంత్రం 5 గంటల తర్వాత కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఈ కూడలి దాటాలంటే వాహనదారులకు చుక్కలే. ప్రస్తుతం సిగ్నల్ లైట్లు కూడా లేకుండా కిటకిటలాడుతున్న ఈ ప్రాంతంలో ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో ఓ విగ్రహం వెలిసింది. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే మరుపిళ్ల చిట్టి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.

వన్‌టౌన్/చిట్టినగర్, డిసెంబరు 18 : చిట్టినగర్ కూడలి.. అటు వన్‌టౌన్‌ను, ఇటు టూటౌన్‌ను, రెండు ప్రాంతాలనూ కలిపే కీలకమైన సెంటర్. ఉదయం 9 గంటల తర్వాత, సాయంత్రం 5 గంటల తర్వాత కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఈ కూడలి దాటాలంటే వాహనదారులకు చుక్కలే. ప్రస్తుతం సిగ్నల్ లైట్లు కూడా లేకుండా కిటకిటలాడుతున్న ఈ ప్రాంతంలో ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో ఓ విగ్రహం వెలిసింది. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే మరుపిళ్ల చిట్టి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆడుతున్న డ్రామా ఇదని విమర్శిస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బందికరం
ఈ కూడలిలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తుంటారు. విగ్రహం ఏర్పాటు చేయడంతో పోలీసులు అక్కడ విధులు నిర్వహించుకునేందుకు ఆటంకం ఏర్పడింది. మరుపిళ్ల చిట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కార్మికుల కోసం పోరాటం చేయడంతో ఆయనను అందరూ సర్దార్ అనేవారు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎవరికీ ఇబ్బంది లేదని, ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించే కూడలిలో విగ్రహం పెట్టడం ఏమిటని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ ఇబ్బందికరంగా లేనిచోట విగ్రహం పెట్టుకోవాలని సూచిస్తున్నారు.