Nagababu : తిరుమల పుణ్య క్షేత్రానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి
ABN , First Publish Date - 2023-05-05T12:46:30+05:30 IST
టీటీడీ స్వయంపాలక క్షేత్రంగా ఉండాలనేది కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. ఆలయానికి చెందిన ఆస్తులన్నీ అందినంత వరకూ దోచుకుంటున్నారని విమర్శించారు.
అమరావతి : టీటీడీ స్వయంపాలక క్షేత్రంగా ఉండాలనేది కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. ఆలయానికి చెందిన ఆస్తులన్నీ అందినంత వరకూ దోచుకుంటున్నారని విమర్శించారు. కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి గురించి బహిరంగ చర్చ జరగాలన్నారు. దేవస్థానం నిర్వహణలో ఖచ్చితమైన జవాబుదారీతనం ఉండాలన్నారు. జనసేన ప్రభుత్వంలో విభిన్న వర్గాల అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తామని నాగబాబు పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ వ్యవహారాలలో ఆయా పార్టీల నాయకుల అజమాయిషీ పెరగడం, తమ ప్రభుత్వమే అనే ధీమాతో అయిదేళ్ల పాలనలో అందినంత సొమ్ములు దోచుకోవడం అనాదిగా చూస్తూనే ఉన్నామని నాగబాబు పేర్కొన్నారు.
‘‘కానుకల రూపంలో ప్రతీ రోజు వస్తున్న కోట్లాది రూపాయల ఆదాయంపై లెక్కా పత్రం లేకుండా పోతోంది. తిరుమల పుణ్య క్షేత్రానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. గంజాయి, సిగరెట్, గుట్కా, మద్యం లాంటివి తిరుమల కొండపై యథేచ్ఛగా విక్రయించడం ఆలయ ధర్మానికి విరుద్ధం. కొండపై మాదక ద్రవ్యాలు దొరికినప్పుడల్లా నిర్లక్ష్యంతో చేతులు దులుపుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఖచ్చితమైన జవాబుదారీతనం ఉండాల్సిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, అత్యధిక మంది భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం. స్వయంపాలన అన్నదే విభిన్న వర్గాల అభిప్రాయం అయితే ఇంతకాలం కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి అనేది ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపిస్తాం’’ అని నాగబాబు పేర్కొన్నారు.