ఓం నారాయణ.. ఆది నారాయణ!

ABN , First Publish Date - 2023-08-25T00:04:43+05:30 IST

వెంకయ్య స్వామి 41వ ఆరాధనోత్సవాల్లో చివరి రోజు గురువారం గొలగమూడి గ్రామం భక్తులతో కిక్కిరిసింది.

ఓం నారాయణ.. ఆది నారాయణ!
అశేష భక్తజనం నడుమ ముందుకు సాగుతున్న వెంకయ్యస్వామి రథం

భక్తులతో కిక్కిరిసిన గొలగమూడి

ఉత్సాహంగా సాగిన స్వామివారి రఽథోత్సవం

వెంకటాచలం, ఆగష్టు 24 : వెంకయ్య స్వామి 41వ ఆరాధనోత్సవాల్లో చివరి రోజు గురువారం గొలగమూడి గ్రామం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు తరలిరావడంతో వీధులన్నీ జనసంద్రంగా మారాయి. స్వామి వారి సమాధి మందిరాన్ని దర్శించుకోవడానికి భక్తులు గంటల కొద్దీ క్యూలో నిలబడ్డారు. కాగా, ఉదయం 9 గంటలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆశ్రమ ఈవో బాలసుబ్రహ్మణ్యం కాకాణి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమ అర్చకులు కాకాణి దంపతుల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 10 గంటలకు మంత్రి కాకాణి ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ముందుకు లాగారు. ఆ తర్వాత రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. రథంపై ఆశీనులైన స్వామివారు గ్రామంలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి భోజనం చేశారు. భక్తుల కోసం ఆశ్రమ నిర్వాహకులు మంచి నీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు వంటి వసతులు కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి పర్యవేక్షణలో సీఐలు రామకృష్ణరెడ్డి, వెంకటేశ్వర రావు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు ఆర్డీవో మలోల, తహసీల్దారు కృష్ణ, ఆలయ పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కనుల పండువగా తెప్పోత్సవం

రాత్రి ఆలయ కోనేరులో తెప్పపై వెంకయ్యస్వామి భక్తులను దర్శనం ఇచ్చారు. ఆశ్రమం పక్కన ఉన్న కోనేరులో ఏర్పాటు చేసిన తెప్పను రంగు రంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. తెప్పపై వెంకయ్యను ఆశీనులను చేసి పూలతో అలంకరించారు. తెప్పోత్సవం జరుగుతున్నంత సేపూ భక్తులు ఓం నారాయణ, ఆది నారాయణ అంటూ భజనలు చేశారు. దీంతో కోనేటి పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

====================

డీఈవో ఆఫీస్‌

‘సర్దుబాటు’లో మార్పులు

‘ఫ్యాప్టో’ ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం

కొందరు టీచర్లకు తప్పిన బదిలీలు

సర్క్యులర్‌ జారీ చేసిన విద్యాశాఖ

నెల్లూరు (విద్య), ఆగస్టు 24 : ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ప్రభుత్వం దిగివచ్చింది. పాఠశాల విద్యాశాఖ పునరాలోచించి స్వల్పమార్పులు చేస్తూ కొత్త సర్క్యులర్‌ విడుదల చేశారు. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీలు, ఉద్యోగోన్నతుల వంటి ప్రక్రియలన్నీ ఇటీవల జరిగాయి. ఆ తర్వాత పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు మిగులు జాబితాలో ఉన్నారు. వీరిని పని సర్దుబాటు విధానం ద్వారా పలు పాఠశాలలకు సర్దుబాటు ప్రక్రియకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. అయితే ప్రభుత్వం సరికొత్త విధానానికి తెరలేపడం, అనాలోచిత నిర్ణయాలతో ఉపాధ్యాయులు సమస్యలపై రోడ్డెక్కుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఫ్యాప్టో నేతలు వివిధ దశల్లో ఆందోళనలు నిర్వహించారు. టీచర్ల కొరతను బూచిగా చూపించి ఇష్టారీతిన ఒకచోట పనిచేసే వారిని మరోచోటకు డిప్యుటేషన్‌ (సర్దుబాటు) చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. చివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులతో, ఉపాధ్యాయ సంఘ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సర్దుబాటులో సడలింపులు ఇచ్చి ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్త నిరసనను ఫ్యాప్టో తాత్కాలికంగా వాయిదా వేసింది.

నూతన సర్క్యులర్‌ విడుదల

పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు సర్దుబాటు ప్రక్రియపై కొన్ని మార్పులు చేస్తూ నూతన సర్క్యులర్‌ను జారీ చేసింది. వైకల్యం, క్లిష్టమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని, వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ చేస్తున్న వారిని పని సర్దుబాటు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే 150 మంది కంటే తక్కువ రోల్‌ ఉన్నచోట ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎంలు కొనసాగుతారు. జూనియర్‌ ఎస్జీటీలు మాత్రమే మిగులుగా పరిగణించి సర్దుబాటు చేస్తారు. 98 కంటే రోల్‌ తక్కువగా ఉన్న యూపీ స్కూళ్లలో 1 నుంచి 5వతరగతును ఒక యూనిట్‌గా, 6 నుంచి 8వ తరగతులను ఒక యూనిట్‌గా పరిగణిస్తూ సబ్జెక్ట్‌ టీచర్లను అందిస్తారు. అర్హత, అంగీకారం ఉన్న ఎస్జీటీలను పని సర్దుబాటు కింద అవసరమైన ఉన్నత పాఠశాలల్లో నియమిస్తారు. దీనిపై విద్యాశాఖ అధికారులు పాత జాబితాల్లో మార్పులు చేస్తూ కొత్త జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత సర్దుబాటు చేపడతామని జిల్లా అధికారులు చెపుతున్నారు.

Updated Date - 2023-08-25T00:04:43+05:30 IST