Rain: రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు
ABN , First Publish Date - 2023-05-21T19:27:40+05:30 IST
పడమర దిశ నుంచి రాష్ట్రంపైకి పొడిగాలులు వీస్తున్నాయి. దీనికితోడు విదర్భ నుంచి మరాఠ్వాడ, కర్ణాటక (Karnataka) మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో..
విశాఖపట్నం: పడమర దిశ నుంచి రాష్ట్రంపైకి పొడిగాలులు వీస్తున్నాయి. దీనికితోడు విదర్భ నుంచి మరాఠ్వాడ, కర్ణాటక (Karnataka) మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తేమగాలులు రాష్ట్రంపైకి వీశాయి. పొడి, తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో రాయలసీమలో నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, కడప (Chittoor Kadapa), కర్నూలు, కోస్తాలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిశాయి. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ (Rayalaseema)లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆదివారం కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఎండతీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు అంత కంటే ఎక్కువగా నమోదయ్యాయి. కడపలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజులు ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.