ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CID VS CBN : ఒక్క ఆధారం చూపండి

ABN, First Publish Date - 2023-09-25T03:55:08+05:30

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు(Skill Development Project) ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సీఐడీ అధికారులకు సవాల్‌ విసిరారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు.

సీఐడీ ప్రశ్నలకు బాబు కౌంటర్‌!

ఎవరో అన్నారంటూ గాలి ఆరోపణలా?.. నాకు డబ్బు ముట్టిందంటారా?

కనీస సాక్ష్యం చూపించండి.. 2021లోనే కేసు నమోదు చేశారు

జైల్లో ఉంచి 16 రోజులైంది.. ఈ టైంలో నా ఖాతాలు చూడొచ్చుగా!

ఏ రికార్డూ చూడకుండా అనుమానం ఉందంటారా?

దురుద్దేశంతో అడిగేవాటికి ఏమని సమాధానం చెప్పాలి?

స్కిల్‌ ప్రాజెక్టును ఏ అధికారీ ఏ దశలోనూ తప్పుపట్టలేదు

ప్రతిదీ పద్ధతి ప్రకారమే జరిగింది.. ఆ అధికారులంతా ఉన్నారు కదా..

వారినే అడగండి.. సీఐడీ రెండో రోజు విచారణలో బాబు స్పష్టీకరణ

మీది దర్యాప్తు సంస్థ. ఆరోపణలు వచ్చినప్పుడు ఆధారాలు సేకరించి అడగాలి. ఎవరో అన్నారంటూ గాలి ఆరోపణలు చేయొద్దు.

ప్రాజెక్టును అధికారులు తప్పుబడితే.. నేను దానిని విస్మరిస్తే అది నా తప్పు. ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. పైగా అందరూ సంతృప్తిచెందారు.

కింది స్థాయిలో కమిటీలు ఎలా పనిచేస్తున్నాయో, విధులు సరిగా నిర్వహించారో లేదో సీఎం చూడరు. సదరు శాఖ ఉన్నతాధికారులు, కార్యదర్శులు, కార్పొరేషన్‌ అధికారులు చూస్తారు.

నగదు లావాదేవీలు జరిగితే ఎక్కడో చోట బయటపడుతుంది కదా! ఇలా అనుకుంటున్నారు.. అలా అంటున్నారని మేం అనుకుంటున్నామని అంటే ఎలా? నా పేరు, ప్రస్తావన లేనప్పుడు నన్ను ఏమడుగుతారు?

మా పార్టీకి సభ్యత్వం, సాధారణ డొనేషన్ల ద్వారా నిధులు వస్తాయి. ప్రతి పైసాకూ లెక్క ఉంటుంది. మీకుకావాలంటే తనిఖీలు చేసుకోండి.

- చంద్రబాబు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు(Skill Development Project) ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సీఐడీ అధికారులకు సవాల్‌ విసిరారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. రెండ్రోజుల కస్టడీలో చివరి రోజైన ఆదివారం కూడా సీఐడీ(CID) బృందం ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ప్రశ్నించింది. ఆధారాల్లేకుండా అడిగే వాటికి ఏం సమాధానం చెబుతామని ఆయనీ సందర్భంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల సమగ్ర పరిశీలన తర్వాత, అందరి ఆమోదంతో ఒప్పందం కుదిరిందన్నారు. భాగస్వామి విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏమీ లేదని.. అధికారులంతా సవ్యంగానే ఉందని నిర్ధారించారని తేల్చిచెప్పారు. పలు రాష్ట్రాల్లో సీమెన్స్‌ కంపెనీ(Siemens Company) ఇదే తరహా ఒప్పందాలు చేసుకుందని.. కేంద్రం కూడా ఆ సంస్థతో కలిసి పనిచేసిందని గుర్తుచేశారు. సీఐడీ అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా, స్పష్టంగా సమాధానమిచ్చారు. ‘ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు మీ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు వచ్చాయని అంటున్నారు.. మీరేమంటారు’ అని ప్రశ్నించినప్పుడు చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘మీ చేతుల్లో అధికారం ఉంది. మీది దర్యాప్తు సంస్థ. ఆరోపణలు వచ్చినప్పుడు ఆధారాలు సేకరించి అడగాలి. ఎవరో అన్నారంటూ గాలి ఆరోపణలు చేయొద్దు.. 45 ఏళ్ల రాజకీయ జీవితం నాది. ఎంతో నిబద్ధతతో రాజకీయాలు చేశాను. దానిని చంపేయకండి. 2021లోనే కేసు నమోదు చేశారు. నన్ను అరెస్టు చేసి 16 రోజులవుతోంది. ఈ మధ్యకాలంలో నా ఖాతాల వివరాలన్నీ మీరు తెప్పించుకుని ఉండొచ్చు కదా! ఏమైనా చూశారా? మీకు ఎక్కడైనా కనిపించిందా? ఏ రికార్డూ చూడకుండా అనుమానం ఉందని అంటే ఎలా? దురుద్దేశపూర్వకంగా అడిగేవాటికి ఏమని సమాధానం చెప్పాలి’ అని నిలదీశారు.


నాకెలా అంటగడతారు..?

ఈ ప్రాజెక్టులో కీలక వ్యక్తులైన వికాస్‌ ఖన్వేల్కర్‌, సుమన్‌ బోస్‌(Vikas Khanvelkar and Suman Bose) మధ్య జరిగిన చాట్‌లో ‘రెండు టన్నులు హైదరాబాద్‌లో డెలివరీ చేశాం’ అని ఉంది.. అది మీ కోసమే అనుకుంటున్నామని సీఐడీ అధికారులు ప్రస్తావించినప్పుడు కూడా చంద్రబాబు తీవ్రంగానే స్పందించారు. ‘ఇద్దరి మధ్య చాట్‌ జరిగితే దాన్ని నాకు ఎలా అంటగడుతారు? ప్రత్యక్షంగా, పరోక్షంగా నా పేరు ప్రస్తావించారా? నా పేరుంటే నన్ను అడగండి. ప్రతి ఒక్కదానికీ సమాధానం చెబుతా. నగదు లావాదేవీలు జరిగితే ఎక్కడో చోట బయటపడుతుంది కదా! ఇలా అనుకుంటున్నారు.. అలా అంటున్నారని మేం అనుకుంటున్నాం అంటే ఎలా? నా పేరు, ప్రస్తావన లేనప్పుడు నన్ను ఏమడుగుతారు’ అని ఎదురు ప్రశ్నించారు.

ఫైళ్లన్నీ చూడండి..

ఈ ప్రాజెక్టు మీకోసమే డిజైన్‌ చేశారు.. ఇందులో అధికారుల ప్రమేయం ఏమీ లేదు కదా అని సీఐడీ అధికారులు ప్రశ్నించినప్పుడు కూడా ఆయన చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఫైళ్లూ చూడండి. ఏ దశలోనూ, ఏ అధికారీ ప్రాజెక్టు మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు, దీనిని తప్పుపట్టలేదు. ఆ అధికారులంతా ఉన్నారు కదా! వారిని అడగండి. ఫైళ్లలో ఏమైనా రాశారేమో? నిబంధనల ప్రకారం ఫైళ్లు అధికారులు చూస్తారు. ఇందులో తప్పులు జరుగుతున్నాయని నా దృష్టికి ఎవరూ తేలేదు. అధికారులు దీనిని తప్పుబడితే.. నేను దానిని విస్మరిస్తే అది నా తప్పు. ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. పైగా అందరూ సంతృప్తిచెందారు. అప్పట్లో ఆర్థిక శాఖలో ఉన్న సునీత కూడా దశల వారీగా చెల్లింపులు చేయాలని రాశారు. అదే విషయాన్ని పాటించాం. మరి తప్పు ఎక్కడ జరిగింది? ఊహాజనితమైన ఆరోపణలు, ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే ఎలా’ అని ప్రశ్నించారు.

అది రొటీన్‌ నియామకమే

‘స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లో యూపీ కేడర్‌కు చెందిన అపర్ణ అనే ఐఏఎస్‌ అధికారిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. ఆమె భర్త డిజైన్‌టెక్‌లో పనిచేస్తున్న విషయం మీకు తెలుసా? మీరే ఆమెను ఎంపిక చేశారట కదా’ అని సీఐడీ ప్రశ్నించగా చంద్రబాబు తోసిపుచ్చారు. ఆమె డిప్యుటేషన్‌ ఫైలు చూసుకోవాలని సూచించారు. ‘ఏటా చాలా మంది అధికారులు డిప్యుటేషన్‌పై వస్తుంటారు. వారంతా ఎవరికి బంధువులో, ఎవరికి సన్నిహితులో ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుంది? ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే సీఎస్‌ నిబంధనల ప్రకారం ఆమోదించారు. కేంద్రం కూడా డిప్యుటేషన్‌ను ఆమోదించింది. ఇది అధికారుల స్థాయిలో జరిగిన నిర్ణయం. ఆమె ఏపీలో రిపోర్టుచేసిన తర్వాత స్కిల్‌ కార్పొరేషన్‌కు ఆమె తగిన వ్యక్తి అని అధికారులు సిఫారసుచేస్తేనే నేను ఓకే చేశాను. ఆమె భర్త గురించి అప్పట్లో నాకు తెలియదు. ఆమె భర్త డిజైన్‌టెక్‌లో పనిచేస్తుంటే ఆమె ఆ విషయం అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఏ అధికారీ ఆ విషయం నా దృష్టికి తీసుకురాలేదు. ఇది రొటీన్‌గా జరిగిన నియామకమే తప్ప అనుకుని చేసింది కాదు. అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయి.. ఫైల్‌ చూస్తే అర్థమవుతుంది’ అని తేల్చిచెప్పారు.

కావాలంటే తనిఖీలు చేసుకోండి

‘మీ పార్టీకి ఆ సమయంలో పెద్ద మొత్తంలో ఫండ్స్‌ వచ్చాయని అనుమానాలు ఉన్నాయి’ అని సీఐడీ అన్నప్పుడు కూడా చంద్రబాబు గట్టిగా స్పందించారు. ‘మా పార్టీకి సభ్యత్వం, సాధారణ డొనేషన్ల ద్వారా నిధులు వస్తాయి. ప్రతి పైసాకూ లెక్క ఉంటుంది. మీకుకావాలంటే తనిఖీలు చేసుకోండి. అక్రమ సొమ్మేదీ మాకు రాదు. మా అకౌంట్లు చూసొచ్చి ఈ ఆరోపణ చేస్తే బాగుండేది. ముందుగా ఏవీ పరిశీలన చేయకుండా, ఏ వివరణా తీసుకోకుండా ఇప్పుడొచ్చి ఆరోపణలు చేయడం సమంజసం కాదు’ అని స్పష్టంచేశారు.

ఆ పని చూసేది అధికారులు..

స్కిల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు, కింది స్థాయిలో కార్యక్రమం అమలు పర్యవేక్షణకు ఏర్పాటైన కమిటీ అన్నీ సరిగా చూసిందో లేదో మీరు చెక్‌ చేయలేదా అని సీఐడీ అధికారులు ప్రశ్నించగా.. కింది స్థాయిలో కమిటీలు ఎలా పనిచేస్తున్నాయో, విధులు సరిగా నిర్వహించారో లేదో సీఎంగా ఉన్న వ్యక్తి చూడరని చంద్రబాబు కౌంటర్‌ ఇచ్చారు. సదరు శాఖలో ఉన్న ఉన్నతాధికారులు, కార్యదర్శులు, కార్పొరేషన్‌ అధికారులు చూస్తారన్నారు.

Updated Date - 2023-09-25T04:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising