Srisailam: శ్రీగిరిపై వైభవంగా బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2023-02-11T21:24:19+05:30 IST
శ్రీశైలం క్షేత్రంలో మహా శివరాత్రి (Maha Shivratri) బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నవాహ్నిక దీక్షతో 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం: శ్రీశైలం (Srisailam) క్షేత్రంలో మహా శివరాత్రి (Maha Shivratri) బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నవాహ్నిక దీక్షతో 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) 21న ముగియనున్నాయి. శనివారం ఉదయం 8:45 గంటలకు ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యాగశాల ప్రవేశ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వేదపండితులు చతుర్వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు. అనంతరం దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆలయ అర్చకులు, వేదపండితులు లోకకళ్యాణ సంకల్పాన్ని పఠించారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేశారు. చండీశ్వరునికి ప్రతేకంగా పూజాధికాలు జరిపారు. కంకణాలకు శాస్ర్తోక్తంగా పూజాధికాలు నిర్వహించి వాటిని అర్చకులు, అధికారులు ధరించారు. అనంతరం రుత్విగ్వరణం నిర్వహించి, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తు హోమం జరిపించారు.
ధ్వజారోహణ
బ్రహ్మోత్సవాల మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకముందు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త వస్త్రంపై పరమశివుడి వాహనమైన నందీశ్వరుడిని చిత్రీకరించి ఆ తరువాత ధ్వజపటానికి చండీశ్వరుని సమక్షంలో ప్రత్యేక పూజాధికాలు, భేరీ పూజ నిర్వహించారు. భేరీ పూజలో డోలు వాయిద్యానికి పూజాధికాలు చేసి తరువాత నాదస్వరంపై రాగాల ఆలాపనతో సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. చివరగా ధ్వజస్తంభంపై ఎగరవేశారు. ధ్వజస్తంభం మీద ఎగిరే ఈ నంది పతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానమని, బ్రహ్మోత్సవాల సమయంలో దేవతలంతా క్షేత్రంలోనే ఉంటూ ఉత్సవాన్ని తిలకిస్తారని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి.
రేపు భృంగి వాహన సేవ
బ్రహ్మోత్సవాల రెండో రోజు నుంచి వాహన సేవలు మొదలవుతాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భృంగి వాహన సేవ నిర్వహిస్తారు.