Share News

శ్రామిక మహిళల జ్ఞాపకాల్లో ‘పోలీస్‌ చర్య’

ABN , First Publish Date - 2023-10-26T01:15:44+05:30 IST

సెప్టెంబర్‌ 17ను ‘ముస్లిం అసఫ్ జాహీ పాలకుల అకృత్యాల’ సంస్మరణ దినంగా 1998లో హిందూ మితవాదులు నిర్వహించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‍లో ఈ తేదీ...

శ్రామిక మహిళల జ్ఞాపకాల్లో ‘పోలీస్‌ చర్య’

సెప్టెంబర్‌ 17ను ‘ముస్లిం అసఫ్ జాహీ పాలకుల అకృత్యాల’ సంస్మరణ దినంగా 1998లో హిందూ మితవాదులు నిర్వహించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‍లో ఈ తేదీ తీవ్ర ఉద్వేగాలను రేపుతోంది. అసఫ్ జాహీ వంశం ఈ ప్రాంతాన్ని 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకూ పాలించింది. చివరి రాజు ఉస్మాన్‌ అలీఖాన్‌. ఈ నేపథ్యంలో ‘పోలీస్‌ చర్య’కు విమోచన అని కాకుండా వేరే అర్థాలు, జ్ఞాపకాలు ఉండే అవకాశాలు ఉండటంతో వాటిని అన్వేషించడానికి నేను 1997–98లో పెద్ద వయసున్న తెలంగాణ మహిళలతో ఇంటర్వ్యూలు నిర్వహించాను. హైదరాబాద్‌ రాజ్యాన్ని ఇండియాలో విలీనం చేయడానికి భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ పోలో’ లేక ‘పోలీస్‌ చర్య’ కాలంలో వారి విభిన్న అనుభవాలను తవ్వితీశాను. ఈ మహిళలందరూ 1920–30ల మధ్య పుట్టినవారే. వీరికి ఏ రాజకీయాలతోనూ, ఉద్యమాలతోనూ సంబంధం లేదు.

సాయుధ పోరాటం తీవ్రంగా సాగిన ప్రాంతాల్లో వరంగల్‌ పట్టణానికి చేరువనున్న ఖిలా వరంగల్‌ ఒకటి. ఇక్కడి మహిళల కథనం ప్రకారం ఆ కాలంలో ఎంత భయానికి గురయినా వారిలో చాలామంది స్వగ్రామాలను వదిలిపోలేదు. వదిలిపోయే వీలులేక. ‘నెత్తురుతాగే రజాకార్లు’ వస్తున్నారని తెలిసి తోటి కూలీలు పారిపోయినా తను మాత్రం కదల్లేదని ఒక మాదిగ వ్యవసాయకూలీ శాంతమ్మ చెప్పింది. పని చేయకపోతే పూట గడవదని చెప్పాననీ, నీ కర్మ అంటూ పోయారనీ చెప్పింది. బతుకుతెరువు అక్కడే ఉండడంతో తమ గ్రామం వదిలి ఎవ్వరూ వెళ్ళలేదని ఈరమ్మ అనే వ్యవసాయ కూలీ చెప్పింది. దగ్గరున్న గుట్టల్లో ఎవరో తుపాకులు పట్టుకు తిరిగేవారని గుర్తుచేసుకుంది. విచిత్రంగా, ఊరు వదిలి వెళ్ళింది ముస్లింలు మాత్రమేనని చెప్పింది. ఎరుకల మహిళ పోశమ్మ ఒక్కతే తమ కుటుంబం మొత్తం అడవిలోకి పారిపోయి తన ఇద్దరు బిడ్డలు పుట్టాక– అంటే రెండు మూడేళ్ళ తర్వాత– మాత్రమే ఊరికి తిరిగి వచ్చామని చెప్పింది. వీధి మోటర్లు, తుపాకుల మోత, బాంబు పేలుళ్ళు వీరిలో చాలామందికి గుర్తున్నాయి గాని హింసను వీరు ప్రత్యక్షంగా అనుభవించ లేదు.

రజాకార్‌ ఉద్యమం 1947 నుంచి 1948 వరకూ చురుగ్గా సాగిన కాలంలో అది ప్రాథమికంగా హైదరాబాద్ పోలీసులకి, సైన్యానికి సహాయకారిగా ఉండేది. భారత కమ్యూనిస్ట్‌ పార్టీ నేతృత్వంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాట కార్యకర్తల పైన, గ్రామస్థుల పైన రజాకార్లు దాడులు చేసి చంపేవారు. భారత సైన్యంతో యుద్ధం వస్తే హైదరాబాద్‌ సైన్యానికి దన్నుగా ఉండటం అన్నది వీరి లక్ష్యం. హైదరాబాద్‌ సైన్యం భారత సైన్యానికి లొంగిపోయిన 1948 సెప్టెంబర్‌ 17వ తేదీనే రజాకార్లు అంతరించారు. ఆ తరువాత కూడా భారతసైన్యం కొన్నేళ్ళు ఇక్కడే ఉండి తెలంగాణ గ్రామాల్లో రైతాంగ కార్యకర్తలను నిర్బంధించడం, అరెస్టు చేయడం, కాల్చి చంపడం చేస్తూ వచ్చింది. తెలంగాణ రైతాంగ పోరాటంతో సంబంధం లేని రైతాంగ మహిళల జ్ఞాపకాల్లో మాత్రం ఈ భయోత్పాత కాలంలో రజాకార్లు, నిజాం పోలీసులు, రైతాంగ ఉద్యమ కార్యకర్తలు, భారత సైనికులు... అంతా ఒకేవిధంగా కలగలసిపోయారు.


మహారాష్ట్ర సరిహద్దులో బోధన్‌ దగ్గర ఒక గ్రామానికి గుంటూరు నుంచి వలస వచ్చిన ఐరావతి అనే మహిళ, ఆ రోజుల్లో మహారాష్ట్ర నుంచి వచ్చి రాత్రిపూట గ్రామాల్లో దోపిడీ చేసే ఇంకెవరి గురించో ప్రస్తావించేది. వీరి నుంచి కాపాడుకోవడం కోసం అనేక గ్రామాల వాళ్ళు ఆరు నెలల పాటు గస్తీ తిరిగారట. వీరికి భయపడి ప్రతి రోజూ వంటలయ్యాక విలువైన వస్తువులను నేలలో కప్పెట్టుకోవడం ఆమెకి గుర్తుంది. వీరు పొరుగూర్లో ఒక ధనిక మహిళని దోచుకుని, దాడిచేసి, చంపేయడాన్ని ఐరావతి గుర్తుచేసుకుంది. రజాకార్లూ, వీళ్ళూ వేర్వేరనీ, రజాకార్లు పగటిపూట వస్తే, వీళ్ళు రాత్రిళ్ళు వచ్చేవారనీ చెప్పింది. వాళ్ళు ముస్లింలు కూడా కారట. రజాకార్లు తక్కువ కులాల నుంచి వచ్చి, నెల జీతం మీద పని చేసి, యూనిఫారాలు వేసుకుని గ్రామాల్లో తిండి పెట్టమని అడుగుతూ తిరిగేవారనీ, అది గ్రామస్తులకు పెద్ద కష్టం కాలేదనీ చెప్పింది. మరి రాత్రుళ్లు గ్రామాలపై దాడులు చేసిన వారు ఎవరు? పదేళ్ళ తర్వాత గాని నాకు సమాధానం దొరకలేదు. వీరెవరో కాదు, హైదరాబాద్‌ రాజ్యం చుట్టుపక్కల క్యాంపులుపెట్టి ఈ రాజ్య విమోచన కోసం గెరిల్లాదాడులు నిర్వహించిన ‘స్వాతంత్ర్య సమర యోధులు’! తటస్థ ఒడంబడిక (Standstill Agreement) అమలులో ఉన్న కాలంలోనే, ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే, నూతన భారత రాజ్య ప్రోద్బలంతో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌ చుట్టుపక్కల క్యాంపులు పెట్టి హైదరాబాద్‌ రాజ్యంలో భయోత్పాతాలు సృష్టించి పరిపాలన వీలుకాని పరిస్థితులు కల్పించడానికి ఎలా ప్రయత్నించారో మనకు ఖండేరావ్‌ కులకర్ణి, పి.ఎ. రామారావు వివరణల ద్వారా తెలుస్తుంది. ఈ వైఫల్యాన్నే 1948లో భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై ప్రకటించిన శ్వేతపత్రంలో ప్రస్తావించి, ఇక్కడ శాంతిభద్రతలు పునరుద్ధరించడానికి ‘పోలీస్‌ చర్య’కు ఉపక్రమించింది.

గ్రామాల్లో జరిగిన ఈ దాడులు మొదలైనంత అకస్మాత్తుగానే ఒక రోజు ఆగిపోయాయని ఐరావతి గుర్తు చేసుకుంది. ఆ రోజు గ్రామాలంతటా రజాకార్ల యూనిఫారాలూ, కత్తులూ, తుపాకులూ కుప్పలుతెప్పలుగా పడి ఉండటాన్ని వారు గమనించారు. సైన్యం అనేకమంది ముస్లింలను వరుసగా నిలబెట్టి వాళ్ళు చేసిన అకృత్యాలకు శిక్షగా కొట్టించింది. కొద్దిరోజుల్లోనే నాందేడ్‌ నుంచి ముస్లింలు వెల్లువలా పారిపోయి వచ్చి చిన్న చిన్న వృత్తుల్లోనూ, చిరుద్యోగాల్లోనూ స్థిరపడిపోయారు. ముస్లింలలో చాలామంది పెద్దలూ, పిల్లలూ కుటుంబాలను కోల్పోయారు.

ఖిలా వరంగల్‌ మహిళలు నేను కొంచెం ప్రోత్సహిస్తే గాని ‘పోలీస్‌ చర్య’ గురించి మాట్లాడలేదు. కానీ హైదరాబాద్‌ పాతబస్తీ మహిళలతో ఆ అవసరం లేకపోయింది. అడిగిందే తడవుగా వారు తమ కుటుంబాలు పడిన పాట్ల గురించి చెప్పటం మొదలుపెట్టారు. నేను మాట్లాడిన పదిమందిలో ఐదుగురు బీదర్‌ జిల్లాలోని కల్యాణ్‌ నుంచి, వలస కూడా కాదు, పారిపోయి వచ్చారు. వాళ్ళ జీవితాల్ని అగాధంలోకి తోసివేసిన అత్యంత భయానక విపత్తు పోలీస్‌ చర్యే.

ముస్లిం పురుషులను పొలాల నుంచి ఈడ్చుకొచ్చి చంపిన హత్యాకాండ గురించి ఆయేషా బీ వర్ణించింది. ఆమె తన భర్తనీ, అతని సోదరుడినీ, మామనూ పోగొట్టుకుంది. వాళ్ళ ఇంటిని, ఆస్తిని, మామిడి చెట్లతో సహా లాక్కున్నారు. ఆయేషా బీ తప్పించుకొని నగరానికి వచ్చి బహదూర్‌యార్‌ దేవిడీలో తలదాచుకుని తరవాత బీడీ కార్మికురాలిగా పని సంపాదించింది. దర్జీ కుటుంబం నుంచి వచ్చిన అమీనా బీ కథ ఇలాంటిదే. ఆమె మామ సోదరుడిని జొన్న పొలాల నుంచి ఈడ్చుకుపోయారు. మళ్ళీ అతను కనిపించలేదు. ఆమె కుటుంబం కూడా నగరానికి తప్పించుకుని వచ్చేసింది. ఈ దమనకాండలో జరీనా బేగం చాలామంది బంధువులను పోగొట్టుకుంది. ఆమె పారిపోయి వచ్చిన కొన్ని నెలల తర్వాత గాని భర్తను కలుసుకోలేదు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన చాంద్‌ బీ కూడా తన కుటుంబంలో చాలామంది మగవాళ్ళను పోగొట్టుకున్నాక నగరానికి పారిపోయి వచ్చింది.


రెండు సామాజిక వర్గాలు పరస్పరం ఢీకొనే అల్లర్ల పరిస్థితిలా కాకుండా వారు దీన్ని హిందువులు నిష్కారణంగా ఏకపక్షంగా చేసిన దాడిలానే చర్చించారు. వారి మీద దాడి చేసిన వాళ్ళు హిందువులనే తప్ప వారు ఎవరో, ఈ దాడుల వెనుక ఉద్దేశమేమిటో పోల్చుకోలేకపోయారు. ‘‘ఎవరు చేశారో తెలీదు. ఎందుకు చేశారో తెలీదు. వేరే ఊళ్ళ నుంచి వచ్చారు వాళ్ళు’’ అని మాత్రమే చెప్పగలిగారు ఈ మహిళలు. కుటుంబాల్లో జరిగిన పెళ్ళిళ్ళూ, పుట్టుకల వంటి వ్యక్తిగత సంఘటనలతోనే వారి జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి గాని రాజకీయ సంఘటనలతో కాదు. కానీ, భారత సైన్యం రావడానికీ, వారు అనుభవించిన విధ్వంసానికీ మధ్య బలమైన సంబంధం మాత్రం వారి మాటల్లో వినిపించింది.

ఆ కాలంలో చెలరేగిన గందరగోళం వెనుక సూత్రధారులు అనేకమంది: హైదరాబాద్‌ రాజ్యాన్నీ అక్కడి భూస్వాముల్నీ పరిరక్షించడానికి పోరాడిన రజాకార్లు, ముస్లిం రాజు కబంధ హస్తాల నుంచి హైదరాబాద్‌ రాజ్యాన్ని విముక్తం చేయడానికి సరిహద్దుల్లో సాయుధంగా పోరాడిన ‘భారత స్వాతంత్ర్య సమరయోధులు’, పోలీస్‌ చర్య జరగ్గానే ముస్లింలపై హింసాకాండతో హిందూ ప్రాబల్యాన్ని నెలకొల్పడానికి కొత్తగా వచ్చిన స్వేచ్ఛని వాడుకున్న పాశవిక దుండగులు.

ఈ సామాన్య మహిళలకు ‘పోలీస్‌ చర్య’ ఒక భయానకమైన, బాధాకరమైన విపత్తు. సెప్టెంబర్‌ 17ను సంబరంగా జరుపుకోవడం ఒక్క ఐరావతికి తప్ప మిగిలిన మహిళలు ఎవ్వరికీ గుర్తు లేదు. వాళ్ళ కథనాల్లో విముక్తి, స్వాతంత్ర్యం అనే మాటలు అసలు వినిపించవు. ఖిలా వరంగల్‌ మహిళలకు పోలీస్‌ చర్య రోజులు సుదీర్ఘంగా, బాధాకరంగా సాగినట్టు గుర్తున్నాయి. కానీ బీదర్‌ మహిళలకు మాత్రం పోలీస్‌ చర్య వారి జీవితాల్ని బాధల్లోకీ, కటిక పేదరికంలోకీ నెట్టివేసిన దుర్ఘటన. అర్థంకాని నిర్హేతుక హింసగా పోలీస్‌ చర్యను అనుభవించి, పంచుకున్న ముస్లిం మహిళల జ్ఞాపకాలు ఇదే వాస్తవాన్ని ధ్రువీకరిస్తాయి.

ఎ. సునీత

Updated Date - 2023-10-26T01:15:44+05:30 IST