Exam special: నిరుద్యోగం, పేదరికం నిర్మూలన గురించి సవివరంగా...
ABN , First Publish Date - 2023-03-24T16:58:52+05:30 IST
పనిచేయడానికి ఆసక్తి, పనిచేయగల శక్తి ఉండి ప్రతిఫలంతో కూడిన పని దొరకని స్థితిని నిరుద్యోగం అంటారు. అయితే లక్షణాలను బట్టి నిరుద్యోగ భావనలు
పనిచేయడానికి ఆసక్తి, పనిచేయగల శక్తి ఉండి ప్రతిఫలంతో కూడిన పని దొరకని స్థితిని నిరుద్యోగం అంటారు. అయితే లక్షణాలను బట్టి నిరుద్యోగ భావనలు వేర్వేరుగా ఉంటాయి. అవి..
వ్యవస్థాపూర్వక నిరుద్యోగం: జనాభాలో శ్రామికశక్తి పెరుగుతున్న రేటుకు అనుగుణంగా వ్యవస్థలో అవకాశాలు సృష్టించనందున సంభవించే నిరుద్యోగం. అంటే ఆర్థికవ్యవస్థ అనుకున్నంతగా విస్తరించకపోవడం వల్ల ఈ వ్యవస్థాపూర్వక నిరుద్యోగం సంభవిస్తుంది.
ప్రచ్ఛన్న నిరుద్యోగం: ఉత్పత్తి ప్రక్రియలో అవసరానికి మించి పనిచేయడాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. ఉత్పత్తి ప్రక్రియ నుంచి కొద్దిమంది ఉద్యోగులను తొలగించినా ఉత్పత్తి మొత్తంలో మార్పురాదు. అంటే కొందరి ఉద్యోగుల ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది. వీరినే ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. ‘ఉద్యోగులుగా కనిపించే నిరుద్యోగులు’ అని అర్థం. వీరు నిరుద్యోగులుగా కనిపించరు కాని నిరుద్యోగులే.
రుతు సంబంధిత నిరుద్యోగం: కొన్ని రుతువుల్లో పని దొరికి, మరికొన్ని రుతువుల్లో ఉపాధి లభించని వారిని రుతు సంబంధిత నిరుద్యోగులు అంటారు. నీటిపారుదల సౌకర్యం లేని ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు కొన్ని రుతువుల్లో నిరుద్యోగులుగా ఉంటారు.
చక్రీయ నిరుద్యోగం: ఆర్థిక వ్యవస్థలో సంభవించే వ్యాపార చక్రాల దశల్లోని ఆర్థికమాంద్య దశలో ఏర్పడే నిరుద్యోగాన్ని చక్రీయ నిరుద్యోగం అంటారు. వ్యాపార చక్రాల్లో రికవరీ దశ, భూమ్ దశ తరవాత ఆర్థికమాంద్యం దశ ఆరంభమవుతుంది. అది తీవ్ర మాంద్యంగా మారి తిరిగి రికవరీ దశ ఆరంభమవుతుంది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి దేశాల్లో ఈ రకం నిరుద్యోగం ఉంటుంది.
సంఘృష్ట నిరుద్యోగం: ఒక రంగంలో ఉద్యోగం కోల్పోయినవారు వేరే రంగంలో ఉన్న ఉద్యోగావకాశాల సమాచారం లేక తాత్కాలికంగా నిరుద్యోగులుగా ఉండటాన్ని సంఘృష్ట నిరుద్యోగం అంటారు. పై నిరుద్యోగ రకాల్లో మొదటి మూడు శాశ్వత స్వభావానికి తోడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటాయి. చివరి రెండూ తాత్కాలిక స్వభావానికి తోడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటాయి.
అల్ప ఉద్యోగిత: తన సామర్థ్యానికి అనుగుణంగా వేతనంతో కూడిన పనిదొరకని స్థితిని అల్ప ఉద్యోగిత అంటారు. ప్రోగ్రామ్ రూపొందించగల సాఫ్ట్‌వేర్ ఇంజనీరు - డేటా పొందుపరిచే కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడాన్ని అల్ప ఉద్యోగితకు ఉదాహరణగా చెప్పవచ్చు.
బహిరంగ నిరుద్యోగం: ప్రచ్ఛన్న నిరుద్యోగులు కాని వారందరూ బహిరంగ నిరుద్యోగులని చెప్పవచ్చు. అంటే మొదట చెప్పినవిధంగా పనిచేయగల ఆసక్తి ఉండి, సామర్థ్యం ఉండి ప్రతిఫలంతో కూడిన పని దొరకని స్థితిని బహిరంగ నిరుద్యోగం అంటాం.
చదువుకున్న వారిలో నిరుద్యోగం: ఎనిమిదో తరగతి ఆపై తరగతులు పాసైన వారిలో ఉండే నిరుద్యోగాన్ని విద్యావంతుల్లో నిరుద్యోగం అంటారు.
సాంకేతిక నిరుద్యోగం: సాంకేతిక పరిజ్ఞానం కారణంగా అప్పటివరకు సంప్రదాయరంగంలో పనిచేసేవారు ఉద్యోగం కోల్పోవడాన్ని సాంకేతిక నిరుద్యోగం అంటారు.
అనుద్యోగిత: గృహరంగంలో ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తున్న స్త్రీలను అనుద్యోగిత అంటారు. అసంఘటిత రంగంలో కనీస వేతనాల కంటే తక్కువకు పనిచేసే స్థితిని కూడా అనుద్యోగిత అంటారు.
స్వచ్ఛంద నిరుద్యోగం: అమలులో ఉన్న వేతనం లేదా ఉపాధి స్వభావం నచ్చక నిరుద్యోగులుగా ఉండటానికి ఇష్టపడటాన్ని స్వచ్ఛంద నిరుద్యోగం అంటారు.
భారతదేశంలో నిరుద్యోగం, పేదరికం నిర్మూలన
అర్హులైన అందరికి ఉపాధి అవకాశాలు కల్పించడం, పేదరికాన్ని నిర్మూలించడం, తీవ్రమైన ఆదాయ అసమానతలు లేకుండా చూడటమనేది భారత అభివృద్ధి ప్రక్రియలో భాగంగానే ఉన్నాయి. అయితే సందర్భాన్ని బట్టి వ్యూహం లేదా నమూనా మారుతూ వచ్చింది.
స్వాతంత్ర్యానంతరం అధిక ఆర్థిక వృద్ధిని సాధించడం ద్వారా అర్హులైన అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించి నిరుద్యోగాన్ని, పేదరికాన్ని నిర్మూలించాలనే వ్యూహాన్ని అనుసరించారు. అంటే ‘అధిక వృద్ధి కోసం జరిగే పెట్టుబడుల వల్ల ఉత్పత్తి ప్రక్రియలో ఉద్యోగావకాశాలు పెరగడం, ఉద్యోగిత అధికం కావడంతో ఆదాయం పెరిగి పేదరికం తగ్గడం’ జరుగుతుందని భావించారు. దీనినే ‘ట్రికిల్ డౌన్ ప్రభావం’ అన్నారు. ఈ ప్రక్రియలో దాదాపు రెండు దశాబ్దాలు గడిచాయి. ఈ రెండు దశాబ్దాల్లో వృద్ధి కొంతవరకు నమోదైనా నిరుద్యోగం పోలేదు, పేదరికం తగ్గలేదు. ఫలితంగా ఈ ‘ట్రికిల్ డౌన్ వ్యూహం’ విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ఆ తదనంతర చర్చలో వృద్ధి వ్యూహం మాత్రమే సరిపోదు. నిరుద్యోగ, పేదరిక నిర్మూలనకు ప్రత్యేక వ్యూహం అవసరమనే వాదన ముందు వచ్చింది. ఫలితంగా నిరుద్యోగం, పేదరికాల నిర్మూలనకు ప్రత్యేక పథకాల అమలు ఆరంభమైంది.
దీనిలో రెండు రకాల పథకాలు అమలు చేశారు.
1) వేతన ఉద్యోగిత పథకాలు
2) స్వయం ఉపాధి పథకాలు
జూ వేతన ఉపాధి పథకాలంటే ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఉపాధి కల్పించి వేతనం ఇస్తుంది. వేతనాన్ని కొన్నిసార్లు ఆహారం రూపంలో కూడా ఇచ్చారు. అప్పుడు దానిని పనికి ఆహార పథకం అన్నారు. కొన్నిసార్లు కొంత ఆహారం - కొంత ద్రవ్య వేతనం ఇచ్చారు. కొన్నిసార్లు పూర్తి ద్రవ్య వేతనం ఇచ్చారు. ఈ కోవలో అనేక పథకాలు వివిధ రూపాల్లో అమలు జరిగాయి. ప్రజా పనుల కార్యక్రమం(1971), పనికి ఆహార
పథకం(1977), జాతీయ గ్రామీణ ఉపాధి పథ కం(19980), భూమిలేని గ్రామీణులకు ఉపాధి పథకం(1983), జవహర్ రోజ్‌గార్ యోజన(1989), ఉపాధిహామీ పథకం(1993), జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన(1999), సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన(2001), జాతీయ పనికి ఆహార పథకం(2004), మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(2005), ఈ చట్టం కింద అమల్లోకి వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(2006), పట్టణాల్లో వేతన, స్వయంఉపాధి కోసం ఆరంభించిన స్వర్ణజయంతి షహరీ రోజ్‌గార్ యోజన(1997), గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ లాంటివన్నీ వేతన ఉపాధి పథకాలే.
స్వయం ఉపాధి: సొంతగా ఉపాధి పొందడానికి ప్రభుత్వం ఆరంభించినవే స్వయంఉపాధి పథకాలు. కొన్నిసార్లు ఉపాధికి అవసరమైన శిక్షణను, సబ్సిడీతో కూడిన రుణాన్ని అందించి యువత స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం సహకరిస్తుంది.
చిన్న రైతుల అభివృద్ధి కార్యక్రమం, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీల అభివృద్ధి కార్యక్రమం(1972-73), సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం(1978, 1980), స్వయంఉపాధికై గ్రామీణ యువతకు శిక్షణ కార్యక్రమం(1979), గ్రామీణ ప్రాంత మహిళలు, శిశువుల అభివృద్ధి పథకం(1982), స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన(1999), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(2011), చదువుకున్న నిరుద్యోగుల ఉపాధి కోసం ఆరంభమైన ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన(1993), ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(2008), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ - అజీవక(2013), దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(2015), జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్(2013), దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్(2015), స్టార్ట్-అప్ ఇండియా పథకం(2016), స్టాండ్-అప్ ఇండియా(2016), ప్రధానమంత్రి కుషాల్ వికాస్ యోజన(2016), ప్రధానమంత్రి ముద్ర యోజన(2015) లాంటివన్నీ స్వయంఉపాధి కోసం చేయూతనివ్వడానికి ఆరంభించిన పథకాలే.
మానవాభివృద్ధి వ్యూహం: 1990వ దశకం నుంచి నిరుద్యోగం, పేదరిక నిర్మూలనకు మానవాభివృద్ధి వ్యూహాన్ని కూడా స్వీకరించారు. పేదరికంలో ఉన్న ప్రజలకు మంచి ఆర్యోగం, విద్య, శిక్షణను అందిస్తే ప్రపంచంలో వచ్చే అవకాశాలను వారు చేజిక్కించుకొని ఉపాధి పొంది, పేదరికం నుంచి బయటపడతారనే వ్యూహంతో ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక కాలంలో దీనిపై ప్రత్యేకదృష్టి పెట్టారు.
సమ్మిళిత వృద్ధి వ్యూహం: అన్ని రంగాల్లో వృద్ధిని సాధించడం, అన్నివర్గాల వారిని వృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం, వారందరికి వృద్ధి ఫలాలు అందేలా చూడటం కోసం సమ్మిళిత వృద్ధి వ్యూహాన్ని అనుసరించారు. ఇందుకోసం అన్ని వర్గాలకు అన్నిరకాల, అన్ని స్థాయుల్లో విద్యను అందుబాటులో ఉంచడం, ద్రవ్య సమ్మిళితాలను సాధనాలుగా భావించారు. ద్రవ్య సమ్మిళితం కోసం అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు ద్రవ్య సేవలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2011లో ప్రధానమంత్రి జనధన్ యోజనను ద్రవ్య సమ్మిళితం లక్ష్యంగానే ఆరంభించారు.
పైవిధంగా వృద్ధి వ్యూహం, ఉపాధి పథకాల వ్యూహం, మానవాభివృద్ధి వ్యూహం, సమ్మిళిత వృద్ధి వ్యూహం, ద్రవ్య సమ్మిళిత వ్యూహాలను - ఉపాధి కల్పించడానికి తద్వారా పేదరిక నిర్మూలనకు అమలుపరిచారు.
ప్రత్యేకించి పేదరిక నిర్మూలన కోసం పేదవారికి నివాస గృహాల నిర్మాణం, ఇతర కనీస సౌకర్యాల కల్పన, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, భూ సంస్కరణల అమలు, ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను తక్కువ ధరకు సరఫరా చేయడంలాంటి పథకాలు కూడా అమలుపరిచారు.(పరుస్తున్నారు)
మొత్తమ్మీద స్వతంత్ర భారతదేశంలో హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాం, పారిశ్రామికరంగంలో భారీ పరిశ్రమలకు పునాది వేసుకున్నాం, సమాచార సాంకేతిక విప్లవ ప్రభావంతో సేవారంగాన్ని విస్తరించుకున్నాం. కానీ నిరుద్యోగం, పేదరిక నిర్మూలన మాత్రం దేశంలో అతిపెద్ద సవాలుగా మిగిలే ఉంది. అందుకు నిరుద్యోగ, పేదరిక నిర్మూలన వ్యూహాల రూపకల్పనలో ఉన్న లోపం, వ్యూహాల అమలులోని తటపటాయింపు, ప్రయోజకుల ఉదాసీన వైఖరి వంటి అనేక కారణాలను మనం చూపించవచ్చు.
అధిక వృద్ధి కోసం జరిగే పెట్టుబడుల వల్ల ఉత్పత్తి ప్రక్రియలో ఉద్యోగావకాశాలు పెరగడం, ఉద్యోగిత అధికం కావడంతో ఆదాయం పెరిగి పేదరికం తగ్గడం జరుగుతుంది. దీనినే ‘ట్రికిల్ డౌన్ ప్రభావం’ అంటారు.
అన్ని రంగాల్లో వృద్ధిని సాధించడం, అన్నివర్గాల వారిని వృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం, వారందరికి వృద్ధి ఫలాలు అందేలా చూడటమే సమ్మిళిత వృద్ధి వ్యూహాం.
డా.ఎం.ఏ.మాలిక్,
అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కూకట్‌పల్లి, హైదరాబాద్.