Share News

Diksuchi : తెలంగాణ అవస్థాపన సౌకర్యాలు సమాచార వ్యవస్థ

ABN , Publish Date - Aug 05 , 2024 | 05:14 AM

ఆధునిక సమాచార వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేయడమనేది డిజిటల్‌ వ్యవస్థపై ప్రధానంగా ఆధారపడి ఉంది. డిజిటల్‌ సమాచారం, డిజిటల్‌ కంప్యూటింగ్‌, డేటాను నిల్వ చేసే వ్యవస్థలు ఇందులో భాగం.

Diksuchi : తెలంగాణ అవస్థాపన సౌకర్యాలు సమాచార వ్యవస్థ

ఎకానమీ

దేశంలోని ఇతర ప్రాంతాలతో, మిగతా ప్రపంచంతో మమేకం చేసే సాధనం సమాచార వ్యవస్థ. ఇందులో ఆధునిక డిజిటల్‌ వ్యవస్థ, ప్రసార సాధనాలు, ప్రచురిత సాధనాలు, టెలి కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఉన్నాయి. ఇంటర్నెట్‌, టెలిఫోన్లు, దూరదర్శన్‌, కేబుల్‌ టెలివిజన్‌, రేడియో, వార్తా దిన పత్రికలు, వార, మాసపత్రికలు మొదలైనవి ముఖ్య సమాచార సాధనాలు.

డిజిటల్‌ సమాచార వ్యవస్థ

ఆధునిక సమాచార వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేయడమనేది డిజిటల్‌ వ్యవస్థపై ప్రధానంగా ఆధారపడి ఉంది. డిజిటల్‌ సమాచారం, డిజిటల్‌ కంప్యూటింగ్‌, డేటాను నిల్వ చేసే వ్యవస్థలు ఇందులో భాగం.

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్‌ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా వికారాబాద్‌ జిల్లాలోని పూడూరు గ్రామం దగ్గర గల దోమగుండం రిజర్వు ఫారె్‌స్టలోని 1174 హెక్టార్లను భారతదేశంలోనే రెండో స్థానపు వెరీ లో ఫ్రీక్వెన్సీ(వీఎల్‌ఎఫ్‌) రాడార్‌స్టేషన్‌ను నెలకొల్పడానికి భారత నౌకాదళానికి ఇచ్చింది.


డిజిటల్‌ తెలంగాణ

డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని ప్రతి పౌరునికి డిజిటల్‌ సమాచార వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ‘డిజిటల్‌ తెలంగాణ’ను ఆరంభించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ద్వారా డిజిటల్‌ సేవలను, రాష్ట్రమంతా 4జీ సేవలు, నగరాలు, పట్టణాల్లో వైఫై సేవలు అందించడంతోపాటు ఈ-పంచాయితీ పథకం కింద ప్రతి పంచాయితీలో కేంద్రీకృత కియో్‌స్కని ఏర్పాటుచేస్తారు. ఇక డిజిటల్‌ సమాచార వ్యవస్థ డిమాండ్‌ వైపునుంచి ప్రతి ఇంటికి డిజిటల్‌ ప్రాథమిక పరిజ్ఞానం కల్పించడం, ప్రతి పాఠశాలకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించే కార్యక్రమం, మీసేవా కార్యకలాపాల విస్తరణ, ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సేవలకు సాంకేతిక పరిష్కార వ్యవస్థ మొదలైనవి అమలు చేస్తారు.

డిజిటల్‌ పరిజ్ఞానాన్ని అందించడం కోసం రాష్ట్రం మొత్తంలో 13,352 సాధారణ సేవా కేంద్రాలు(కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లు) పనిచేస్తున్నాయి. అందులో 8,997 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

ఈ ఏడాది దావో్‌సలో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ వార్షిక సమావేశంలో రాష్ట్రంలోని శిష్ట్ర గ్రూపుతో రాష్ట్ర ఐ.టీ, ఐ.టీ. సేవలశాఖ వెయ్యిమంది సభ్యులతో కూడిన ఆధునిక డిజిటల్‌ డివైజ్‌, నిర్మాణం ప్రాజెక్టును హైదరాబాద్‌లో నెలకొల్పే అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కేంద్రం తెలంగాణ డిజిటల్‌ ప్రణాళికా కేంద్రంగా ఉండబోతుంది.

కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌)కు సంబంధించిన మూడు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణను కృత్రిమ మేధ కేంద్రంగా మలిచే విధంగా డిజిటల్‌ తెలంగాణ ప్రాజెక్టును విస్తరించింది.


సాగు బాగు 2.0

కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సుస్థిర, సమర్థవంతమైన వ్యవసాయ పరిస్థితులను సృష్టించడం కోసం ‘సాగు బాగు 2.0’ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నారు. ఇందుకోసం వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన సంస్థల(అగ్రిటెక్‌)తో 2014 ఫిబ్రవరిలో చర్చలు కూడా జరిపారు.


డ్రోన్‌ వ్యవస్థ

తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ డ్రోన్‌ సిటీ’(టీడీసీ) పేరుతో డ్రోన్‌ సాంకేతికతను ప్రోత్సహించనుంది. దీనితో భారతదేశ ప్రధానమైన ‘మనుషులు లేని వాయు వాహనం’ పరీక్షా కేంద్రంగా ఈ డ్రోన్‌ కేంద్రం మారబోతుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని అయిదు లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సేవలందిస్తూ గ్రామీణ ఉద్యమిత్వాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్స్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌, మారుట్‌ డ్రోన్‌ డ్రోన్‌ సేవలు అందించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.


రాష్ట్రంలో టెలిఫోన్‌ సేవలు

2022 నవంబరు నాటికి రాష్ట్రంలో 4.08 కోట్ల టెలిఫోన్‌ ఖాతాలున్నాయి. అందులో 98 శాతం వైర్‌లెస్‌ ఖాతాలు. పట్టణాల్లో ఉన్న 2.28 కోట్ల ఖాతాల్లో 96 శాతం వైర్‌లెస్‌ ఖాతాలు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 1.70 కోట్లు(99.8 శాతం) వైర్‌లెస్‌ ఖాతాలు ఉన్నాయి.


టెలిఫోన్‌ సాంద్రత

2022 నవంబరు నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో టెలిఫోన్‌ సాంద్రతలో తెలంగాణ 105 టెలీ సాంద్రతతో ద్వితీయస్థానంలో ఉంది. కాగా దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాల్లో కేరళ 120 టెలీ సాంద్రతతో మొదటిస్థానంలో ఉంది. ఇక మొత్తం రాష్ట్రాలను తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం తొమ్మిదోస్థానంలో ఉంది. 139 టెలీ సాంద్రతతో సిక్కిం మొదటిస్థానంలో ఉండగా, 53 టెలీ సాంద్రతతో బిహార్‌ చివరిస్థానంలో ఉంది. కాగా మొత్తం ఇండియా టెలీ సాంద్రత 83. ప్రతి వంద మందికి గల టెలిఫోన్‌ ఖాతాల సంఖ్యను టెలీ సాంద్రత అంటారు.


రేడియో స్టేషన్లు

2022 సంవత్సరం చివరి నాటికి రాష్ట్రంలో 15 ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్లు ఉండగా అందులో 12 ఎఫ్‌ఎం, రెండు ఎండబ్ల్యూ, ఒక ఎస్‌డబ్ల్యూలు ఉన్నాయి. తెలంగాణలో ప్రైవేటు రంగంలో 11 రేడియో స్టేషన్లు ఉన్నాయి. అందులో హైదరాబాద్‌ కేంద్రంగా 8, వరంగల్‌ కేంద్రంగా 3 నడుస్తున్నాయి.


పత్రికలు

రాష్ట్రంలో 2022 సంవత్సరం చివరి నాటికి 1354 దిన, వార, మాస, ఇతర పత్రికలు రిజిస్టర్‌ అయి ఉన్నాయి. రాష్ట్రంలో రిజిస్టరైన పత్రికల్లో 60 శాతం తెలుగు, 18.4 శాతం ఉర్దూ, 13.6 శాతం ఆంగ్లభాషలో వెలువడుతున్నాయి.

తపాల సేవలు

అందరికీ సౌకర్యవంతమైన సమాచార సేవలనందించేది తపాల వ్యవస్థ. ఇండియా పోస్ట్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో 2021 ఆగస్టు 31 నాటికి 36 హెడ్‌ పోస్టాఫీసులు, 789 సబ్‌ పోస్టాఫీసులు, 5,388 తపాలశాఖ కార్యాలయాలు, 27,031 లెటర్‌ బాక్స్‌లు ఉన్నాయి. ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలో తపాల కార్యాలయాలు సమాచార సేవలతోపాటు పొదుపు, పాస్‌పోర్ట్‌, ఆధార్‌, స్టాంప్‌ల పంపిణీ సంబంధిత సేవలను కూడా అందిస్తున్నాయి.

డా.ఎం.ఏ.మాలిక్‌

అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కూకట్‌పల్లి, హైదరాబాద్‌.

Updated Date - Aug 05 , 2024 | 05:22 AM