Airport: ఆ ఆందోళనకు ఏడాది పూర్తి..
ABN , First Publish Date - 2023-07-26T07:56:21+05:30 IST
4,790 ఎకరాల్లో రూ.20 వేల కోట్లతో కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్(Sriperumbudur) సమీపంలో నిర్మింపదలచిన విమానాశ్రయానికి(Airport) వ్యతిరేకం

- టీటీవీ దినకరన్ మద్దతు
ప్యారీస్(చెన్నై): 4,790 ఎకరాల్లో రూ.20 వేల కోట్లతో కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్(Sriperumbudur) సమీపంలో నిర్మింపదలచిన విమానాశ్రయానికి(Airport) వ్యతిరేకంగా 13 గ్రామాల ప్రజలు చేపడుతున్న ఆందోళన మంగళవారానికి ఏడాది పూర్తయింది. పరందూర్, ఏకనాపురం తదితర 13 గ్రామాలకు చెందిన 35 మంది భూముల సమీకరణతో చేపట్టనున్న ఈ విమానాశ్రయ నిర్మాణం పట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తమ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తమ పంటపొలాలు లేకుండాపోతాయని, తాము రోడ్డున పడతామంటూ ఆందోళనకారులు నిరసన తెలుపుతున్నారు. వారికెలాంటి ఇబ్బంది లేకుండా భారీ పరిహారం ఇస్తామని ప్రభుత్వం నచ్చజెబుతున్నా కొంతమంది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏకనాపురంలో చేపడుతున్న ఈ ఆందోళన మంగళవారం నాటికి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ధర్నా జరుగుతున్న ప్రాంతానికి వచ్చి నిరసనకారులకు మద్దతు తెలిపారు. పరందూర్ విమానాశ్రయం(Parandur Airport) నిర్మితమైతే కలిగే నష్టాల గురించి ఆయన గ్రామస్తుల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సుమారు 30 గ్రామాల ప్రజలు అభ్యంతరం తెలుపుతున్న పరందూర్ విమానాశ్రయ నిర్మాణ పథకాన్ని అమలు చేయరాదని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్చించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.