Holi Hostage: హోలీకి పర్మిషన్ ఇవ్వలేదని 150 మంది కాలేజీ సిబ్బంది నిర్బంధం
ABN , Publish Date - Feb 28 , 2025 | 06:19 PM
విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంపై జిల్లా యంత్రాగం విచారణ జరిపి, నలుగురు విద్యార్థి నాయకులను ఘటనకు బాధ్యులుగా గుర్తించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. ఆ నలుగురుని కళాశాల నుంచి బహిష్కరిస్తూ, వారిని టీసీలు తీసుకోవాలని ఆదేశించినట్టు వివరించారు.

ఇండోర్: హోలీ పండుగ నిర్వహించుకునేందుకు అనుమతి నిరాకరించడంతో 150 మంది కాలేజీ సిబ్బందిని విద్యార్థులు నిర్బంధంలోకి తీసుకున్న ఘటన సంచలనమైంది. విద్యార్థుల అనుచిత ప్రవర్తనపై కళాశాల యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. నలుగురు విద్యార్థి నేతలను కళాశాల నుంచి బహిష్కరించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఉన్న ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
BJP New Chief: మార్చి 15 కల్లా బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఎవరంటే?
సంఘటన వివరాల ప్రకారం, కాలేజీ విద్యార్థులు మార్చి 7వ తేదీన 'హోలీ ఫెస్టివల్' నిర్వహించాలని ప్లాన్ చేశారు. డీజే, రెయిన్ డాన్స్ వంటి కార్యక్రమాలు అందులో చేర్చారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సెంటర్‌ను కో-స్పాన్సరర్‌గా తీసుకున్నారు. రూ.150 ప్రవేశ రుసుముగా నిర్ణయించారు. అయితే కాలేజీ యాజమాన్యం ఈ ఈవెంట్ నిర్వహణకు అనుమతి నిరాకరించింది. ఆ విషయాన్ని విద్యార్థులు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈవెంట్‌కు సంబంధించిన పోస్టర్లను ఫిబ్రవరి 23న క్యాంపస్‌లో అతికించారు. ఈ క్రమంలోనే కాలేజీ ప్రిన్సిపల్ ఆదేశాలతో పోస్టర్లను తొలగించడంతో విద్యార్థులు ఫిబ్రవరి 24న నిరసనలకు దిగారు. కాలేజీలోని యశ్వంత్ హాల్ తలుపును బయట నుంచి మూసేశారు. విద్యుత్ సరఫరాను కూడా నిలిపేశారు. కళాశాలకు సంబంధించిన సుమారు 150 మంది సిబ్బంది హాలులో సమావేశం జరుపుతుండగా విద్యార్థులు ఈ చర్యలకు పాల్పడ్డారు. సమావేశానికి హాజరైన వారిలో పలువురు మహిళా ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. కళాశాల యాజమాన్యంపై తీవ్ర వ్యాఖ్యలు, నినాదాలతో విద్యార్థులు ఆందోళనకు దిగడంతో సుమారు 30 నిమిషాల పాటు కాన్ఫరెన్స్ హాలులోనే వీరంతా నిర్బంధంలో ఉండిపోయారు.
కాలేజీ నుంచి బహిష్కరణ
విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంపై జిల్లా యంత్రాగం విచారణ జరిపి, నలుగురు విద్యార్థి నాయకులను ఘటనకు బాధ్యులుగా గుర్తించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నివేదకలో సిఫారసు చేయడంతో ఆ నలుగురుని కళాశాల నుంచి బహిష్కరిస్తూ, వారిని టీసీలు తీసుకోవాలని ఆదేశించినట్టు వివరించారు. 1981లో ఇండోర్‌ను ఏలిన హోల్కర్ పాలకులు ఈ కాలేజీని స్థాపించారు. ఎందరో ఉత్తమ సైన్స్ విద్యార్థులను అదించిన ఘనత ఈ కాలేజికి ఉంది.
ఇవి కూడా చదవండి
Boat Fire Accident : మంటల్లో చిక్కుకున్న ఫిషింగ్ బోటు.. 20 మంది మత్స్యకారులు..
Mamata Banerjee: నకిలీ ఓటర్లతో ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు
Ministerial orders: పార్సిళ్లకు ప్లాస్టిక్ వద్దు.. ఇడ్లీ తయారీలోనూ గుడ్డలు మాత్రమే వాడాలి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.