BJP New Chief: మార్చి 15 కల్లా బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఎవరంటే?
ABN , Publish Date - Feb 28 , 2025 | 05:17 PM
బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించడానికి ముందు సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఆ ప్రకారం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం మరో 6 రాష్ట్రాల్లో యూనిట్ చీఫ్‌లను ఎన్నుకునేందుకు కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు.

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) వారసుని ఎన్నికపై కసరత్తు జరుగుతోంది. నూతన సారథి పేరును మార్చి 15వ తేదీలోగా పార్టీ అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ సంస్థాగత ఎన్నికలు 12 రాష్ట్రాల్లో పూర్తికాగా, మరో 6 రాష్ట్రాల్లో పార్టీ విభాగం చీఫ్‌లను ఎన్నుకోవాల్సి ఉంది.
Siddaramaiah: సిద్ధరామయ్యకూ 'శీష్ మహల్' సెగలు
బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించడానికి ముందు సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఆ ప్రకారం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం మరో 6 రాష్ట్రాల్లో యూనిట్ చీఫ్‌లను ఎన్నుకునేందుకు కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికలను పార్టీ చేపట్టినట్టు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగాల్సి ఉండటంతో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని చెబుతున్నారు.
కాగా, పార్టీ జాతీయ అధ్యక్షుడి పేరును సూచించాల్సిందిగా ఆయా రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లను అధిష్ఠానం ఇప్పటికే కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నందున పార్టీ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందనే విషయం చివరివరకూ ఉత్కంఠగా ఉండవచ్చని చెబుతున్నారు. కొత్త నాయకుడికి ఇటు పార్టీతోనూ, ఆర్ఎస్ఎస్‌తోనూ సత్సంబంధాలు ఉండటంతో పాటు కుల ప్రాతినిధ్యం, రీజనల్ డైనమిక్స్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా 2019లో పగ్గాలు చేపట్టగా, 2020లో లాంఛనంగా ఎన్నికయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పదవీకాలం 2024 జూలై వరకూ పొడిగించారు. నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఆరోగ్యశాఖను అప్పగించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఆయన జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ వచ్చారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒకే పదవి ఉండాలనే క్రమంలో కొత్త నాయకుడికి బాధ్యత అప్పగించేందుకు బేజీపీ అధిష్ఠానం తాజాగా కసరత్తు చేస్తోంది.
దక్షిణాదికి అవకాశం?
పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఉండవచ్చనే ఒక ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలం పెంచుకుంటూ ముందుకెళ్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వంతో కలిసి అధికారం పంచుకుంటోంది. ఈక్రమంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒకరికి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. గతంలోనూ దక్షిణాదికి ప్రాధాన్యత కల్పించిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెదిన బంగారు లక్ష్మణ్ 2000-2001 మధ్య పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తమిళనాడుకు చెందిన జానా కృష్ణమూర్తి 2001-2002 మధ్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం.వెంకయ్యనాయుడు 2002-2004 మధ్య పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు.
రేసులో ఎవరు?
దక్షిణాదికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగితే పలువురి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. వారిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, డాక్టర్ కె.లక్ష్మణ్ - ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, వనతి శ్రీనివాసన్- మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు ఉండవచ్చు. మహిళా నేతకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే మాత్రం ఒక మహిళకు బీజేపీ మొదటిసారి పార్టీ పగ్గాలు అప్పగించినట్టవుతుంది.
ఇవి కూడా చదవండి
Boat Fire Accident : మంటల్లో చిక్కుకున్న ఫిషింగ్ బోటు.. 20 మంది మత్స్యకారులు..
Mamata Banerjee: నకిలీ ఓటర్లతో ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు
Ministerial orders: పార్సిళ్లకు ప్లాస్టిక్ వద్దు.. ఇడ్లీ తయారీలోనూ గుడ్డలు మాత్రమే వాడాలి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.