Poll Results: ఆ మార్పే కమలనాథుల విజయానికి కారణమా?
ABN , First Publish Date - 2023-03-02T19:41:39+05:30 IST
ఈ విజయం వెనుక కమలనాథులు ఓ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశారు.
న్యూఢిల్లీ: త్రిపుర(Tripura), మేఘాలయ(Meghalaya), నాగాలాండ్ (Nagaland) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. త్రిపురలో భారతీయ జనతా పార్టీ(BJP) మరోసారి అధికారం నిలబెట్టుకుంది. అయితే ఈ విజయం వెనుక కమలనాథులు ఓ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశారు. త్రిపురలో ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక బిప్లవ్ దేవ్ సీఎం అయ్యారు. అయితే కొద్ది రోజుల్లోనే ఆయన ప్రజాదరణను కోల్పోతున్నారని తెలిసి బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. డాక్టర్ మాణిక్ సాహాను సీఎం చేసింది. అంతే ఆయన జాగ్రత్తగా అడుగులు వేస్తూ పాలనలో తనదైన ముద్ర వేశారు. దీంతో ప్రజలు బీజేపీకి మరోసారి అధికారం కట్టబెట్టారు. సీఎంలను మారుస్తూ కమలనాథులు విజయవంతమవడం ఇది మొదటి సారి కాదు. ఉత్తరాఖండ్(Uttarakhand)లో త్రివేంద్ర సింగ్ రావత్‌ను తొలగించి తిరత్ సింగ్ రావత్‌కు, ఆ తర్వాత ఆయన్ను కూడా తప్పించి 2021లో పుష్కర్ ధామికి సీఎం బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల్లో స్వయంగా ఓడిపోయినా పార్టీని మాత్రం ధామి విజయపథంలో నిలిపారు. మరోసారి సీఎం అయ్యారు.
గుజరాత్(Gujarat)లో కూడా ఇదే ఫార్ములా వాడారు. విజయ్ రూపానీని తప్పించి భూపేంద్రభాయ్ పటేల్‌కు బాధ్యతలు అప్పగించారు. తిరిగి అధికారం దక్కించుకున్నారు.
ఇదే ఫార్ములా ను కర్ణాటక(Karnataka)లోనూ అమలు చేశారు. ఎడ్యూరప్పను తప్పించి బస్వరాజ్ బొమైకి సీఎం బాధ్యతలు అప్పగించారు. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
కేవలం సీఎంలను మార్చడమే సక్సెస్ ఫార్ములా అని చెప్పలేం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా, ప్రజారంజక పాలన అందిస్తేనే ప్రజలు పట్టం కడతారని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.